Share News

తొలిసారిగా అసెంబ్లీకి...

ABN , Publish Date - Jun 06 , 2024 | 12:28 AM

జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ నియోజకవర్గాల కూటమి అభ్యర్థులు తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.

 తొలిసారిగా అసెంబ్లీకి...

పార్వతీపురం, జూన్‌5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ నియోజకవర్గాల కూటమి అభ్యర్థులు తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. పార్వతీపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన టీడీపీ అభ్యర్థి బోనెల విజయచంద్ర గతంలో స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ఏపీ, తమిళనాడు తదితర రాష్ర్టాల్లో ప్రజలకు సేవలు అందించారు. అయితే తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచిన ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన త్వరలో అసెంబ్లీకి వెళ్లనున్నారు. సాలూరు నుంచి పోటీ చేసి గెలిచిన టీడీపీ అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. అయితే ఎమ్మెల్యేగా మాత్రం తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. గతంలో ఆమె తండ్రి ఎమ్మెల్యేగా పనిచేశారు. కురుపాం టీడీపీ అభ్యర్థి తోయక జగదీశ్వరి, పాలకొండ నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన నిమ్మక జయకృష్ణ కూడా తొలిసారిగా అసెంబ్లీకి వెళ్లనున్నారు. కాగా జయకృష్ణ తండ్రి గోపాలరావు కొత్తూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గతంలో ప్రజలకు సేవలు అందించారు. కురుపాం ఎమ్మెల్యేగా ఎన్నికైన జగదీశ్వరి తాత కూడా ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా సేవలు అందించారు. రాజకీయ ప్రాతినిధ్యం కలిగిన కుటుంబాల నుంచి వచ్చిన సంధ్యారాణి, జయకృష్ణ, జగదీశ్వరి తాజా ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.

భారీ మెజార్టీ కైవసం

జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన కూటమి అభ్యర్థులు తొలి ప్రయత్నంలోనే భారీ మెజార్టీని దక్కించుకున్నారు. పార్వతీపురం నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థి బోనెల విజయచంద్ర 24,414 ఓట్ల మెజార్టీని దక్కించుకున్నారు. ఈవీఎంలలో ఆయనకు 83,905 ఓట్లు వచ్చాయి. కాగా పోస్టల్‌ బ్యాలెట్లలో 1,917 ఓట్లు లభించాయి. సాలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణికి 78,872 ఓట్లు వచ్చాయి. పోస్టల్‌ బ్యాలెట్లలో 1,339 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా ఆమె 13,733 ఓట్ల మెజార్టీని సాధించారు. కురుపాం నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్థి తోయక జగదీశ్వరి 23,500 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక్కడ ఆమెకు మొత్తంగా 83,355 ఓట్లు వచ్చాయి. పోస్టల్‌ బ్యాలెట్లలో 2,169 ఓట్లు లభించాయి. పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన నిమ్మక జయకృష్ణ 13,291 ఓట్ల మెజార్టీతో విజయబావుటా ఎగురవేశారు. మొత్తంగా ఆయనకు 75,208 ఓట్లు లభించాయి. పోస్టల్‌ బ్యాలెట్లలో 1,857 ఓట్లు పోలయ్యాయి.

Updated Date - Jun 06 , 2024 | 12:28 AM