మాజీ ఎంపీ కెంబూరి కన్నుమూత
ABN , Publish Date - Aug 08 , 2024 | 11:53 PM
ఒకప్పటి బొబ్బిలి పార్లమెంట్ మాజీ సభ్యుడు, చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే కెంబూరి రామ్మోహనరావు గురువారం తెల్లవారుజామున కన్ను మూసారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.
మాజీ ఎంపీ కెంబూరి కన్నుమూత
నివాళులర్పించిన మంత్రి శ్రీనివాస్
చీపురుపల్లి, ఆగస్టు 8: ఒకప్పటి బొబ్బిలి పార్లమెంట్ మాజీ సభ్యుడు, చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే కెంబూరి రామ్మోహనరావు గురువారం తెల్లవారుజామున కన్ను మూసారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య రుష్యేంద్రమణి, కుమార్తెలు మైథిలి, సౌజన్య ఉన్నారు. నిబద్ధత, నీతి నిజాయితీ గల నాయకునిగా ఆయన రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో ఆయన గతంలో బొబ్బిలి ఎంపీగా, చీపురుపల్లి ఎమ్మెల్యేగా పనిచేశారు. శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలంలోని పుర్లె గ్రామంలో 1949 అక్టోబరు 12న జన్మించారు. తండ్రి ఉద్యోగ రీత్యా ఆయన కుటుంబంతో చీపురుపల్లి వచ్చి స్థిర పడ్డారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనంతరం ఆ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై ఎన్‌టీ రామారావు సమక్షంలో పార్టీలో చేరారు. 1985లో చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. 1989 నుంచి 1991 వరకూ 9వ లోక్‌సభ సభ్యునిగా ఉన్నారు. 1994లో కాంగ్రెస్ పార్టీలో చేరి చీపురుపల్లి అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
పలురురి ప్రముఖుల పరామర్శ
కెంబూరి రామ్మోహనరావు మృతి పట్ల రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. గురువారం ఉదయం చీపురుపల్లి చేరుకున్న మంత్రి చీపురుపల్లిలోని కెంబూరి భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. కుటుంబాన్ని పరామర్శించారు. మాజీ మంత్రి, కెంబూరి సోదరి కిమిడి మృణాళిని, ఆమె తనయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కుచ్చర్లపాటి త్రిమూర్తులరాజు, పలువురు వైసీపీ నాయకులు కెంబూరి భౌతికకాయం వద్ద నివాళులర్పించారు.