‘గణ’ సంబరం
ABN , Publish Date - Jan 27 , 2024 | 12:50 AM
గణతంత్ర సంబరాలతో జిల్లా మురిసింది. సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ శాఖల శకటాలు, స్టాల్స్, విద్యార్థుల నృత్యప్రదర్శనలతో విజయ నగరం పోలీసు పరేడ్ గ్రౌండ్ కళకళలాడింది.
- జిల్లా వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు
- అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు
- ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
గణతంత్ర సంబరాలతో జిల్లా మురిసింది. సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ శాఖల శకటాలు, స్టాల్స్, విద్యార్థుల నృత్యప్రదర్శనలతో విజయ నగరం పోలీసు పరేడ్ గ్రౌండ్ కళకళలాడింది. శుక్రవారం ఉదయం పోలీసు వందనంతో కార్యక్రమం ప్రారంభమైంది. కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముందుగా పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. వివిధ పాఠశాలలకు చెందిన చిన్నారులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన అబ్బుర పరచింది. డాగ్ షో అలరించింది. ఉత్తమ సేవలందించిన 74 ప్రభుత్వ శాఖలకు చెందిన 384 మంది అధికారులు, సిబ్బందికి అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. పలు శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటైన స్టాల్స్‌ను సందర్శించి లబ్ధిదారులకు చెక్కులు, ఆటో, ఉపకరణాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయాధికారి బి.సాయికల్యాణ చక్రవర్తి, ఎస్పీ దీపిక, జేసీ మయూర్ అశోక్ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సమిష్టి సహకారంతో జిల్లా అభివృద్ధికి బాటలు వేద్దాం: కలెక్టర్ నాగలక్ష్మి
సమష్టి సహకారంతో జిల్లా అభివృద్ధికి బాటలు వేద్దామని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పిలుపునిచ్చారు. పోలీస్ పరేడ్ గౌండ్‌లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవంలో ఆమె ప్రసంగించారు. ఎందరో మహానుభావుల త్యాగం, పోరాటం కారణంగా స్వాతంత్య్రం లభించిందన్నారు. జిల్లా ఆవిర్భావం తరువాత అనేక రంగాల్లో అభివృద్ధి చెందినట్లు వివరించారు. ప్రజా ప్రతినిధులు, ప్రజలు, వివిధ శాఖల అధికారుల సహకారం ద్వారా మరింత అభివృద్ధిని సాధిద్దామని పిలుపునిచ్చారు. జిల్లా మీదుగా జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతున్నట్లు వెల్లడించారు. జిల్లాలో వైద్య కళాశాల, గిరిజన విశ్వ విద్యాలయం, ఫిషింగ్ జట్టీ, వివిధ ప్రభుత్వ భవన నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. చిరుధాన్యాల ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తున్నామన్నారు. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. మత్స్య భరోసా, విద్యా రంగంలో సంస్కరణలు చేపట్టామన్నారు. సొంత ఇంటి కళ నెరవేర్చేందుకు జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నామన్నారు. ఆసరా, చేయూత, సున్నావడ్డీ పథకాల ద్వారా జీవన ప్రమాణాలు పెంపొందిస్తున్నామ న్నారు. రక్షిత మంచినీటిని అందించేందుకు వీలుగా జాతీయ జలజీవన్‌మిషన్ ద్వారా 2.98 లక్షల కొళాయి కనెక్షన్లు అందించామన్నారు. దీనికోసం ఇప్పటి వరకు రూ.978 కోట్లు ఖర్చు చేశామన్నారు. పరిశ్రమల కోసం ఎస్.కోట మండ లంలో 985.7 ఎకరాల ప్రభుత్వ భూమిని అందించినట్లు వివరించారు. ఇలా జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.