Share News

నాలుగేళ్లయినా..

ABN , Publish Date - Feb 07 , 2024 | 11:46 PM

ఇదేదో పాత భవనం అనుకుంటే పొరబడినట్టే. సీతానగరంలో పీహెచ్‌సీ నూతన భవనం ఇది. అర్థంతరంగా పనులు నిలిచి పోవడంతో ఇలా మారింది. నాలుగేళ్లయినా ఈ పీహెచ్‌సీ భవన నిర్మాణానికి మోక్షం కలగడం లేదు. పనులు తుది దశకు చేరుకోవడం లేదు.

నాలుగేళ్లయినా..
సీతానగరంలో పీహెచ్‌సీ భవనం ఇలా..

ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి

వైద్య సిబ్బంది, రోగులకు తప్పని అవస్థలు

ఇదేదో పాత భవనం అనుకుంటే పొరబడినట్టే. సీతానగరంలో పీహెచ్‌సీ నూతన భవనం ఇది. అర్థంతరంగా పనులు నిలిచి పోవడంతో ఇలా మారింది. నాలుగేళ్లయినా ఈ పీహెచ్‌సీ భవన నిర్మాణానికి మోక్షం కలగడం లేదు. పనులు తుది దశకు చేరుకోవడం లేదు. నేటికీ అందు బాటులోకి రాకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవంగా మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం శిథిలావస్థకు చేరింది. దీంతో 2020లో ఆ ప్రాంతానికి సమీపంలోనే నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నాడు-నేడు కింద రూ.కోటి అరవై లక్షలతో పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగారావు శిలాఫలకం కూడా ఆవిష్క రించారు. అయితే ఇప్పటికీ నిర్మాణం పూర్తవడం లేదు. అర్ధాంతరంగా పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం పిచ్చిమొక్కలతో పాడుబడిన భవనంలా అది దర్శనమిస్తోంది. ఎన్నికలకు సమయం సమీపిస్తుండగా.. ఇది ఎప్పటికి అందుబాటులోకి వస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం పాత భవనంలో సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. ఏ క్షణంలో భవనం కుప్పకూలుతుందోనని వారు భయాందోళన చెందుతున్నారు. పాత భవనంలో తరచూ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా వారంలో రెండు సీలింగ్‌ ఫ్యాన్లు పోతున్నాయి. వర్షం పడితే.. స్లాబ్‌ నుంచి నీరు కారిపోతుండగా.. మందులు, బెడ్‌లు తడిసి పోతున్నాయి. మరోవైపు రోగులు కూడా శిథిలావస్థలో ఉన్న పీహెచ్‌సీకి వెళ్లాలంటే జంకుతున్నారు. నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా.. అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై ఆర్‌అండ్‌బీ జేఈ రామ్మోహన్‌ను వివరణ కోరగా.. భవన నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్‌ సూదూర ప్రాంతం నుంచి జిల్లాకు రావల్సి ఉండడంతో పనులను మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారని తెలిపారు. దీనిపై ఆయనకు నోటీసు కూడా అందించామన్నారు. కొత్త కాంట్రాక్టర్‌తో మాట్లాడి పనులు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.

- సీతానగరం

Updated Date - Feb 07 , 2024 | 11:46 PM