Share News

ఐదేళ్లూ.. క్రీడాకారుల ఆశలపై నీళ్లు

ABN , Publish Date - Jun 09 , 2024 | 11:36 PM

క్రీడాకారుల్లో క్రీడాస్ఫూర్తిని నింపడంతో పాటు వారిలో ఆటలపై శ్రద్ధ పెరిగేలా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2018లో మంజూరు చేసిన మినీ స్టేడియాలు (క్రీడా వికాస కేంద్రాలు) పునాదులకే పరిమితమయ్యాయి. కొన్ని చోట్ల పనులు కూడా ప్రారంభం కాలేదు.

ఐదేళ్లూ.. క్రీడాకారుల ఆశలపై నీళ్లు
బొబ్బిలిలో పునాదులకే పరిమితమైన మినీ స్టేడియం

ఐదేళ్లూ.. క్రీడాకారుల ఆశలపై నీళ్లు

అధోగతిలో క్రీడా వికాస కేంద్రాలు

టీడీపీ హయాంలో మంజూరు

కన్నెత్తి చూడని జగన్‌ సర్కార్‌

రాజాం రూరల్‌, జూన్‌ 9: క్రీడాకారుల్లో క్రీడాస్ఫూర్తిని నింపడంతో పాటు వారిలో ఆటలపై శ్రద్ధ పెరిగేలా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2018లో మంజూరు చేసిన మినీ స్టేడియాలు (క్రీడా వికాస కేంద్రాలు) పునాదులకే పరిమితమయ్యాయి. కొన్ని చోట్ల పనులు కూడా ప్రారంభం కాలేదు. 2019లో రాష్ట్రంలో అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం 2024లో ఘోరపరాభవం పాలై అధికారాన్ని కోల్పోయిన వరకూ కనీసం వీటివైపు కన్నెత్తి చూడలేదు. నిర్మాణాలను పూర్తి చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందింది. ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. దీంతో గతంలో పట్టణాల్లో ప్రారంభించిన నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మరికొన్ని చోట్ల పిచ్చిమొక్కలు పెరిగిపోయి శిలాఫలకాలు కూడా కనిపించని దుస్థితి. జగన్‌ అయిదేళ్ల పాలన అన్నివర్గాలతో పాటూ క్రీడాకారుల్లోనూ అసంతృప్తి, నిరాశను మిగిల్చింది.

ఫ నియోజకవర్గానికి ఒకటి వంతున జిల్లాలోని ఏడు నియోజకవర్గ కేంద్రాల్లో క్రీడా వికాస కేంద్రాలను నిర్మించాలని తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించి మంజూరు చేసింది. ఒక్కో క్రీడా వికాస కేంద్రానికి రూ.2 కోట్లు వంతున నిధులు కేటాయించింది. స్టేడియంతో పాటు మరుగుదొడ్లు, తాగునీటి బోరు, క్రీడాకారులకు విశ్రాంతి భవనం తదితర నిర్మాణాలను ప్రతిపాదించింది. ఇందులో భాగంగా రాజాంలో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రిగా ఉన్న కాలంలో క్రీడావికాస కేంద్రానికి జనవరి 28, 2018లో శంకుస్థాపన చేశారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు శంకుస్థాపనలు చేశారు. రాజాంలో ఓ షెడ్‌తో పాటు మరుగుదొడ్ల కోసం పునాదుల పనులు ప్రారంభించారు. బొబ్బిలిలో పునాదులు పూర్తిచేశారు. వీటిలో గ్రావెల్‌ వేసి విడచిపెట్టారు. ప్రభుత్వం మారాక అప్పటివరకూ జరిగిన నిర్మాణాలకు సంబంధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్‌లకు బిల్లులు చెల్లించలేదు. దీంతో వారు పునాదుల్లో వేసిన గ్రావెల్‌ను తిరిగి తీసుకెళ్లిన దౌర్భాగ్యకర పరిస్థితి బొబ్బిలిలో చోటుచేసుకుంది. కాగా జిల్లా కేంద్రంతో పాటు ఎస్‌.కోట, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల మండల కేంద్రాలలో స్థలాలు ఎంపిక చేశారు. పనులు ప్రారంభమయ్యాయి కాని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా దిష్టిబొమ్మలను తలపిస్తున్నాయి.

ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడడంతో...

2019లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల కావడంతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అర్ధాంతరంగా అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయలేని పరిస్థితి వచ్చింది. దీంతో ఎక్కడి నిర్మాణాలు అక్కడే నిలిచిపోయాయి. ఆ ఎన్నికలలో రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు విజయనగరం లోక్‌సభ స్థానంలో కూడా వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. రెండుసార్లు జరిగిన మంత్రివర్గ విస్తరణల్లో బొత్స రెండు వేర్వేరు మంత్రిత్వ శాఖలు దక్కించుకున్నారు. కోలగట్ల వీరభద్రస్వామికి శాసనసభ డిప్పుటి స్పీకర్‌ వంటి కీలకపదవి దక్కింది. కానీ అయిదేళ్లూ అధికారంలో ఉన్న ఎంపి, మంత్రితో పాటు ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లోని క్రీడావికాస కేంద్రాల నిర్మాణం వైపు కన్నెతి చూడలేదు. కేవలం రూ.2 కోట్లు వంతున నిధులు మంజూరు చేయించలేని దుస్థితిలో అధికారం అనుభవించారు. స్టేడియంల నిర్మాణం పనులు పూర్తి చేయించాలని జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో కూడా క్రీడాభిమానులు ఎమ్మెల్యేలను కోరినా ఫలితం దక్కలేదు. ఫలితంగా క్రీడాకారుల ఆశలు నెరవేరలేదు.

Updated Date - Jun 09 , 2024 | 11:36 PM