Share News

ఐదేళ్లూ.. అసంతృప్తే

ABN , Publish Date - May 26 , 2024 | 11:19 PM

ఐదేళ్లూ జిల్లాలో నిరశనలు.. నిట్టూర్పులు.. ఆందోళనలు.. ధర్నాలే సాగాయి. ఏ వర్గమూ సంతోషంగా లేదు.. ఎన్నికల వరకే రాజకీయాలు పరిమితం కావాలి. అపై అభివృద్ధి దిశగా నాయకులు అడుగులు వేయాలి. అధికారుల్ని పరుగులు పెట్టించాలి. సామాన్య, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలవాలి. కానీ అందుకు విరుద్ధంగా ఈ ఐదేళ్లూ గడిచాయి. రైతులు, కార్మికులు, కూలీలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీలు, పారిశుధ్య కార్మికులు, టీచర్లు, విశ్రాంత ఉపాధ్యాయులు, గ్రీన్‌ అంబాసిడర్లు, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు.. ఇలా ఒకరేంటి.. ఏవర్గమైనా సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నిస్తే.. లేదని సమాధానమే వినిపించింది.

ఐదేళ్లూ.. అసంతృప్తే
మిల్లుల ముందు బారులు తీరిన ధాన్యం లారీలు (ఫైల్‌)

ఐదేళ్లూ.. అసంతృప్తే

జిల్లా అంతటా నిరసనలే

రోడ్డెక్కిన జనం

ఎవర్ని కదిపినా నిరాశా.. నిట్టూర్పులే

ప్రభుత్వంపై విమర్శల హోరు

ఐదేళ్లూ జిల్లాలో నిరశనలు.. నిట్టూర్పులు.. ఆందోళనలు.. ధర్నాలే సాగాయి. ఏ వర్గమూ సంతోషంగా లేదు.. ఎన్నికల వరకే రాజకీయాలు పరిమితం కావాలి. అపై అభివృద్ధి దిశగా నాయకులు అడుగులు వేయాలి. అధికారుల్ని పరుగులు పెట్టించాలి. సామాన్య, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలవాలి. కానీ అందుకు విరుద్ధంగా ఈ ఐదేళ్లూ గడిచాయి. రైతులు, కార్మికులు, కూలీలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీలు, పారిశుధ్య కార్మికులు, టీచర్లు, విశ్రాంత ఉపాధ్యాయులు, గ్రీన్‌ అంబాసిడర్లు, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు.. ఇలా ఒకరేంటి.. ఏవర్గమైనా సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నిస్తే.. లేదని సమాధానమే వినిపించింది.

రాజాం రూరల్‌, మే 26:

అన్నదాతల అవస్థలు ఇన్నీఅన్నీ కావు.. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర పక్కనపెడితే.. పండిన ధాన్యాన్ని అమ్ముకోలేని దౌర్భాగ్య పరిస్థితిని రైతాంగం ఎదుర్కొంది. ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయలేదు సరికదా... సొంత మండలంలోని మిల్లులు కేటాయించకుండా ఇతర మండలాలలోని మిల్లులకు ధాన్యం సరఫరా చేయాల్సి రావడంతో రైతుకళ్లల్లో కన్నీరే మిగిలింది. 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలోని మిల్లులకు ధాన్యాన్ని తీసుకెళ్తే.. అక్కడా ఇబ్బందులే.. తరుగు పేరిట మిల్లర్ల దోపిడీ సైతం అన్నదాతను ఆక్రందనలకు గురిచేసింది. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయాలంటూ ప్రభుత్వ కార్యాలయాల ఎదుట దర్నాలకు దిగడం, పెట్రోల్‌ బాటిళ్లతో నిరశన వ్యక్తం చేయడం వంటి సంఘటనలు ఏ ప్రభుత్వంలోనూ రైతులు చూడలేదు.

రోడ్డెక్కిన పండుటాకులు..

ఆరుపదులు దాటిన వయసులో విశ్రాంతి తీసుకోవాల్సిన రిటైర్డ్‌ ఉద్యోగులు తమకు న్యాయంగా రావాల్సిన పెన్షన్‌ ఇతరత్రా బకాయిల కోసం ధర్నాలకు దిగే దుస్థితి ప్రభుత్వ పాలనకు అద్దం పట్టింది. ప్రతినెలా ఒకటోతేదీన తమ ఖాతాల్లో పెన్షన్‌ జమ చేయాలన్న డిమాండ్‌ నిరశనలకు దారి తీసింది. 2018 జులై ఒకటి తరువాత పెరిగిన కరవుభత్యం బకాయిలు చెల్లించాలని, 2020 ఏప్రిల్‌ తరువాత పెరిగిన జీతభత్యాల బకాయిలు వెంటనే చెల్లించాలని, రెండవ కుటుంబ పెన్షన్‌ పొందుతున్న వికలాంగులు, వితంతువులకు న్యాయం చేయాలని కోరుతూ రోడ్డెక్కారు.

నిరాశలో ఆశ వర్కర్లు

గ్రామస్థాయిలో సేవలందిస్తున్న ఆశ వర్కర్లు సైతం నిరాశ, నిస్పృహలతోనే గడిపారు.ప్రభుత్వతీరుపై నిరశన గళం వినిపించారు. రూ.15వేలు గౌరవ వేతనం ఇవ్వాలని, పనిభారాన్ని తగ్గించాలని, మెడికల్‌ లీవ్‌, వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్‌, అమలు చేయాలని, 62 ఏళ్ల రిటైర్మెంట్‌ వయసు వర్తింపజేయాలని, కొవిడ్‌ సమయంలో మరణించిన ఆశ వర్కర్లకు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని, గ్రూపు ఇన్సూరెన్స్‌ సదుపాయం కల్పించాలని, ఏఎన్‌ఎం, హెల్త్‌ సెక్రటరీల నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలన్న డిమాండ్లు పరిష్కారానికి నోచుకోలేదు.

నిరశన బాటలో భవన నిర్మాణ కార్మికులు

భవననిర్మాణ కార్మికులు సైతం ఐదేళ్లూ నిరశనలతోనే కాలక్షేపం చేయాల్సి వచ్చింది. 1996 కేంద్ర భవననిర్మాణ కార్మిక సంక్షేమ చట్టంలో పొందుపరిచిన సంక్షేమ పథకాలన్నీ అమలుచేయాలంటూ జిల్లా అంతటా భవననిర్మాణ కార్మికులు ధర్నాలకు దిగారు. పనులు నిలిపివేస్తూ నిరశన తెలియజేశారు. కార్మికుల సంక్షేమ బోర్డును పటిష్టంగా అమలుచేయాలని, కార్మికుల పెండింగ్‌ క్లెయిమ్‌లను అమలుచేయాలన్న డిమాండ్‌తో రగిలిపోయారు.

నిరాశలో పారిశుధ్య కార్మికులు

పారిశుధ్య కార్మికులు ప్రభుత్వంపై నిరశన బావుటా ఎగురవేశారు. అక్షరజ్ఞానం లేని పరిస్థితుల్లో ముఖహాజరు తప్పదని ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఓ 159ని రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేశారు. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ విధానాన్ని రద్దుచేస్తామని ప్రతిపక్షనేతగా జగన్‌ ఇచ్చిన హామీ అమలు చేయకపోవడంపైనా దశలవారీగా ఆందోళనకు దిగారు. విజయనగరం కార్పొరేషన్‌తో పాటు రాజాం, బొబ్బిలి మున్సిపాలిటీలు, నెల్లిమర్ల నగర పంచాయతీలో కార్మికులు ఆందోళనలు తీవ్రతరం చేశారు. గ్లౌజులు, బూట్లు, మాస్కులు, సభ్బులు, ఆయిల్‌, యూనిఫారాలు ఇవ్వకపోవడంపై కూడా ఆ వర్గం అసంతృప్తితోనే గడిపింది.

చిరుద్యోగులు సైతం..

గ్రామస్థాయిలో పనిచేస్తున్న చిరుద్యోగులు గ్రీన్‌ అంబాసిడార్లు కూడా నిరశన జ్వాలను ప్రభుత్వానికి వినిపించారు. బకాయిలు ఇవ్వాలని వేడుకున్నా పట్టించుకోకపోవడాన్ని తప్పుపడుతూ ప్రభుత్వాన్ని శాపనార్ధాలు పెట్టారు. వేతనాల బాధ్యతను పంచాయతీల నుంచి తప్పించాలని, జీఓ 57 ప్రకారం నెలకు రూ.10వేలు వేతనంగా ఇవ్వాలని, ఇతరత్రా సౌకర్యాలు కల్పించాలని పలుమార్లు ఆందోళనబాట పట్టారు.

అంగన్వాడీలనూ ఆదుకోలేదు..

పర్యవేక్షణ పేరుతో జరుగుతున్న వేదింపులు ఆపాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న టీఏ బకాయిలు వెంటనే చెల్లించాలన్న ప్రధాన డిమాండ్లతో జిల్లావ్యాప్తంగా అంగన్వాడీలు ఆందోళనలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని, మినీ సెంటర్లను సెంటర్లుగా మార్పు చేయాలని, జాబ్‌ కేలెండర్‌ నిర్ణయించాలని, ర్యాలీలు, సభలు, ధర్నాల రూపంలో నిరశన వ్యక్తం చేసేందుకు వ్యతిరేకంగా ప్రభుత్వం తెచ్చిన జీఓను రద్దు చేయాలని ఆందోళన చేశారు.

అన్నం పెట్టే చేతులకే సున్నం..

అన్నం పెట్టే చేతులకే సున్నం రాసే విధంగా ప్రభుత్వం వ్యవహరించింది. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల్ని కార్మికులుగా గుర్తించకపోవడంపై అసంతృప్తితో రగిలిపోయారు. ధారుణంగా పెరిగిన ఽనిత్యావసర వస్తువుల దరల నేపధ్యంలో చార్జీలు పెంచకపోవడం, సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్ధిక సమస్యల్లో చిక్కుకుపోయారు. ఉద్యోగభద్రతకు ముప్పు కలిగేలా ప్రయివేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వ తప్పుడు నిర్ణయంపై గళం విప్పారు.

ఇదో దుష్ట ప్రభుత్వం

రామ్మూర్తినాయుడు, సిటు జిల్లా కార్యదర్శి.

ఇదో దుష్ట ప్రభుత్వం. అయిదేళ్లు అధికారం అనుభవించి అన్నివర్గాలనూ నట్టేట ముంచింది. అభివృద్ధి జాడల్లేవు. సంక్షేమానికి తిలోదకాలిచ్చారు. నిరశన తెలియజేసే హక్కును కూడా కాలరాసేలా జీఓలు తెచ్చారు. ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీలు కూడా అమలుచేయని ఘనత ఈ ముఖ్యమంత్రికే దక్కింది.

Updated Date - May 26 , 2024 | 11:19 PM