Share News

ప్రతి సారీ.. మార్చేస్తున్నారు!

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:15 AM

సువిశాల సాగరతీరం... ప్రసిద్ధి చెందిన శ్రీరాముని ఆలయం...చైతన్యం గల ఓటర్లను కలిగిన నేపథ్యం... నెల్లిమర్ల నియోజకవర్గం సొంతం. రాజకీయ ఉద్దండులను అందించిన ప్రాంతమిది. గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన నెల్లిమర్ల నియోజకవర్గ ఓటరు ప్రతి ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేలను మార్చేస్తున్నారు.

ప్రతి సారీ.. మార్చేస్తున్నారు!

- ఇదీ నెల్లిమర్ల ఓటర్ల తీరు

- మొదట్లో సతివాడ నియోజకవర్గం

- 2009లో నెల్లిమర్ల ఆవిర్భావం

- బడ్డుకొండ రెండుసార్లు... పతివాడ ఒకసారి విజయం

- తొలిసారి బరిలోకి జనసేన అభ్యర్థి

- రామతీర్థం పుణ్యక్షేత్రం ఇక్కడే..

- ఇది నెల్లిమర్ల నియోజకవర్గ ముఖచిత్రం

(నెల్లిమర్ల)

సువిశాల సాగరతీరం... ప్రసిద్ధి చెందిన శ్రీరాముని ఆలయం...చైతన్యం గల ఓటర్లను కలిగిన నేపథ్యం... నెల్లిమర్ల నియోజకవర్గం సొంతం. రాజకీయ ఉద్దండులను అందించిన ప్రాంతమిది. గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన నెల్లిమర్ల నియోజకవర్గ ఓటరు ప్రతి ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేలను మార్చేస్తున్నారు.

విజయనగరం జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా భావించే నియోజకవర్గం నెల్లిమర్ల. దీనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. విశాలమైన సముద్ర తీరం. పొడవైన జాతీయ రహదారి ఉన్నాయి. పూసపాటిరేగ, భోగాపురం మండలాల పరిధిలో సుమారు 20 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. వందేళ్ల్ల చరిత్ర కలిగిన నెల్లిమర్ల జూట్‌ మిల్లుతో పాటు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన పుణ్యక్షేత్రం రామస్వామి వారి దేవస్థానం నెల్లిమర్ల మండలం రామతీర్థం గ్రామంలో ఉంది. జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేని ఫార్మా కంపెనీలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. తలసరి ఆదాయ పరంగా చూస్తే విజయనగరం జిల్లాలోని మిగిలిన నియోజక వర్గాల కన్నా ఇక్కడ ఎక్కువేనని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ నెల్లిమర్ల నియోజకవర్గంలోని భోగాపురంలోనే ఉంది. అపర భగీరథిగా పిలవబడే తారకరామతీర్థ సాగర్‌ ప్రాజెక్టు ఇదే నియోజకవర్గంలో ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలోని సాగు, తాగునీటి అవసరాలు తీరనున్నాయి. నియోజకవర్గంలో 90 శాతం బీసీలే. అందులో తూర్పు కాపు సాఽమాజిక వర్గం అధికం. ఆ తర్వాత యాదవులు, తెలగ కులస్తులు, మత్స్యకారులు, ఇతర సామాజిక వర్గాల వారు ఉంటారు. నియోజక వర్గంలో మొత్తం ఓటర్లు 2.13.168 మంది ఉన్నారు.

2009లో ఆవిర్భావం..

ఒకప్పుడు ఇది సతివాడ నియోజకవర్గం. పునర్విభజన అనంతరం 2009లో నెల్లిమర్ల నియోజక వర్గం ఆవిర్భవించింది. అంతకుముందు ఉన్న సతివాడ నియోజక వర్గం నుంచి నెల్లిమర్ల మండలాన్ని, భోగాపురం నియోజక వర్గం నుంచి పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ మండలాలతో కలిపి కొత్తగా నెల్లిమర్ల నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గం ఆవిర్భావం తరువాత 2009, 2014, 2019 సంవత్సరాల్లో సాధారణ ఎన్నికలు జరిగాయి. తాజాగా నెల్లిమర్ల నియోజకవర్గంలో నాలుగోసారి సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి.

గత మూడు ఫలితాలు ఇలా..

ఈ నియోజక వర్గంలో గత మూడుసార్లు ఫలితాలను పరిశీలిస్తే.. ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీకి ఓటర్లు అవకాశం ఇచ్చారు. 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన బడ్డుకొండ అప్పలనాయుడు, 2014లో టీడీపీ తరఫున పోటీ చేసిన పతివాడ నారాయణస్వామినాయుడు, 2019లో వైసీపీ అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు విజయం సాఽధించారు. బడ్డుకొండ అప్పలనాయుడు ఇంత వరకు మూడుసార్లు పోటీ చేసి.. రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తాజాగా నాలుగోసారి ఎన్నికల బరిలో దిగారు. టీడీపీ సీనియర్‌ నాయకుడు పతివాడ నారాయణస్వామినాయుడు భోగాపురం, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో మొత్తం 8సార్లు పోటీ చేసి ఏడుసార్లు విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ఈసారి ఆయనకు టిక్కెట్‌ దక్కలేదు. పొత్తులో భాగంగా ఈ నియోజక వర్గం నుంచి జనసేన అభ్యర్థి లోకం నాగమాధవికి టిక్కెట్‌ కేటాయించారు. ఇదే నియోజకవర్గ పరిధిలోని నెల్లిమర్ల మండలం మొయిద విజయరాంపురం గ్రామానికి చెందిన దివంగత పెనుమత్స సాంబశివరాజు కూడా సతివాడ నియోజకవర్గం నుంచి ఎనిమిదిసార్లు పోటీ చేసి ఏడుసార్లు విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ఆయన కుమారుడు డాక్టర్‌ పీవీవీ సూర్యనారాయణరాజు (సురేష్‌బాబు) ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.

సతివాడలో ఇలా..

సతివాడ నియోజకవర్గంలో నెల్లిమర్లకు చెందిన దివంగత బయిరెడ్డి సూర్యనారాయణ రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. గుర్ల మండలం పాలవలసకు చెందిన దివంగత పొట్నూరు సూర్యనారాయణ సతివాడ నియోజక వర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా నాలుగుసార్లు పోటీ చేసి 1994లో ఒకసారి విజయం సాధించారు. గతంలో విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్న భోగాపురం నియోజకవర్గానికి చెందిన దివంగత కొమ్మూరు అప్పడుదొర, దివంగత కొమ్మూరు సంజీవరావు క్రియాశీల రాజకీయాల్లో ఉండేవారు. అప్పడుదొర విశాఖ ఎంపీగా, జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా పనిచేశారు. సంజీవరావు భోగాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాలుగు సార్లు పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఒకసారి విశాఖపట్నం ఎంపీగా గెలుపొందారు.

ఓటర్ల వివరాలు

పురుషులు: 1,05,411 మంది

స్ర్తీలు: 1,07,754

ట్రాన్స్‌ జెండర్లు: 3

మొత్తం: 2.13,168 మంది

పోలింగ్‌ స్టేషన్లు: 248

నెల్లిమర్ల నియోజక వర్గం ఎమ్మెల్యేలు..

సం. పేరు పార్టీ

2009 బడ్డుకొండ అప్పలనాయుడు (కాంగ్రెస్‌)

2014 పతివాడ నారాయణస్వామి నాయుడు (టీడీపీ)

2019 బడ్డుకొండ అప్పలనాయుడు (వైసీపీ)

Updated Date - Apr 20 , 2024 | 12:15 AM