Share News

పండగ వేళ.. వినూత్నంగా!

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:18 AM

కనుమ పండగ రోజు కూడా అంగన్‌వాడీలు ఉద్యమ బాట వీడలేదు. జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

 పండగ వేళ.. వినూత్నంగా!
కొమరాడ: గోమాతలకు పూజ చేస్తూ నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీలు

ప్రభుత్వ తీరుపై మండిపాటు

హామీలు నెరవేర్చాలని డిమాండ్‌

బెలగాం/పాలకొండ/కొమరాడ/సాలూరు రూరల్‌, జనవరి 16: కనుమ పండగ రోజు కూడా అంగన్‌వాడీలు ఉద్యమ బాట వీడలేదు. జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం పార్వతీపురంలోని కలెక్టరేట్‌ వద్ద సమ్మె శిబిరంలో వారు వంటలు చేసుకుని నిరసన తెలిపారు. ‘సీఎం జగన్‌కు.. మా ఆకలి బాధలు కనిపించడం’? లేదా అంటూ ప్రశ్నించారు. మహిళా సాధికారతకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెబుతున్న వైసీపీ సర్కారు అంగన్‌వాడీలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. కుటుంబ సభ్యులతో జరుపుకోవాల్సిన పండగలను ప్రభుత్వ తీరు వల్ల సమ్మె శిబిరాల వద్ద చేసుకోవాల్సిన వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. చిరుద్యోగులమైన తమపై ఎస్మా చట్టం ప్రయోగించడం, నోటీసులు ఇవ్వడం సబబు కాదన్నారు. గత 36 రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నా.. సర్కారు స్పందించకపోవడం ఎంతవరకు సమంజసమన్నారు. కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని, సీఎం జగన్‌ .. గతంలో తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వారు నినదించారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం ఆగదని, సమ్మె మరింత ఉధృతం చేస్తామని అంగన్‌వాడీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. సీఐటీయూ, పట్టణ పౌర సంక్షేమ, గిరిజన సంఘం నాయకులు సంఘీభావం తెలిపారు.పాలకొండలోని తహసీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు ముగ్గులు వేసి.. ఎద్దులకు దండాలు పెట్టి నిరసన తెలిపారు. ప్రభుత్వం ఎలాంటి ఒత్తిళ్లు, భయాలకు గురిచేసినా వెనక్కి తగ్గేది లేదన్నారు. ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం కొనసాగిస్తామని సంఘ నాయకులు వెల్లడించారు. కొమరాడలో గోమాతలకు పూజలు చేసి నిరసన వ్యక్తం చేశారు. సాలూరులో మండలానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్తలు గుంజీలు తీస్తు ప్రభుత్వానికి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తమ డిమాండ్లు నెరవేర్చాలని ఉపముఖ్యమంత్రి రాజన్నదొరకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సమస్యలను ఈ నెల 19న విజయవాడ వెళ్లి ప్రభుత్వానికి వివరిస్తానని ఆయన తెలిపారు.

Updated Date - Jan 17 , 2024 | 12:18 AM