Share News

నెల రోజులకే..

ABN , Publish Date - Jul 28 , 2024 | 11:10 PM

ఎన్నికలకు ముందు వైసీపీ సర్కారు ఎంతో ఆర్భాటంగా రోడ్డు నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో హడావుడిగా శిలాఫలకాలు ఏర్పాటు చేసి పనులు ప్రారంభించారు. అయితే నాణ్యత లోపం కారణంగా ఆయా రహదారులు అధ్వానంగా మారుతున్నాయి. నిర్మించిన కొద్దికాలానికే కోతకు గురవుతున్నాయి.

 నెల రోజులకే..
పిట్టలమెట్ట రహదారి కోతకు గురైన దృశ్యం

నిర్మాణంలో నాణ్యత లోపం

ఎన్నికలకు ముందు పనులకు శ్రీకారం

పెదవి విరుస్తున్న గ్రామస్థులు

విచారణ చేపట్టాలని డిమాండ్‌

గరుగుబిల్లి : ఎన్నికలకు ముందు వైసీపీ సర్కారు ఎంతో ఆర్భాటంగా రోడ్డు నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో హడావుడిగా శిలాఫలకాలు ఏర్పాటు చేసి పనులు ప్రారంభించారు. అయితే నాణ్యత లోపం కారణంగా ఆయా రహదారులు అధ్వానంగా మారుతున్నాయి. నిర్మించిన కొద్దికాలానికే కోతకు గురవుతున్నాయి. గరుగుబిల్లి మండలంలోని సంతోషపురం పంచాయతీ పిట్టలమెట్ట రోడ్డే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఉపాధి నిధులతో బీటీ రహదారి నిర్మాణానికి అప్పట్లో ప్రతిపాదనలు చేశారు. ఎన్నికలకు ముందు మార్చి-1న ఆర్‌అండ్‌బీ రహదారి నుంచి గ్రామానికి రోడ్డు నిర్మించేందుకు గాను రూ. 1.40 కోట్లు మంజూరు చేశారు. అప్పటి ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి శంకుస్థాపన చేశారు. కానీ నిర్మాణంలో తీవ్ర జాప్యం నెలకొంది. ఆ తర్వాత పార్వతీపురం ఐటీడీఏ ఇంజనీరింగ్‌ శాఖకు రోడ్డు నిర్మాణ బాధ్యతను అప్పగించారు. అయితే సుమారు నెల రోజుల కిందట ప్రధాన రహదారి నుంచి పిట్టలమెట్టకు సుమారు 1600 మీటర్ల మేర బీటీ రహదారి, 50 మీటర్ల మేర సీసీ రహదారి నిర్మాణం చేపట్టారు. కాగా కొద్ది రోజులకే.. శిలాఫలకం కూలిపోగా.. రహదారి కూడా దారుణంగా తయారైంది. ఇటీవల కురిసిన వర్షాలకు రహదారి ఇరువైపులా కోతకు గురైంది. దీంతో రాత్రి సమయాల్లో ఇటువైపుగా రాకపోకలు సాగించలేని పరిస్థితి ఏర్పడింది. ఏ మాత్రం ఆదమరిచినా.. ఆసుపత్రిలో చేరాల్సిందే. రోడ్డు మూణ్నాళ్ల ముచ్చటగా మారడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రహదారి పనులు ఇలాగే చేస్తారా? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు ముందు కురుపాం నియోజకవర్గంలో నిర్మించిన చాలా బీటీ రహదారుల పరిస్థితి ఇలానే ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిధులు వ్యయమే తప్ప.. ఏ ప్రయోజనం లేదని వారు వాపోతున్నారు. రహదారుల నిర్మాణాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని ఆయా ప్రాంతవాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

పనులు చేయాల్సి ఉంది

పిట్టలమెట్ట రహదారికి సంబంధించి కొంతమేర పనులు చేయాల్సి ఉంది. వర్షాల కారణంగా నిర్వహించలేకపోతున్నాం. నిబంధనల మేరకు పనులు ప్రారంభించాం. బిల్లుల చెల్లింపులు జరగలేదు. రోడ్డుకు ఇరువైపులా బెర్మ్‌లను వేసేందుకు గ్రావెల్‌, తదితర సామగ్రి సమకూర్చాల్సి ఉంది. ప్రజలకు అసౌకర్యం కలగకుండా రహదారి మెరుగుకు చర్యలు చేపడతాం.

- తిరుపతినాయుడు, డీఈ, ఐటీడీఏ, పార్వతీపురం

Updated Date - Jul 28 , 2024 | 11:10 PM