Share News

నిధులు పక్కదారి

ABN , Publish Date - Mar 11 , 2024 | 11:33 PM

మండల పరిషత్‌ కార్యాలయంలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. కార్యాలయ పరిపాలన ఖర్చులకు మంజూరవుతున్న మండల పరిషత్‌ సాధారణ నిధులు పక్కదారి పడుతున్నాయి. రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది.

 నిధులు పక్కదారి
మండల పరిషత్‌ కార్యాలయం కిటికీలు ఊడిన దృశ్యం

-మండల పరిషత్‌ కార్యాలయంలో అవకతవకలు

- రికార్డుల నిర్వహణలో లోపం

- అభివృద్ధికి నోచుకోని కార్యాలయ భవనం

- ఎటు చూసినా చెదలే దర్శనం

గరుగుబిల్లి, మార్చి 11: మండల పరిషత్‌ కార్యాలయంలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. కార్యాలయ పరిపాలన ఖర్చులకు మంజూరవుతున్న మండల పరిషత్‌ సాధారణ నిధులు పక్కదారి పడుతున్నాయి. రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. చేసిన పనులకు సంబంధించిన రసీదులు కనిపించడం లేదు. ఫలితంగా మండల పరిషత్‌ కార్యాలయ భవనం అభివృద్ధికి నోచుకోవడం లేదు. కార్యాలయంలో ఎటువైపు చూసినా చెదలే దర్శనమిస్తోన్నాయి. మండల పరిషత్‌కు సంబంధించి పలు కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన నిధులు మంజూరవుతున్నా పనులు మాత్రం జరగడం లేదు. ఈ నిధులను మళ్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పనుల నిర్వహణకు అవసరమైన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఇదిలాఉండగా మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం హాలు అధ్వానంగా ఉంది. తలుపులు, కిటికీలకు చెదలు పట్టాయి. ఏ మూల చూసినా చెదలే దర్శనమిస్తోన్నాయి. సాధారణ నిధులు అత్యవసర వినియోగం, స్టేషనరీ, కార్యాలయం క్లీనింగ్‌, మరమ్మతుల పేరిట పక్కదారి పడుతున్నాయి. గతంలో విధులు నిర్వహించిన ఎంపీడీవో పలు అక్రమాలకు పాల్పడినా ఎటువంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులకు సంబంధించి రికార్డుల నిర్వహణలో లోపం నెలకొంది. నిధులు ఖర్చు అయ్యాయి తప్ప వీటికి సంబంధించిన రశీదులు మాత్రం కనిపించడం లేదు. ఈ నెల 2న జిల్లా పరిషత్‌ సీఈవో కె.రాజ్‌కుమార్‌ 2022-23 ఆర్థిక సంవత్సరం ఖర్చులు వార్షిక తనిఖీకి వచ్చిన సమయంలో రికార్డులు అస్తవ్యస్తంగా ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పలువురు సిబ్బందికి ఈ నెల 6న షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అయితే కార్యాలయంలో నెలకొన్న పరిస్థితులను సీఈవో దృష్టికి తీసుకువెళ్లినా స్పందన కరువైంది.

సమస్యలు తెలియజేశాం

మండల పరిషత్‌ కార్యాలయంలో నెలకొన్న సమస్యలను జిల్లా పరిషత్‌ సీఈవోకు వివరించాం. కార్యాలయానికి ఆనుకుని ఉన్న కిటికీలు, తలుపులు, తదితర వాటికి మరమ్మతుల కోసం మండల పరిషత్‌ సాధారణ నిధులు కేటాయించిన దానిపై ఆరా తీస్తాం. పనులు నిర్వహించకుంటే గత ఎంపీడీవో నుంచి రికవరీ చేయిస్తాం. పూర్తిస్థాయిలో రికార్డులు పరిశీలించాల్సి ఉంది. అవకతవకలు జరిగినట్లయితే తగు చర్యలు నిమిత్తం జిల్లా పరిషత్‌ సీఈవో దృష్టికి తీసుకువెళ్తాను.

-పి.సూర్యనారాయణ, ఎంపీడీవో, గరుగుబిల్లి

Updated Date - Mar 11 , 2024 | 11:33 PM