Share News

మృత్యువుతో పోరాడి..

ABN , Publish Date - Apr 14 , 2024 | 12:12 AM

జిల్లాకు చెందిన యువ సీఐఎస్‌ఎఫ్‌ జవాన్‌ మృత్యువుతో పోరాడి.. చివరకు కన్నుమూశారు. ఢిల్లీలో జరిగిన హోలీ సంబరాల్లో పాల్గొన్న ఆయన విద్యుదాఘాతానికి గురై గాయాలపాలయ్యారు. అనంతరం చికిత్స పొందినా ప్రయోజనం లేకపోయింది.

మృత్యువుతో పోరాడి..

రెండు వారాలుగా అక్కడి ఆసుపత్రిలో చికిత్స

చివరకు కన్నుమూసిన జిల్లావాసి

స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తి

పాలకొండ: జిల్లాకు చెందిన యువ సీఐఎస్‌ఎఫ్‌ జవాన్‌ మృత్యువుతో పోరాడి.. చివరకు కన్నుమూశారు. ఢిల్లీలో జరిగిన హోలీ సంబరాల్లో పాల్గొన్న ఆయన విద్యుదాఘాతానికి గురై గాయాలపాలయ్యారు. అనంతరం చికిత్స పొందినా ప్రయోజనం లేకపోయింది. ఈ వార్త తెలిసి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. పాలకొండ మండలం గొట్ట మంగళాపురం గ్రామానికి సీఐఎస్‌ఎఫ్‌ సైనికుడు సామంతుల రాంబాబు (31) ప్రమాదవశాత్తూ విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందారు. కొంతకాలంగా రాంబాబు ఢిల్లీలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే గతనెల 25న ఆయన సహచరులతో కలిసి అక్కడ జరిగిన హోలీ సంబరాల్లో పాల్గొన్నారు ఓ భవనం నుంచి బకెట్‌తో నీళ్లు వేసేందుకు కొందరు ప్రయత్నించారు. ఇదే సమయంలో బకెట్‌ జారడంతో ఆ వీధిలో హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లు తెగిపడ్డాయి. దీంతో హోలీ సంబరాల్లో పాల్గొన్నవారు విద్యుత్‌ షాక్‌కు గురయ్యారు. ఈ క్రమంలో రాంబాబు తీవ్రగాయాలయ్యారు. వెంటనే ఆయన్ని ఢిల్లీలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే రెండు వారాలుగా అక్కడ చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం రాత్రి మృతి చెందారు. కాగా రాంబాబుకు వివాహం జరిగి ఎనిమిది నెలలే కావడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతునికి భార్యతో పాటు తల్లిదండ్రులు లక్ష్మీ, నారాయ ణరావు భోరున విలపించారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కాగా శనివారం గ్రామానికి చేరుకున్న మృతదేహానికి అంత్యక్రియలు జరిపారు.

Updated Date - Apr 15 , 2024 | 01:21 PM