Share News

అంతా రామమయం

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:14 AM

జిల్లావ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు మిన్నంటాయి. వాడవాడలా సీతారాముల కల్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించారు. బుధవారం శ్రీరామ నామస్మరణతో ఆలయాలు మార్మోగాయి.

 అంతా రామమయం
తోటపల్లిలో సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

కన్నుల పండువగా కల్యాణ మహోత్సవం

గరుగుబిల్లి, ఏప్రిల్‌ 17 : జిల్లావ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు మిన్నంటాయి. వాడవాడలా సీతారాముల కల్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించారు. బుధవారం శ్రీరామ నామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. పార్వతీపురం, సాలూరు, పాలకొండ, కురుపాంతో పాటు 15 మండలాల్లోని రామాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మొత్తంగా అంతటా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి ఆలయాల్లో శ్రీరామ నవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. తొలుత కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామ సుప్రభాత సేవ, ఆరాధన, మంగళా శాసనం, విష్వక్సేన పూజ, పుణ్యహ వాచనం, రుత్విక్‌ వరుణ, రక్షా బంధనం, మృత్యుం గ్రహణం, అంకురారోపణంతో పాటు విశేష పూజలను చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ రాములోరి కల్యాణ మహోత్సవాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు. శ్రీరామ నామస్మరణ నడుమ వివాహ ఘట్టంలోని ప్రతి తంతును భక్తులు వీక్షిస్తూ పులకించారు. ప్రధానంగా తలపై జీలకర్ర బెల్లం పెట్టే సంఘటన, మంగళ సూత్రధారణ, తలంబ్రాలను చల్లుకునే ప్రక్రియలను చూసి ఆనందపరవశులయ్యారు. కల్యాణాన్ని ఆద్యంతం కనులార్పకుండా చూశారు. ఆలయ ప్రాంగణంలో తోటపల్లికి చెందిన భక్తుల కోలాటం ప్రదర్శన, పలు సాంస్కృతిక కార్యక్ర మాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కల్యాణానికి హాజరైన భక్తులకు ఉచిత ప్రసాదాలతో పాటు పానకం, పూజా సామగ్రిని ఆలయ ఈవో వీవీ సూర్యనారాయణ సమకూర్చారు. మధ్యాహ్నం అన్నదానం కూడా నిర్వహించారు. కాగా ఈ నెల 9 నుంచి కోదండ రామస్వామి ఆలయంలో ప్రారంభమైన వసంత నవరాత్రి మహోత్సవాలు నేటితో ముగిసినట్లు అర్చకులు, దేవాలయ సిబ్బంది తెలిపారు.

Updated Date - Apr 18 , 2024 | 12:15 AM