Share News

అందరూ సౌమ్యులట.. ఉత్తములేనట!

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:50 AM

ఎమ్మెల్యేలు సౌమ్యులు.. మంచి వారు.. మనసు వెన్నవంటిది’ అంటూ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తున్న తమ ఎమ్మెల్యే అభ్యర్థుల గురించి సీఎం జగన్‌ మంగళవారం జిల్లాలో జరిగిన సిద్ధం సభలో చెప్పుకొచ్చారు. వైసీపీ అభ్యర్థులను పరిచయం చేస్తూ ఇలాంటి పాలన మళ్లీ కావాలంటే వీరినే ఎన్నుకోవాలని కోరారు.

అందరూ సౌమ్యులట.. ఉత్తములేనట!

అందరూ సౌమ్యులట.. ఉత్తములేనట!

మరి భూ కబ్జాలు.. సెటిల్‌మెంట్ల సంగతేంటో?

అక్రమ పంథాలో వెళ్తున్న వారికి జగన్‌ పొగడ్తలు

దౌర్జన్యాలు చేసిన వారినీ కీర్తించిన ముఖ్యమంత్రి

(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

‘ఎమ్మెల్యేలు సౌమ్యులు.. మంచి వారు.. మనసు వెన్నవంటిది’ అంటూ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తున్న తమ ఎమ్మెల్యే అభ్యర్థుల గురించి సీఎం జగన్‌ మంగళవారం జిల్లాలో జరిగిన సిద్ధం సభలో చెప్పుకొచ్చారు. వైసీపీ అభ్యర్థులను పరిచయం చేస్తూ ఇలాంటి పాలన మళ్లీ కావాలంటే వీరినే ఎన్నుకోవాలని కోరారు. నిజంగా వారంతా అంత మంచి వారా? అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. దందాలు.. భూ కబ్జాలు.. సెటిల్‌మెంట్లు.. నేరాలు చేస్తున్న వారి సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ముందు ఓ మహిళ బొండపల్లిలోని మహిళాగళం సభలో విలపించింది. తన భూమి రికార్డులు మార్చేసి అధికార పార్టీ నేతలు దౌర్జన్యం చేస్తున్నట్లు కంటతడి పెట్టింది. ఈ దందా వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందని స్పష్టం చేసింది. ధైర్యంగా ముందుకొచ్చి ఈ ప్రభుత్వంలో తనకు ఎదురైన కష్టాలను విన్నవించింది. ఇలాంటి బాధితులు ప్రతి మండలం.. గ్రామం.. వీధిలోనూ ఉన్నారు. వీటన్నింటినీ విస్మరించిన సీఎం మళ్లీ అధికారం కోసం ఎమ్మెల్యేలంతా బాగా పనిచేసినట్లు కితాబు ఇవ్వడాన్ని ప్రతి ఒక్కరూ విమర్శిస్తున్నారు. ఆయా నేతల గురించి సంక్షిప్తంగా..

భూములపై ఆయన కన్నేశారంటే..

జిల్లాలోని ఓ ఎమ్మెల్యే భూ కబ్జాలకు కొదవలేదు. అనుచరులతో ’సౌమ్యంగా’ భయపెట్టి తన దారికి తీసుకురావడంలో దిట్ట. ఇలా దేవదాయ భూములు, 22ఎ భూములు, తన భూములను అనుకుని ఉన్న రైతుల భూములపై కన్నేస్తారు. తమ దారికి రాకుంటే రికార్డులను ట్యాంపరింగ్‌ చేస్తారు. తొలుత అనుచరులే రాయబేరాలు కుదురుస్తారు. తక్కువ డబ్బులకే ’వెన్నలాంటి మనసు’తో భూములు తమ పరం చేసుకుని బినామీల పేరుతో రిజిస్ట్రేషన్లు జరిపించేస్తారు. భూములివ్వని వారిపై నిఘా వేసి ఎక్కడ దొరుకుతారా అన్న ’మంచి తనం’తో నిత్యం నిఘా పెడతారు. సోదరుని అధికారం కూడా కలిసి రావటంతో రెండు చేతులా ఆస్తులు కూడగట్టారు. ఇసుక మాఫియాకు అండదండలు అందిస్తున్న మనసున్న నాయకుడాయన.

రియల్‌ ఎస్టేట్‌.. సెటిల్‌మెంట్లే పనిగా..

ఆ నియోజకవర్గలోని ఎమ్మెల్యే రియల్‌ ఎస్టేట్‌.. చిట్టీల వ్యాపారాల్లో ఆరితేరారు. స్థలాల అమ్మకం.. చిట్టీలు కట్టించుకోవడం.. రెండింటికీ లింకు పెట్టి ఇబ్బందులకు గురిచేయటం.. ఆయన శైలి. రైతు బజారుకు సమీపంలోని ఓ స్థలం లావాదీవీల్లో ఇదే కోణంలోనే ఇరికించి ఆ వ్యవహారం కోర్టుకు వెళ్లేలా చేశారు. తన సొంత నియోజకవర్గంలోనే కాకుండా పక్క నియోజకవర్గాల్లో సైతం తన కుటుంబీకులు, బంధువుల పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేస్తారు. చెరువులు, ప్రభుత్వ స్థలాలు కలిపేస్తారు. నేత కబ్జా చేసేందుకు భూములుంటాయి కాని డిగ్రీ కళాశాలకు సొంత భవనాలకు మాత్రం స్థలం కొరతను చూపిస్తున్నారు.

సౌమ్యంగా కన్పిస్తారంతే..

పూర్వం రాజుల ఏలుబడిలో ఉన్న ఆ నియోజకవర్గంలో సౌమ్యంగా కన్పించే ఆ ఎమ్మెల్యే చేసే పనులు మాత్రం విచిత్రంగా ఉంటాయి. ఇద్దరు అన్నదమ్ములూ ఎమ్మెల్యేలు మాదిరిగా వ్యవహరిస్తుంటారు. ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను సైతం ఇద్దరూ చెరో గ్రామాలవైపు వెళ్లి నిర్వహిస్తుంటారు. ఇలా పదవిని సర్దుకుపోవటం కూడా జగన్‌ దృష్టిలో మంచితనమే నేమో. ఆ నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిని పట్టించుకోరు. స్వయంగా ఇచ్చిన హామీలనూ నెరవేర్చరు.

తిట్టిన వారినే నెత్తిన పెట్టుకుని..

ఆయన కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేతగా.. మంత్రిగా కొనసాగుతున్నపుడు జగన్‌పై ధ్వజమెత్తేవారు. పరుష పదజాలాన్ని వినియోగించిన సందర్భాలున్నాయి. ఓక్స్‌వ్యాగన్‌ కార్ల ఫ్యాక్టరీ అక్రమాలపై రాష్ట్రం అట్టుడికినప్పుడు కూడా ఆయన్ను పరిశ్రమల శాఖ నుంచి మరో శాఖకు మార్చారు. కాగా చెల్లూరు సిద్ధం సమావేశంలో జగన్‌ అతన్ని తన తండ్రి వంటి వారని సంభోదించారు. గతం మరిచిన జగన్‌ రాజకీయాలే ముఖ్యంగా భావించారన్న విమర్శలు జనం నుంచి వ్యక్తమవుతున్నాయి.

‘రెవెన్యూ’పైనే ఆయన దృష్టి

విశాఖ జిల్లాను అనుకుని ఉన్న ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే భూ దందాలకు కొదవే లేదు. వివాదాస్పద స్థలంలో ఇల్లు కట్టిన దగ్గర నుంచి భూముల కుంభకోణాల వరకూ ఎన్నో అక్రమాల ఆరోపణలు ఉన్నాయి. సొంత పార్టీలోని కీలక నేతలు సైతం ఎమ్మెల్యేతో విభేదించి వైసీపీని వీడి టీడీపీలో చేరారు. రెవెన్యూ కార్యక్రమాలను తన కనుసన్నల్లో నిర్వహించుకునేందుకు ఏకంగా తహసీల్దార్లను మార్చిన సంఘటనలున్నాయి. ఎన్నికల్లో ప్రలోభాలు చేయడంలో అందివేసిన చేయిగా ఆయనకు పేరుంది.

ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉన్నా..

విజయనగరం పార్లమెంట్‌ పరిధిలో ఉన్న ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆ నియోజకవర్గం నుంచి వేరే చోటుకు బదిలీ చేస్తారన్న ప్రచారం జరిగింది. ఆ ఎమ్మెల్యేను కూడా జగన్‌ మంచివాడు, మనసు వెన్న అయితే కొంత ఖటువుగా ఉంటాడు అంటూ ప్రస్తావించారు.

చీమ చిటుక్కుమన్నా ఆయనకు చెప్పాల్సిందేనట

ఆ ఎమ్మెల్యే జిల్లాలోని కీలక నేతలకు బంధువు. దీంతో తనకు ఎదురు లేదని వ్యవహరిస్తూ ఉంటారు. సొంతంగా గనులను చేజిక్కించుకునేందుకు పథకం పన్నారు. గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండానే గనుల తవ్వకాలకు సిద్ధం అయ్యారు. నియోజకవర్గంలో చీమ చిటుక్కుమన్నా ఎమ్మెల్యేకు చెప్పాల్సిందేనట. ఎవరు భూముల అమ్మకాలు.. కొనుగోలు చేసినా చెప్పాల్సిందే. అభివృద్ధి పనుల విషయంలో మాత్రం స్పందన ఉండదు.

విమర్శించి.. మిన్నకుండి..

ఆ నేత పరిధి చాలా ఎక్కువ. ఆయన అవినీతిపై గళం విప్పుతారు. విద్యుత్‌ శాఖ పరిధిలోని ఉద్యోగాలను అమ్మేశారంటూ విమర్శలు చేస్తారు. తరువాత సొంత పార్టీ, ప్రభుత్వంలో జరిగిన అక్రమాలే తెలుసుకుని మిన్నకుండిపోతారు. అంటే అవినీతి జరిగినా దానిని నిలదీసినట్లు నిలదీసి మళ్లీ మిలాఖత్‌ కావడాన్నే మంచి తనం అంటారేమో మరి.

------------

Updated Date - Apr 25 , 2024 | 12:50 AM