Share News

ఎన్నికలకు సర్వం సిద్ధం

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:44 AM

జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అంతా సిద్ధంగా ఉన్నామని కలెక్టర్‌, ఎన్నికల అధికారి నిశాంత్‌కుమార్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. గురువారం నోటిఫికేషన్‌ విడుదలవుతుండ గా, ఆ రోజు నుంచి ఈనెల 25 వరకు రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు.

ఎన్నికలకు సర్వం సిద్ధం

- మన్యం జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

పార్వతీపురం, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అంతా సిద్ధంగా ఉన్నామని కలెక్టర్‌, ఎన్నికల అధికారి నిశాంత్‌కుమార్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. గురువారం నోటిఫికేషన్‌ విడుదలవుతుండ గా, ఆ రోజు నుంచి ఈనెల 25 వరకు రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చన్నారు. కలెక్టరేట్‌లో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. సోషల్‌ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలు, తదితర పోస్టులపై నిరంతర నిఘా ఉంటుందని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 48 ఎఫ్‌ఏసీ, 36 ఎస్‌ఎస్‌టీ, 16 వీఎస్‌, నాలుగు వీవీ బృందాలు పనిచేస్తున్నాయన్నారు. జిల్లాలో అంతర్రాష్ట్ర సరి హద్దులైన ములిగూడ, బత్తిలి, భామిని, పి.కోనవలస, కోనేరు కూడళ్లలోను, గుణుపూర్‌, పద్మాపూర్‌, దండిగాం, ఆర్‌కే బట్టివలస, అడారు వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పారు. 25 పోలింగ్‌ కేంద్రాల లొకేషన్లను నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించామని, 439 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏర్పాట్లు పూర్తి చేయాలి..

అరకు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ఆదేశించారు. బుధవారం అరకు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఉన్న సహాయ రిటర్నింగ్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయాలని, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, స్టాటిక్‌ సర్వేలెన్స్‌ టీమ్‌లు, వీడియో వ్యూయింగ్‌ బృందాలు పటిష్ఠంగా పనిచేయాలని సూచించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎన్నికల అధికారి విజయసునీత మాట్లాడుతూ.. రంపచోడవరం గురుకుల పాఠశాలలో, అరకు, పాడేరు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి పాడేరులో లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ శోభిక, ఎస్‌డీసీఆర్‌ వి.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 12:44 AM