పాఠశాలల నిర్వహణకు నిధులు
ABN , Publish Date - Oct 19 , 2024 | 11:54 PM
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శనివారం ప్రకటించారు. దీనిపై జిల్లా ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హర్షం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు
సాలూరు రూరల్, అక్టోబరు 19: ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శనివారం ప్రకటించారు. దీనిపై జిల్లా ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం పాఠశాలల నిర్వహణకు నిధులు కేటాయించలేదు. దీంతో ప్రధానోపాధ్యాయులు తమ సొంత సొమ్మును వినియోగించేవారు 2021-2022లో పూర్తిగా నిర్వహణ నిధులు ఇవ్వని వైసీపీ ప్రభుత్వం.. 2022-2023లో 20 శాతమే మంజూరు చేసింది. ఈ నిధులు సైతం అన్ని పాఠశాలలకు ఇవ్వలేదు. 2023-2024లోనూ రిక్తహస్తం చూపింది. దీంతో సుద్దముక్క నుంచి వివిధ మరమ్మతులు, జాతీయ పండగలు, ప్రభుత్వ కార్యక్రమాలు ఎంఈవోలు కోరిన సమాచారం, వివిధ జిరాక్స్‌లు, తల్లిదండ్రులు, విద్యాకమిటీ సమావేశాల నిర్వహణ ఖర్చులను ప్రధానోపాధ్యాయులు భరించాల్సి వచ్చేది. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం పాఠశాలల నిర్వహణకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో కేటాయింపులు లేక..
పాఠశాలలో 20 మంది లోపు విద్యార్థులుంటే రూ. 10 వేలు, 49 మంది ఉంటే రూ. 15 వేలు, 100 మంది లోపు ఉంటే రూ. 20 వేలు, 250 మంది లోపు ఉంటే రూ. 50 వేలు, 251 నుంచి 1000 లోపు విద్యార్థులుంటే రూ. 75 వేలు , వేయి మంది కంటే అధికంగా ఉంటే రూ. లక్ష ప్రభుత్వం అందించేది. వీటితో పాటు మండలాల్లో ఎమార్సీలు ( ప్రస్తుతం ఎంఈవో కార్యాలయాలు ) నిర్వహణ రూ. 80 వేలు అందించేవారు. ఈ నిధులు మంజూరు కాక మండలంలో విద్యాపనులు నిర్వహణకు ఎంఈవోలు సైతం చేతి చమురు వదిలించుకున్నారు.
కూటమి సర్కారు ప్రకటనపై హర్షం
జిల్లాలో 15 ఎంఈవో కార్యాలయాలు, 1293 ప్రాథమిక, 102 ప్రాథమికోన్నత, 187 ఉన్నత పాఠశాలలున్నాయి. వాటిల్లో 94 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వాటి నిర్వహణకు త్వరలో కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది. 2024-2025 విద్యాసంవత్సరానికి సంబంధించి పీఎంశ్రీ పాఠశాలలకు రూ. 8.63 కోట్లు, కేజీబీవీలకు రూ. 35.16 కోట్లు, ఎంఈవో కార్యాలయాలు (ఎమ్మార్సీ)లు నిర్వహణకు రూ. 8.82 కోట్లు, పాఠశాలలకు రూ. 51.90 కోట్లు అందించనున్నారు. ఈ నిధులు సైతం రెండు రోజుల్లో జమకానుండడంతో ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.