Share News

మరచిపోయారో...మారిపోయారో!

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:15 AM

పాలకొండ నియోజకవర్గ పరిధిలో గల భామిని, సీతంపేట మండలాల్లోని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధి ఇచ్చిన హామీ ఒక్కటీ నెరవేరలేదని ఆ మండల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరచిపోయారో...మారిపోయారో!

- కార్యరూపం దాల్చని హామీలు

- ప్రజాప్రతినిధి పని తీరుపై పెదవి విరుపు

(భామిని)

పాలకొండ నియోజకవర్గ పరిధిలో గల భామిని, సీతంపేట మండలాల్లోని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధి ఇచ్చిన హామీ ఒక్కటీ నెరవేరలేదని ఆ మండల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు పర్యటించిన ఆ ప్రజాప్రతినిధి చెప్పిన వాటిలో.. ఐదేళ్లలో చేసిందేమీ లేదని మండిపడుతున్నారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఆ హామీలు ఓసారి చూద్దాం.

గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొందిన ప్రజాప్రతినిధి ఇచ్చిన హామీలు నీటిమూటలుగా మిగిలాయి. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండల ప్రజలు నిట్టూరుస్తున్నారు.

- మండలానికి డిగ్రీ కళాశాల, మహిళా జూనియర్‌ కళాశాల, గిరిజన ప్రాంతాల్లో పక్కా గృహాలు, గ్రామాల అభివృద్ధి, నేరడి బ్యారేజ్‌ నిర్మాణంతో తాగునీరు అందిస్తామన్న హామీలన్నీ నీటిమూటలుగా మిగిలాయి. కొండ ప్రాంతాల్లో ఈ ఐదేళ్లలో తమకు రావాల్సిన పథకాలకు మంగళం పాడేశారని అంటున్నారు.

- గతంలో టీడీపీ ప్రభుత్వం మనుమకొండ, వడ్డంగి, పాలవలస లిఫ్ట్‌ ఇరిగేషన్‌ మంజూరు చేసింది. వంశధార నది నుంచి నీటిని తరలించేందుకు ప్రజాప్రతినిధి కనీసం దృష్టి సారించలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- నేరడి బ్యారేజ్‌ నిర్మాణం పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. అదే సమయంలో నీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేసిన ఇద్దరు వేర్వేరుగా నేరడి బ్యారేజ్‌ను పరిశీలించి అంచనాలు వేసి రైతులకు సాగునీరు అందించడమే ధ్యేయమని వాగ్దానాలు చేశారు. ఇవి కూడా నెరవేరలేదు. కొండలోవగెడ్డ రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తి చేయలేదు. ఏ గ్రామం వెళ్లినా సమస్యలే కనిపిస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.

రోడ్డన్నారు...కల్వరులు వేస్తామన్నారు!

- ఒక్కటీ నెరవేరని వైనం

(సీతంపేట)

మండలంలోని మారుమూల పంచాయతీ పరిధిలో ఉన్న మూలగూడ, బెనరాయి గ్రామాల్లో గత ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు తమకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదని ఆదివాసీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

- మర్రిపాడు నుంచి కొత్తగా ఏర్పడిన బెనరాయి పంచాయతీ పరిఽధిలో ఉన్న బెనరాయి, మేడి ఒప్పంగి మధ్య అనుసంధాన రహదారి... గ్రామాల్లో గెడ్డ వద్ద కల్వర్టులు కడతామని, ఈతమానుగూలో 200 మీటర్ల వరద గోడ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

- బెనరాయిలో వంద మీటర్లు వరదగోడ మంజూరు చేస్తామని ఎన్నికల్లో హామీ నిచ్చినప్పటికీ ఇంతవరకు పూర్తి కాలేదని బెనరాయికి చెందిన మాజీ సర్పంచ్‌ సవర బాపయ్య స్పష్టం చేశారు.

- మర్రిపాడు పంచాయతీ పరిధిలో ఉన్న మూలగూడ గ్రామంలో 120 మంది గిరిజన జనాభా ఉన్నారు. 70 మంది ఓటర్లను కలిగి ఉన్న ఈ గ్రామంలో సీసీ రహదారి, తాగునీరు, వరదగోడలు మంజూరు చేస్తామని గతంలో హామీనిచ్చిప్పటికీ ఇంతవరకు నెరవేర్చలేదని, ప్రస్తుతం తాగునీటికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్టు ఆ గ్రామానికి చెందిన సవర జమ్మయ్య స్పష్టం చేశారు. తమ గ్రామాలు కమ్యూనిస్టు పార్టీకి అనుకూలంగా ఉండడం వల్లనే అభివృద్ధి జరగడం లేదని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హామీలు మరిచారు

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పాలకులు మరిచారు. ఒక్కటి కూడా అమలు చేయలేదు. దీంతో మా గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంగానే మిగిలిపోయింది.

- సవర సుగన్న, మాజీ సర్పంచ్‌, బెనరాయి

తాగునీటికి ఇబ్బంది

గత ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన నాయకులు గెలిచిన తర్వాత ఒక్కహామీ కూడా నెరవేర్చలేదు. మా గ్రామంలో తాగునీటి సమస్య తీరుస్తామని, వరదగోడలు నిర్మిస్తామని, రహదారి నిర్మిస్తామని ఇచ్చిన హామీలేవీ నేటికీ నెరవేర్చలేదు.

- సవర జమ్మయ్య, మూలగూడ

Updated Date - Apr 19 , 2024 | 12:15 AM