Share News

తాగునీటికి కటకట

ABN , Publish Date - Apr 02 , 2024 | 11:57 PM

వేసవి వచ్చిదంటే జిల్లా ప్రజలకు హడలే. చాలా గ్రామాల్లో దాహం కేకలు వినిపించడం సర్వసాధారణమైపోయింది. గిరిజన ప్రాంతాల్లో చెలమల నీరే ఆధారమవుతోంది.

తాగునీటికి కటకట
వాగు నీటిని పడుతున్న గిరిజన మహిళలు

వేసవి వచ్చిదంటే జిల్లా ప్రజలకు హడలే. చాలా గ్రామాల్లో దాహం కేకలు వినిపించడం సర్వసాధారణమైపోయింది. గిరిజన ప్రాంతాల్లో చెలమల నీరే ఆధారమవుతోంది. విజయనగరంలో రిక్షాలు, ఆటోల్లో నీరు తీసుకువెళ్లి రెండు లేదా మూడు రోజులు నిల్వ చేసుకుంటారు. ఈ ఏడాదీ అదే పరిస్థితి కనిపి స్తోంది. కొన్ని గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో చేతిబోర్ల నుంచి నీరు రావడం లేదు. మరోవైపు జల్‌శక్తి పథకం కింద కేంద్రం కొళాయి కనెక్షన్లు ఇచ్చినా ఎక్కడా పనులు పూర్తి కాలేదు. అవి దిష్టిబొమ్మల్లా మిగిలాయి.
నీటి కోసం నిరీక్షణే..
వంగర, ఏప్రిల్‌ 2: అరసాడ, సీతారాంపురం, పటువర్దనం, లక్షింపేట తదితర గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్ల నుంచి నీటి సరఫరా పూర్తిగా తగ్గిపోయింది. కొళాయి నీటి కోసం గంటల  కొద్దీ నిరీక్షిస్తుంటారు. అయినా కొద్దినీరే రావడంతో ఇబ్బంది పడుతున్నారు. మండలంలోని 39 గ్రామాల్లో 480 వరకు హేండ్‌బోర్లు ఉన్నట్లు అధికారు లు లెక్కలు చెబుతున్నా ఆ గ్రామాల్లో మాత్రం బోర్లు పనిచేయడం లేదు. కొట్టిశ, లక్షిం పేట, రాజులగుమ్మడ గ్రామస్థులు పొలాల్లోని నేలబావులు, వేగా వతి, నాగావళి నదుల్లోని చెలమల నీటిని తెచ్చుకుంటున్నారు.
బొబ్బిలిలో మూడురోజులకోసారి సరఫరా..
బొబ్బిలి, ఏప్రిల్‌ 2: బొబ్బిలి పట్టణంతో పాటు మండలంలోని అనేక గ్రామాల్లో తాగునీటికి ఎద్దడి మొదలైపోయింది. బొబ్బిలిలో రోజు విడిచి రోజు తాగునీటిని సరఫరా చేస్తామని ఏకంగా మున్సిపాలిటీ అధికారికంగా ప్రకటించేసింది. ఇందిరమ్మకాలనీ, గొలపల్లి, మల్లమ్మపేట, చర్చి సెంటరు రోడ్డు తదితర ప్రాంతాల్లో తాగునీటికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ట్యాంకర్లు వచ్చినా అందరికీ నీరు అందడం లేదు. పట్టణంలోని పల్లపు ప్రాంతాల వారి ఇక్కట్లు అంతే లేదు. కొళాయి నీరు వారికి సరిగా రావడం లేదు. దీంతో లోతుగా గోతులు తవ్వుకుని వచ్చే అరకొర నీటిని తోడుకుంటున్నారు.
- బొబ్బిలి మండలం శివడగ్రామానికి మన్యం జిల్లా బలిజిపేట మండలం అంపావల్లి స్కీము నుంచి 20 ఏళ్లుగా తాగునీరు అందుతోంది. అయితే నది ఎండిపోవడంతో తాగునీరు సరఫరా కావడం లేదు. ప్రత్యామ్నాయంగా స్థానిక బోరునుంచి తాగునీటిని పంపింగ్‌ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అంతలో కోడ్‌ ఉందని, పనులు ఆపేయాలని అధికారులు చెప్పడంతో గ్రామస్థులు తాగునీటికి అవస్థలు పడుతున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులను కలిసి అర్ధించినా పట్టించుకోవడం లేదని గ్రామసర్పంచ్‌ అధికారులను అర్ధించాను ః వెంగల లక్ష్మీరాణినారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు.
- బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామంలో రూ. 30 లక్షలతో ఇంటింటి కుళాయిలు ఏర్పాటు చేశారు. పనులు పూర్తికాకపోవడంతో అవి నిరుపయోగంగా మిగిలాయి. రెండు, మూడురోజులకోసారి పబ్లిక్‌ కుళాయిల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు.
- అలజంగి గ్రామంలో విద్యుత్‌ లైనుపనుల కారణంగా తాగునీటి పైపులైను పాడైంది. గ్రామంలో సుమారు పది రోజుల నుంచి తాగునీటి సరఫరా నిలిచిపోయింది.
- భోజరాజపురం వద్ద వేగావతి నదిలో ఉన్న ఊట బా వుల నుంచి బొబ్బిలి పట్టణానికి తాగునీరు సరఫరా అవు తోంది. ఇసుక దొంగల కారణంగా ప్రస్తుతం నదిలోని ఊటబావుల వద్ద నీటి నిల్వలు ఉండడం లేదు. పెద్దగెడ్డ నుంచి వేగావతిలోకి నీటిని విడిచిపెడుతున్నా బావుల కు నీరందడం లేదు. దీంతో అనేక వార్డులకు ట్యాంకర్లు, హ్యాండ్‌బోర్లే దిక్కవుతున్నాయి.
చెలమలే ఆధారం..
మెంటాడ, ఏప్రిల్‌ 2: కొండ లింగాలవలస, శీలవలస లోతుగెడ్డ పంచాయతీల పరిధిలోని వేప గుడ్డి, పోరపుబాడవ లో గిరిజనులు తాగునీటికి నోచడం లేదు. శీలవలస గ్రామాన్ని ఆనుకొని వెళ్లే వాగునీరే వారికి దిక్కు. అన్నికాలాల్లోనూ వారికి దాహం కేకలే. వానాకాలంలో వాగునీటిని వడగట్టి తాగు తారు. వేసవిలో ఎండిన వాగు గర్భంలో చెలమల నీళ్లను పట్టుకుంటారు. రక్షిత నీటికి నోచుకోవడం లేదు. దీంతో తరచూ అతిసారం, డయేరియాతో చాలా మంది బాధపడుతున్నారు. చేతిపంపు అయినా ఏర్పాటు చేయాలని వారిచ్చే వినతులను ఏ నేతా పరిగణనలోకి తీసుకోవడం లేదు. లోతుగెడ్డ పంచాయతీ మధుర పోరవుబాడవ, వేప గుడ్డు గ్రా మాలు ఆండ్ర జలాశయం ఆవల వున్నాయి. వారందరికీ ఒక్క చేతిపంపే ఆధారం. అది నిత్యం మొరాయిస్తూనే వుంటుందని గిరిజను లు చెబుతున్నారు. ఆ సమయాల్లో చంపావ తి నదిలోని ఊట నీరే వారికి శరణ్యం.

Updated Date - Apr 02 , 2024 | 11:57 PM