ఐదేళ్ల నిర్లక్ష్యం
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:51 PM
పార్వతీపురం మండలం పెద్దమరికి పంచాయతీ పరిధిలో ఉన్న వరహాల గెడ్డ రిజర్వాయర్‌పై కూడా గత ప్రభుత్వం దృష్టి సారించలేదు. దాని నిర్వహణకు నిధులు కూడా మంజూరు చేయలేదు. దీంతో రిజర్వాయర్ షట్టర్లు పూర్తిగా మరమ్మతులకు గురయ్యాయి.

నిర్వహణను గాలికొదిలేసిన వైనం.. కాలువలనూ పట్టించుకోలే..
ఆయకట్టుదారులకు నీటి కష్టాలు.. నూతన ప్రభుత్వంపైనే ఆశలు
పార్వతీపురం రూరల్, జూలై 8: గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో కీలక సాగునీటి వనరుల పరిస్థితి దయనీయంగా మారింది. కనీస నిర్వహణకు నోచుకోక అధ్వానంగా తయారయ్యాయి. ఐదేళ్ల కాలంలో కాలువల మరమ్మతులను కూడా చేపట్టలేదు. దీంతో ఏటా రైతులు సాగునీటికి కటకటలాడాల్సి వస్తోంది. పార్వతీపురం మండలం పెద్దమరికి పంచాయతీ పరిధిలో ఉన్న వరహాల గెడ్డ రిజర్వాయర్‌పై కూడా గత ప్రభుత్వం దృష్టి సారించలేదు. దాని నిర్వహణకు నిధులు కూడా మంజూరు చేయలేదు. దీంతో రిజర్వాయర్ షట్టర్లు పూర్తిగా మరమ్మతులకు గురయ్యాయి. మరోవైపు పూడికలు, పిచ్చిమొక్కలతో కాలువలు నిండిపోగా ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదు. వాస్తవంగా ఈ రిజర్వాయర్ ద్వారా సుమారు 800 ఎకరాలకు నీరు అందించాల్సి ఉంది. అయితే కనీసం 300 ఎకరాలకు కూడా సాగునీరు అందడం లేదు. దీంతో ఏటా రైతులు వరుణుడిపై ఆధారపడి పంటల సాగు చేపట్టాల్సి వస్తోంది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమవడంతో ఆయకట్టుదారులు నూతన ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నారు. రిజర్వాయర్‌పై దృష్టి సారించి .. పూర్తిస్థాయిలో సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, షట్టర్లను బాగు చేసి నీరు వృథాగా పోకుండా చూడాలని వారు కోరుతున్నారు.