ఉచితం.. సాకారం
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:37 PM
ఉచిత ఇసుక పథకం జిల్లాలో ప్రారంభమైంది. స్టాక్ పాయింట్లుగా నిర్ణయించిన బొబ్బిలి, కొత్తవలస, డెంకాడ నుంచి సోమవారం సరఫరా మొదలైంది. టన్ను ఇసుక ధర రూ.605గా జిల్లా కమిటీ నిర్ణయించింది. దీంట్లో ప్రభుత్వ ఫీజు లేదు. నిర్వహణ,

ఉచితం.. సాకారం
జిల్లాలో ఇసుక సరఫరా ప్రారంభం
టన్ను ఇసుక రూ.605గా నిర్ణయం
మూడు స్టాక్ పాయింట్లలో 92వేల టన్నులు
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
ఉచిత ఇసుక పథకం జిల్లాలో ప్రారంభమైంది. స్టాక్ పాయింట్లుగా నిర్ణయించిన బొబ్బిలి, కొత్తవలస, డెంకాడ నుంచి సోమవారం సరఫరా మొదలైంది. టన్ను ఇసుక ధర రూ.605గా జిల్లా కమిటీ నిర్ణయించింది. దీంట్లో ప్రభుత్వ ఫీజు లేదు. నిర్వహణ, సీనరేజీ చార్జీలు కలిపి ధరగా నిర్ణయించారు. ఒకరికి రోజుకు 20 టన్నుల ఇసుక కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. అయితే జీఓ సకాలంలో జిల్లా అధికారులకు చేరకపోవడంతో తొలిరోజు ఇసుక అమ్మకాలు ఆలస్యంగా మొదలయ్యాయి. సోమవారం సాయంత్రం వరకు ఇసుక కోసం కొనుగోలుదారులు వేచి చూశారు. అన్నిచోట్లా స్టాకు అయితే సిద్ధం చేశారు. డెంకాడ స్టాక్ పాయింట్‌ను గనుల శాఖ డీడీ పర్యవేక్షించారు. ఆన్‌లైన్లో చెల్లించాల్సిన నగదు చెల్లింపుల విషయంలో స్పష్టత రాకపోవటంతో మొదటి రోజు అమ్మకాలకు అవరోధం ఏర్పడింది.
- బొబ్బిలి గ్రోత్ సెంటర్లో భారీగా ఇసుక నిల్వలు ఉన్నాయి. నాగావళి నది నుంచి ఇసుక నిల్వలను తరలించి స్టాక్ చేశారు. అలాగే డెంకాడ మండలం పెదతాడివాడ వద్ద విజయనగరం చుట్టుపక్కల ప్రాంతాల వినియోగదార్లకు అందుబాటులో ఉండేలా స్టాక్ పాయింట్ పెట్టారు. ఈ కేంద్రానికి శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నది నుంచి ఇసుక నిల్వలను తెప్పిస్తున్నారు. ఇక కొత్తవలస కేంద్రానికి గోస్తని నది నుంచి నిల్వలు తీసుకువచ్చి డంప్ చేస్తున్నారు. ఇలా జిల్లాలోని మూడు ప్రధాన కేంద్రాల్లో వినియోగదార్లకు ఇసుకను అందుబాటులో ఉంచారు.
- మూడు స్టాక్ పాయింట్ల వద్ద 92వేల టన్నుల ఇసుకను సిద్ధం చేశారు. కొత్తవలసలో 11,805, డెంకాడలో 9,756, బొబ్బిలిలో 72,466 టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. జిల్లాలో ఇసుక రీచ్‌లు లేనందున శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లోని నదుల నుంచి ఇసుకను తీసుకు వచ్చి స్టాక్ చేసేందుకు నిర్ణయించారు. ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు మాత్రమే అమ్మకాలకు అనుమతించారు. అమ్మకాలపై సందేహాలు, ఫిర్యాదుల కోసం ఫోన్ నంబర్ 9032338135ను సంప్రదించవచ్చు. జిల్లా స్థాయిలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు వీలుగా రెవెన్యూ, గనుల శాఖ, సెబ్, పంచాయతీరాజ్ శాఖల అధికారుల ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. అయితే మొదటి రోజు ఇసుక అమ్మకాలు వినియోగదార్లను కాస్త నిరాశ పరిచాయి.
కొత్తవలసలో..
కొత్తవలస : కొత్తవలస పంచాయతీ అర్దానపాలెం మోడల్ స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన ఇసుక స్టాక్ పాయింట్‌ను శృంగవరపుకోట శాసస సభ్యురాలు కోళ్ల లలిత కుమారి సోమవారం సాయంత్రం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఉచిత ఇసుక పాలసీ పేదలకు వరమన్నారు. కార్యక్రమంలో నాయకులు గొరపల్లి రాము, కొరుపోలు అప్పారావు, బొబ్బిలి రమణ, రెడ్డిపైడం నాయుడు పాల్గోన్నారు.
బొబ్బిలిలో..
బొబ్బిలి: బొబ్బిలి ఏపీఐఐసీ గ్రోత్‌సెంటరులో ఇసుక నిల్వకేంద్రాన్ని సోమవారం సాయంత్రం ఆర్డీవో ఆదిమూలం సాయిశ్రీ ప్రారంభించారు. గతంలో ఇక్కడ గనులశాఖ ఆధ్వర్యంలో ఇసుక నిల్వకేంద్రాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా ఈ కేంద్రంలో కార్యకలాపాలు నిలిచిపోయాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో మళ్లీ ఈ కేంద్రాన్ని రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ కేంద్రంలో వీఆర్‌ఓ, వీఆర్‌ఏ, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు సేవలందిస్తార న్నారు. కార్యక్రమంలో తహసీల్దారు త్రినాథరావునాయుడు, ఆర్‌ఐ కళ్యాణచక్రవర్తి, టీడీపీ నాయకులు గెంబలి శ్రీనివాసరావు, బొద్దాన అప్పారావు, కాగాన సునీల్ తదితరులు పాల్గొన్నారు.