Share News

నాలుగున్నరేళ్లుగా నిర్లక్ష్యం

ABN , Publish Date - Feb 01 , 2024 | 11:32 PM

‘వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నాం. సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి కోట్లాది రుపాయలు వెచ్చిస్తున్నాం.. రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాం..’ ఇదీ వైసీపీ సర్కారు పదే పదే చెప్పే మాటలు. కానీ ఆచరణలో భిన్నంగా వ్యవహరిస్తోంది. క్షేత్రస్థాయిలో సాగునీటి సరఫరాకు కనీస చర్యలు తీసుకోకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.

నాలుగున్నరేళ్లుగా  నిర్లక్ష్యం
నులకజోడులో బోరు ఏర్పాటు చేస్తున్న దృశ్యం (ఫైల్‌)

టీడీపీ ప్రభుత్వం హయాంలో మంజూరైన పనులకు కలగని మోక్షం

ప్రారంభానికి నోచుకోని ఎత్తిపోతల పథకాల నిర్మాణం

నిలిచిన రిజర్వాయర్‌ పనులు.. వెనక్కి మళ్లిన నిధులు

భామిని మండల రైతులకు తప్పని సాగునీటి కష్టాలు

బోర్లు తీసేందుకు అప్పులు.. అదనపు భారంతో అవస్థలు

(భామిని)

‘వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నాం. సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి కోట్లాది రుపాయలు వెచ్చిస్తున్నాం.. రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాం..’ ఇదీ వైసీపీ సర్కారు పదే పదే చెప్పే మాటలు. కానీ ఆచరణలో భిన్నంగా వ్యవహరిస్తోంది. క్షేత్రస్థాయిలో సాగునీటి సరఫరాకు కనీస చర్యలు తీసుకోకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. గత నాలుగున్నరేళ్లుగా సాగునీటి వనరుల పనులకు పెద్దగా నిధులు కేటాయించని వైసీపీ ప్రభుత్వం.. గత టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్‌ నిర్మాణంపైనా దృష్టి సారించ లేదు. కనీసం జలకళ పథంలోనూ బోర్లు మంజూరు చేయకపోవడంతో భామిని మండలంలో రైతులు సాగుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఏటా వరుణుడిపైనే ఆధారపడి పంటలు పండించాల్సిన దుస్థితి. పలు పథకాల ద్వారా రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ సర్కారు మండలంలో సాగునీటి సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదని ఆ ప్రాంతవాసులు ప్రశ్నిస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

భామిని మండలంలో వరి, పత్తి ప్రధాన పంటలు. ఏటా పది వేల ఎకరాలకు పైగా వరి, ఆరు వేల ఎకరాల్లో పత్తిని సాగు చేస్తుంటారు. ఈ ఏడాది 1500 ఎకరాల్లో మొక్కజొన్న కూడా వేశారు. అయితే పత్తి, మొక్కజొన్నకు పెద్దగా సాగునీరు అవసరం లేదు. వరికి వచ్చేసరికి ఇబ్బందులు తప్పడం లేదు. పూర్తిస్థాయిలో సాగునీరు అందకపోవడంతో ఏటా రైతులు తలలు పట్టుకుంటున్నారు. వరుణుడిపైనే ఆధారపడి సాగు చేపడుతున్నారు. గత ఖరీఫ్‌లో వర్షాలు పూర్తిగా కురవకపోవడంతో పంటలన్నీ ఎండిపోయాయి. దీంతో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. అయితే వచ్చే ఖరీఫ్‌లో ఆ కష్టాలు లేకుండా చూడాలని వారు కోరుతున్నారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో..

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వంశధార నది నుంచి కాట్రగడ్డ, నేరడి బ్యారేజీ వద్ద ఎత్తిపోతల పథకాలు, భామిని సమీపంలో కొండలోయగెడ్డ వద్ద రిజర్వాయర్‌ పనులకు నిధులు మంజూరు చేశారు. అయితే ఇంతలో ఎన్నికలు జరగడం, వైసీపీ అధికారంలోకి రావడంతో సీన్‌ మారింది. వైసీపీ ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోవడంతో ఎత్తిపోతల పథకాల నిర్మాణం ప్రారంభానికి నోచుకోకపోగా రిజర్వాయర్‌ పనులు ఆగిపోయాయి. దీంతో నిధులు వెనక్కి మళ్లాయి.

- ఇదిలా ఉండగా గత టీడీపీ ప్రభుత్వం.. భామిని మండలంలో రైతులకు సోలార్‌ సిస్టమ్‌ ద్వారా సుమారు వంద వ్యవసాయ బోర్లు మంజూరు చేసింది. ఐటీడీఏ ద్వారా అర్హులైన వారందరికీ వాటిని అందించారు. ఎస్సీ, ఎస్టీలు రూ.6 వేలు, బీసీ రైతులు రూ.30 వేలు చెల్లిస్తే.. రూ.5 లక్షల విలువ చేసే సోలార్‌ వ్యవసాయ బోరు ప్లాంట్‌ను కేటాయించారు. దీంతో కొన్నాళ్ల పాటు సాగునీటికి ఇటువంటి ఇబ్బందులు ఉండేవి కావు. రైతులు సాఫీగా పంటలు పండించు కునేవారు. అయితే ఇటీవల కాలంలో అవి మరమ్మతులకు గురికాగా వాటిని బాగుచేసే వారే కరువయ్యారు. దీంతో ఆయా ప్లాంట్లు మూలకు చేరాయి. రైతులకు మళ్లీ సాగునీటి కష్టాలు మొదలయ్యాయి.

మరమ్మతు చర్యలేవీ..

వైసీపీ ప్రభుత్వం ఇప్పటికీ మండలంలో సాగునీటి వనరులపై శ్రద్ధ వహించడం లేదు. ప్రధానంగా వంశధార కాలువ నీరు భామినిలో వ్యవసాయ భూములకు మళ్లించేందుకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. సోలార్‌ సిస్టమ్‌ వ్యవసాయ బోర్లుకు మరమ్మతులు కూడా చేపట్టడం లేదు. దీంతో మండలంలో రైతులు అప్పులు చేసి సొంతంగా విద్యుత్‌ బోర్లు తీసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఒక్కో బోరుకు వారు రూ.లక్షా 50 వేలకు పైగా వెచ్చించాల్సి వస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం రుణ సౌకర్యం కల్పించడం లేదు సరికాదా కనీసం విద్యుత్‌ సదుపాయం కూడా అందించకపోవడంతో రైతన్నలు పెదవి విరుస్తున్నారు. గతేడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నులకజోడు, బాలేరు, బత్తిలి, గురండి, నేరడి, కీసర,కోసలి, బాలేరు తదితర గ్రామాల రైతులు బోర్లు ఏర్పాటు చేసుకుందుకు తహసీల్దార్‌కు దరఖాస్తులు చేశారు. అయితే వన్‌బీ వంటి ధ్రువపత్రాలు తీసుకురావాలని కొర్రీలు పెడుతుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మరోవైపు కరెంట్‌ కనెక్షన్‌ కోసం విద్యుత్‌శాఖకు దరఖాస్తులు అందజేయగా.. చలానా చెల్లించిన తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలించి అంచనాలు వేస్తామని ఆ శాఖాధికారులు చెబుతున్నారు. ఆ సొమ్మును చెల్లిస్తే మినీ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తామం టున్నారు. అయితే నాలుగు నుంచి ఐదు వరకు విద్యుత్‌ స్తంభాలు ఏర్పా చేయాల్సి వస్తే అదనంగా రైతులే చెల్లించాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. దీంతో మండల రైతులకు ఇది అదనపు భారంగా మారింది.

ఏదీ జలకళ?

మండలం నుంచి జలకళ పథకానికి 2023, జనవరి నాటికి మొత్తంగా 370 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఒక్క బోరును కూడా మంజూరు చేయలేదు. అసలు నాలుగున్నరేళ్లలో మండలంలో ఒక్క బోరును కూడా ఆ పథకంలో కేటాయించలేదు. దీంతో రైతులు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని మండల రైతులు కోరుతున్నారు.

నీటి కోసం కష్టాలు

కొండలోయగెడ్డ రిజర్వాయర్‌ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వం రూ. ఆరు వేలకే రూ.5 లక్షల విలువ చేసే సోలార్‌ సిస్టమ్‌తో వ్యవసాయ బోరును మంజూరు చేశారు. దీంతో కొన్నాళ్లుగా సాగు సాఫీగా సాగేది. సాగునీటికి ఇబ్బందులు ఉండేవి కావు. అయితే వాటి సప్లయ్‌ బోర్డు మొరాయించడంతో అవి దేనికీ పనికిరాకుండా పోయాయి. ప్రస్తుతం సాగునీటికి కష్టాలు ఎదుర్కొంటున్నాం.

- బిడ్డిక ప్రసాద్‌, రైతు భామిని

===================================

తలకు మించిన భారం

బోరు ఏర్పాటు చేయాలంటే తలకు మించిన భారమవుతుంది. గతంలో సోలార్‌ వ్యవసాయ బోరు ఏర్పాటు చేసినప్పటికీ అవి మరమ్మతులకు గురై మూలకు చేరాయి. ప్రస్తుతం రూ.లక్షా 20 వేల వరకు వెచ్చించి పొలాల్లో బోరు ఏర్పాటు చేయాల్సి వస్తోంది. రూ.60 వేలు విద్యుత్‌శాఖకు చెల్లించగా మరో రూ.30 వేలతో మోటారు కొనాల్సి వస్తోంది. సుమారు రెండు లక్షలకు పైగానే ఖర్చు అవుతుంది. మా సమస్యలను ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదు.

- ఎస్‌.భాస్కరరావు, రైతు, నులకజోడు

=====================================

మినీ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటుకు చర్యలు

మూడు బోర్లుకు మినీ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఒక్కో బోరుకు రూ.30 వేలు ఖర్చు అవుతుంది. కాగా 11కెవీ నుంచి ట్రాన్స్‌ఫార్మర్‌కు నాలుగు నుంచి ఐదు స్తంభాలు ఏర్పాటు చేస్తే రైతులు అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉంది. జనవరిలో 20 మినీ ట్రాన్స్‌ఫార్మర్‌ వరకు మంజూరయ్యాయి.

- శ్రీనివాసరావు, ట్రాన్స్‌కో ఏఈ, భామిని

Updated Date - Feb 01 , 2024 | 11:32 PM