Share News

కొండలు దిగి.. బ్యాంకులకు వచ్చి..!

ABN , Publish Date - May 03 , 2024 | 12:04 AM

జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో పింఛన్‌దారులకు గురువారం అవస్థలు తప్పలేదు. ఈ నెల పింఛన్‌ సొమ్మును లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేయడంతో దివ్యాంగులు, వృద్ధులు తదితరులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

కొండలు దిగి.. బ్యాంకులకు వచ్చి..!
మక్కువలోని ఓబ్యాంకులో వద్ద పింఛనుదారులు ఇలా..

ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపాటు

తమపై కక్షగట్టి ఇలా చేస్తోందని ఆగ్రహం

పార్వతీపురం, మే2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో పింఛన్‌దారులకు గురువారం అవస్థలు తప్పలేదు. ఈ నెల పింఛన్‌ సొమ్మును లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేయడంతో దివ్యాంగులు, వృద్ధులు తదితరులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివిధ బ్యాంకుల వద్ద పడిగాపులు కాశారు. గ్రామీణ ప్రాంతవాసులు మండుటెండలో సుమారు 15 నుంచి 20కిలోమీటర్లు ప్రయాణించి పట్టణాల్లో ఉన్న బ్యాంకులకు చేరాల్సి వచ్చింది. గిరిజన ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులైతే కొండలు దిగి ఉదయాన్నే బ్యాంకుల వద్దకు చేరుకుని క్యూలైన్‌లో నిరీక్షించారు. దీంతో పింఛన్‌దారులు వైసీపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. కొన్నిచోట్ల బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం, కేవైసీ కాకపోవడం, జీరో బ్యాలెన్స్‌ ఉండడం, కొద్ది నెలలుగా వారి ఖాతాల నుంచి లావాదేవీలు జరగకపోవడంతో పింఛన్‌దారులు పింఛన్‌ నగదు తీసుకునేందుకు ఇక్కట్లపాలయ్యారు. విత్‌డ్రా ఫాం నింపలేకపోవడం, సర్వీసుల పేరుతో డబ్బులకు కోత పడడంతో ఇకొందరు ఆవేదనతో తిరుగుముఖం పట్టారు. కొంతమంది పింఛన్‌దారులకు చేతికి పైసా అందకుండా మొత్తం నగదు బాంకులోనే కట్‌ అయిపోయింది. దీనిపై సిబ్బందిని ప్రశ్నించగా ఏటీఎం చార్జీలు, ఎస్‌ఎంఎస్‌ చార్జీలు, మెంటైనెన్స్‌, ఇతరత్రా చార్జీలు అంటూ చెప్పుకొచ్చారు. ఈ ప్రక్రియ బ్యాంకు నిబంధనల ప్రకారమే జరుగుతోందని సమాధానం ఇవ్వడంతో పాపం పింఛనుదారులు చేసేదిలేక నిరాశతో ఇంటిబాట పట్టారు. మొత్తంగా జిల్లాలో ఏ బ్యాంకు వద్ద చూసినా పింఛనుదారుల అవస్థలే కనిపించాయి. ఇదంతా వైసీపీ కుట్ర అని పలువురు బహిరంగంగా వ్యాఖ్యానించారు. ‘గత నెల సచివాలయాల్లో పింఛను ఇచ్చారు కదా.. ఈసారి అలా ఎందుకు ఇవ్వలేదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే సర్కారు పింఛన్‌ డబ్బులను బ్యాంకు ఖాతాలో వేసింది.’ అని మరికొందరు వాపోయారు. ఈ నెల 13న పోలింగ్‌ రోజున ఓటుతో తగిన విధంగా బుద్ధి చెబుతామని తెలిపారు.

వివిధ చోట్ల ఇలా..

- పార్వతీపురం రూరల్‌: పార్వతీపురం మండలంలోని 30 పంచాయతీల పరిధిలో ఉన్న అనేకమంది పింఛన్‌దారులు పార్వతీపురం పట్టణంలో బ్యాంకుల వద్ద గంటలకొద్దీ లైన్‌లో నిరీక్షించారు. ఇంకొందరు వాటర్‌ ప్యాకెట్లు తలపై పెట్టుకుని బ్యాంకు ప్రాంగణంలోనే కూర్చోవల్సి వచ్చింది. మొత్తంగా తీవ్ర ఇక్కట్లు పడి పింఛన్‌ సొమ్ము తీసుకోవాల్సి వచ్చింది.

- గరుగుబిల్లి: మండలానికి సంబంధించి పలు రకాల పింఛన్లు 8,400 ఉన్నాయి. 70 శాతం మేర లబ్ధిదారుల ఖాతాల్లో పింఛన్‌ మొత్తాలు జమయ్యాయి. అయితే పింఛన్‌దారులకు మండల కేంద్రంలోని బ్యాంకుల్లో నిరీక్షణ తప్పలేదు.

- గుమ్మలక్ష్మీపురం: మండలంలో 6,700 మందికి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా 895 మందికి వారి ఇళ్లకు పంపిణీ చేశారు. మిగిలిన వారికి బ్యాంకు ఖాతాల్లో పింఛను సొమ్ము చేశారు. కాగా ఈ పింఛన్ల కోసం మారుమూల పంచాయతీలైన వంగర, నోండ్రుకోన, కేదారిపురం, రెళ్లగొయ్యి,పాక, బీరుపాడు, సీహెచ్‌.బిన్‌డి తదితర మారుమూల పంచాయతీలకు చెందిన పింఛనుదారులు ఉదయాన్నే మండల కేంద్రంలో బ్యాంకుల వద్ద పడిగాపులు కాశారు.

- మక్కువ: పింఛన్‌దారులతో మండల కేంద్రంలోని పలు బ్యాంకులు రద్దీగా మారాయి. ఎండలు మండుతుండగా.. బ్యాంకులకు వెళ్లేందుకు పెన్షన్‌దారులు ఆపసోపాలు పడ్డారు. క్యూలో అధిక సమయం నిరీక్షించాల్సి రావడంతో వైసీపీ సర్కారుపై మండిపడ్డారు.

- భామిని: మండలంలో 7,089 మంది పింఛనుదారులు ఉండగా 5,326 మంది బ్యాంకు ఖాతాలకు పింఛన్‌ సొమ్ము జమచేశారు. 1763 మంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సచివాలయ సిబ్బంది పింఛన్లు ఇచ్చారు. కాగా పింఛన్‌దారులతో గురువారం భామినిలో ఉన్న బ్యాంకులు గురువారం కిక్కిరిశాయి. నిలబడడానికి కూడా చోటు లేకపోయింది. బ్యాంకు మిత్రలు ద్వారా పింఛన్లు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు వేచి చూసి డ్రా తీశారు.

-సీతంపేట: మండుటెండలో మండలం నలుమూలల నుంచి పెద్దఎత్తున పింఛన్‌దారులు బ్యాంకులకు చేరారు. అయితే కొన్ని బ్యాంకుల వద్ద నేరుగా నగదు చెల్లించకుండా సర్వీస్‌ కేం ద్రాల సాయంతో పింఛన్లు చెల్లించారు. కాగా బ్యాంకుల్లో పింఛన్‌ జమ అయిందా లేదా అనే దానిపై లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది.

- సీతానగరం/బలిజిపేట: సీతానగరంలోని ఓ బ్యాంకు బీసీ పాయింట్‌ వద్ద పింఛన్‌దారులు నిరీక్షించారు. కొన్ని బ్యాంకుల్లో సర్వర్‌ , ప్రింట్‌ మిషన్‌ పనిచేయకపోవడంతో చాలా దూరం నుంచి వచ్చిన లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విత్‌డ్రా ఫామ్‌ నింపడానికి పలువుర్ని బతిమలాడవల్సి వచ్చింది. బలిజిపేట లోని పలు బ్యాంకుల వద్ద కూడా పింఛన్‌దారులకు ఈ అవస్థలు తప్పలేదు.

వ్యక్తిగతంగా లేఖ ఇచ్చా ...

నా బ్యాంకు ఖాతాకు ఆధార్‌ అనుసంధానం కాలేదు. దీంతో నాకు పింఛన్‌ ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు నిరాకరించారు. తర్వాత నేను బ్యాంక్‌ అధికారులతో మాట్లాడి వ్యక్తిగతంగా ఒక లేఖరాసి ఇచ్చాను. అప్పుడు నాకు పింఛన్‌ ఇచ్చారు.

- సంగం, ఓ పింఛన్‌దారుడు, పార్వతీపురం

==================

మండుటెండలో ప్రయాణించి..

మండుటెండలో సుమారు 15 కిలోమీటర్లు ప్రయాణించి.. పింఛన్‌ కోసం బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చింది. గత నెలలో ఇంటికి తెచ్చి ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదో అర్థం కాడం లేదు. ఓటు ద్వారా వైసీపీకి తగిన విధంగా బుద్ధి చెబుతాం.

- ఓ పింఛన్‌దారుడు, పార్వతీపురం

Updated Date - May 03 , 2024 | 12:04 AM