Share News

ఓటు పేరుతో మేత!

ABN , Publish Date - Mar 26 , 2024 | 11:52 PM

మెంటాడ మండలం పెదమేడపల్లి గ్రామంలో వివాదాస్పద భూమికి పట్టాలు చూపి కొందరు అధికార పార్టీ నాయకులు ఓట్లాటకు తెరలేపారు. పనిలో పనిగా బినామీల పేరిట కొంతభూమిని కొట్టేయడానికి కూడా పావులు కదుపుతున్నారు. తలనొప్పిగా మారిన ఈ వ్యవహారంపై ఏంచేయాలో పాలుపోక ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న అధికారులు ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ ఉండడంతో తాత్కాలికంగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా నడుచుకోలేమని స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ రాజకీయ పలుకబడితో పంతం నెగ్గించుకోవాలని ఆ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఓటు పేరుతో మేత!
వివాదాస్పద భూమి ఇదే

ఓటు పేరుతో మేత!

పట్టాల బూచితో ప్రజలను మభ్యపెట్టే ఎత్తుగడ

వివాదాస్పద భూమి అని తెలిసినా హడావుడి

వందలాది మందితో దరఖాస్తుల డ్రామా

కొంతభూమిని కాజేసేందుకూ పథకం

బినామీలను రంగంలోకి దించిన వైసీపీ నేతలు

మెంటాడ మండలం పెదమేడపల్లి గ్రామంలో వివాదాస్పద భూమికి పట్టాలు చూపి కొందరు అధికార పార్టీ నాయకులు ఓట్లాటకు తెరలేపారు. పనిలో పనిగా బినామీల పేరిట కొంతభూమిని కొట్టేయడానికి కూడా పావులు కదుపుతున్నారు. తలనొప్పిగా మారిన ఈ వ్యవహారంపై ఏంచేయాలో పాలుపోక ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న అధికారులు ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ ఉండడంతో తాత్కాలికంగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా నడుచుకోలేమని స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ రాజకీయ పలుకబడితో పంతం నెగ్గించుకోవాలని ఆ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

మెంటాడ, మార్చి 26:

పెదమేడపల్లిలో సర్వే నంబర్‌ 402-1,402-2తో పాటు వాటిని ఆనుకొని వున్న మరో సర్వే నెంబర్‌ 356లో 6 ఎకరాల 71 సెంట్ల ప్రభుత్వ భూమిని స్థానిక ఎస్సీ, బీసీల్లో కొంతమంది కొన్నేళ్లుగా సాగుచేసుకుంటూ పట్టాలు పొందేందుకు అధికారులు, నాయకులను కలిశారు. ఎప్పటికీ పని కాకపోవడంతో సుమారు ఆరేళ్ల క్రితం ఆందోళన బాట పట్టారు. పెద్ద గొడవకు దారితీయడంతో పరిస్థితి అదుపు తప్పి గ్రామంలో పోలీసు పికెట్‌ ఏర్పాటు వరకూ వెళ్లింది. అప్పట్లో ఇరువర్గాలపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కొందరు కోర్టును ఆశ్రయించారు.

ఇదిలాఉండగా ఎన్నికల సమయం కావడంతో కొందరు అధికార పార్టీ నేతలు ఈ వివాదాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవాలని పథక రచన చేశారు. అధికారులతో మాట్లాడి వివాదాన్ని పరిష్కరించి పట్టాలు మంజూరు చేయిస్తామని ఇరువర్గాలతో నమ్మబలికి హడావుడి మొదలు పెట్టారు. ఇటీవల వివాదాస్పద భూమిలో పొదలను తొలగించారు. లబ్ధిదారులకు నమ్మకం కలిగించేందుకు దరఖాస్తులు స్వీకరించారు. అప్పట్లో ఈ భూమిని 50 మంది వరకు సాగుచేసుకు నేవారు. ఇప్పుడు నాయకులు మాత్రం ఏకంగా 340 మంది వరకు దరఖాస్తు చేయించారు. బీటీ రోడ్‌కు ఆనుకుని ఈ భూమి వుంది. స్థలానికి ఎదురుగా జగనన్న కాలనీ ఏర్పాటైంది. బండి మహంకాలమ్మ గుడి వుండడంతో ఈ భూమికి ప్రాధాన్యం పెరుగుతోంది. సెంటు లక్షల్లో పలుకుతోంది.

రెవెన్యూ బోర్డు బేఖాతరు

కొనేళ్ల క్రితం ఇరువర్గాల గొడవల నేపథ్యంలో అధికారులు ఆ వివాదాస్పద భూమిలో ‘ఇది ప్రభుత్వ భూమి.. ఆక్రమించిన వారు శిక్షార్హులు’ అని పేర్కొంటూ బోర్డు పాతారు. పట్టాలు సాధ్యం కాదని తెలిసి కూడా అధికార పార్టీ నేతలు ఓట్లకోసమే పట్టాలభూచితో వారికి గాలం వేస్తున్నారు. గతానుభవాల దృష్ట్యా పైగా ఎన్నికల సమయం నేపథ్యంలో అధికారులు, పోలీసులు ఆందోళన చెందుతున్నారు.

అనర్హులను రంగంలో దించి..

భూమేతకు అలవాటుపడిన ఇరువర్గాల నేతలు కూడా పట్టాలు ముసుగులో కొంత భూమిని కొట్టేయడానికి కుయుక్తులు పన్నుతున్నారు.అనర్హులను రంగంలోకి దించి అందరికీ సమంగా పట్టాలు మంజూరు చేయించి, అంతా పూర్తయ్యాక అనర్హులకు పదోపరకో విదిల్చి తమవంతు వచ్చిన భూమిని వశం చేసుకోవాలనేది వారి ప్లాన్‌.

అబ్రకం నిక్షేపాలు

ఈ వివాదాస్పద భూమికింద విలువైన అబ్రకం నిల్వలు ఉన్నట్టు కొన్నేళ్ల క్రితం సంబంధింత అధికారులు గుర్తించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ సంగతి ఇప్పుడు పనిచేస్తున్న అధికారులతో పాటు నేతలకూ తెలుసు. అబ్రకం నిక్షపాలు నేపథ్యంలో నిబంధనల ప్రకారం ఇక్కడ పట్టాలు మంజూరు అసాధ్యమని తెలిసినా చేజెక్కించుకునే ప్రణాళిక అమలు చేస్తున్నారు.

మీ పెత్తనమేంటి..

ఇదిలాఉండగా కొన్నేళ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూమిపై అందరికీ పట్టాలంటూ మీరు పెత్తనం చేయడమేంటని పూర్వం నుంచి సాగుచేసుకుంటున్న రైతులు వారిని ప్రశ్నిస్తున్నారు. తమలో తమకు గొడవలు సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రయత్నించడం మానుకోవాలని వారు హెచ్చరిస్తున్నారు. భూ వ్యవహారంపై వీఆర్వో మురళిని వివరణ కోరగా వివాదాస్పద భూమికి పట్టాలు మంజురు చేయాలని కొందరు నేతలు ఒత్తిడి చేస్తున్న మాట వాస్తవమేనన్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఇప్పుడు వాటి జోలికి వెళ్లబోమని వారికి స్పష్టం చేసినట్లు చెప్పారు.

అధికార పార్టీ అభ్యర్థికి మస్కా..?

గ్రామంలో చోటుచేసుకున్న భూ వివాదాలకు గుడి నిర్మాణానికి సేకరించిన విరాళాలు సుమారు మూడు లక్షలు ఖర్చు చేశారని, ఆ డబ్బు సమకూర్చితే గ్రామంలోని ఓట్లన్నీ గంపగుత్తగా మనకే పడతాయని కొందరు నేతలు సాలూరు ఎమ్మెల్యే అభ్యర్థి దృష్టికి తీసుకువెళ్లారు. నిజమని నమ్మి ఆయన డబ్బులు ఇవ్వగా ఆ నాయకులు వాటాలు వేసుకొని సొంతానికి వాడేసుకున్నట్టు బలంగా ప్రచారం జరుగుతోంది. కొందరకి వాటాలు అందకపోవడంతో విషయం బయటకు పొక్కింది.

Updated Date - Mar 26 , 2024 | 11:52 PM