Share News

‘దీపం’తో ప్రతి ఇంటా వెలుగులు

ABN , Publish Date - Oct 25 , 2024 | 12:18 AM

‘సూపర్‌ సిక్స్‌’లో తొలి హామీ అమలుకు రంగం సిద్ధమైంది. దీపావళి నుంచి ప్రతి కుటుంబానికి ఏటా మూడు వంట గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

‘దీపం’తో  ప్రతి ఇంటా వెలుగులు

ప్రభుత్వ ఆదేశాలతో ఏర్పాట్లు

దీపావళి నుంచే ఇచ్చేందుకు చర్యలు

జిల్లాలో 2.81 లక్షల మందికి లబ్ధి

(పార్వతీపురం, అక్టోబరు24 (ఆంధ్రజ్యోతి)/జియ్యమ్మవలస)

‘సూపర్‌ సిక్స్‌’లో తొలి హామీ అమలుకు రంగం సిద్ధమైంది. దీపావళి నుంచి ప్రతి కుటుంబానికి ఏటా మూడు వంట గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే పింఛన్ల పెంపుతో హామీ అమలుకు శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం తాజాగా గ్యాస్‌ సిలిండర్ల విషయంలోనూ స్పష్టమైన ప్రకటన చేసింది. అర్హులందరికీ దీపం పథకం వర్తింపజేయాలని ఆదేశా లిచ్చింది. దీంతో మన్యం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు నిర్ణయంతో జిల్లాలో 2.81 లక్షల మంది తెలుపు రేషన్‌ కార్డుదారులకు లబ్ధి చేకూరనుంది.

ఇదీ పరిస్థితి..

- జిల్లాలో పార్వతీపురంలో 1,31,348 వరకు తెలుపు రేషన్‌ కార్డులు, 36,869 ఏఏవై కార్డులు ఉన్నాయి. పాలకొండ డివిజన్‌లో 93,964 తెలుపు కార్డులు, 25,070 ఏఏవై కార్డులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 15 మండలాల్లో 2,25,312 తెలుపు కార్డులు, 55,939 ఏఏవై కార్డులు కలిపి మొత్తం 2,81,251 రేషన్‌కార్డులు ఉన్నాయి. అయితే వారందరికీ ఏటా మూడు గ్యాస్‌ సిలిండర్లు అందించనున్నారు.

- పార్వతీపురం డివిజన్‌లో పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, సాలూరులలో రెండేసి గ్యాస్‌ ఏజెన్సీలు, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, మక్కువ, పాచిపెంట, బలిజిపేట, కూనేరు, సీతానగరం మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. పాలకొండ డివిజన్‌లో పాలకొండలో రెండు, వీరఘట్టం, భామినిలో ఒక్కొక్కటి ఉన్నాయి. మొత్తంగా జిల్లాలో 17 గ్యాస్‌ ఏజెన్సీలు ఉండగా ఇందులో పార్వతీపురం డివిజన్‌లోనే 14, పాలకొండ డివిజన్‌లో మూడు మాత్రమే ఉన్నాయి. వాటి పరిధిలో 2.81 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు.

- దీపం పథకం కింద ప్రతి నాలుగు నెలలకు ఒకటి చొప్పున ఉచితంగా గ్యాస్‌ సిలిండర్‌ ఇవ్వనున్నారు. ప్రస్తుతం సిలిండర్‌ ధర రూ.876. గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ సమయంలో దాని ధరను చెల్లించాల్సి ఉంటుంది. అందులో కేంద్ర ప్రభుత్వం తన రాయితీని లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తుంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల్లోనే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. ఇలా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు తీసుకోవచ్చు.

బుకింగ్‌కు ఏర్పాట్లు

ఈ నెల 31 నుంచి దీపం పథకం ద్వారా ప్రతి నాలుగు నెలలకు ఒక గ్యాస్‌ సిలిండర్‌ ఉచితంగా అందించాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో గ్యాస్‌ ఏజెన్సీలు బుకింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఆధార్‌ అనుసంధానం, ఈకేవైసీ, సబ్సిడీ జమ కోసం బ్యాంక్‌ అకౌంట్‌ సరిచేయడం, మెసేజ్‌ అలర్ట్‌ కోసం ఫోన్‌ నెంబరు అప్‌డేట్‌ వంటి కార్యక్రమాలు లబ్ధిదారుల గ్రామాల్లోనే చేయించేలా చర్యలు తీసుకున్నారు. ఇంతవరకు దాదాపు 85 శాతం పూర్తి చేసినట్లు గ్యాస్‌ ఏజెన్సీలు చెబుతున్నాయి.

- ఆరు నెలలుగా గ్యాస్‌ బుకింగ్‌ చేయని లబ్ధిదారులకు మాత్రం ఫ్రీ గ్యాస్‌ పథకం వర్తించదు. వారి అకౌంట్లు లాక్‌ అయిపోవడమే ఇందుకు కారణం. ఇటువంటి వారంతా గ్యాస్‌ బుక్‌, ఆధార్‌ కార్డు, ఫోన్‌, బ్యాంక్‌ అకౌంట్లతో తమ కార్యాలయాలకు రావాలని గ్యాస్‌ ఏజెన్సీలు చెబుతున్నాయి.

సరిచూసుకోవాలి

ప్రభుత్వం అందిస్తున్న ఫ్రీ గ్యాస్‌ విషయంలో లబ్ధిదారులు అన్నీ సరిచూసుకోవాలి. గ్యాస్‌ బుక్‌ నెంబరుకు ఆధార్‌, ఫోన్‌ నెంబరు, బ్యాంక్‌ అకౌంట్‌ లింక్‌ అయ్యాయా లేదా అనేది చెక్‌ చేసుకోవాలి. ఆరు నెలలు దాటి గ్యాస్‌ బుకింగ్‌ చేయనివారు ఆధారాలన్నీ తీసుకొని నేరుగా గ్యాస్‌ ఏజెన్సీకి వెళ్లి అప్‌ టు డేట్‌ చేసుకోవాలి. కాగా ఉచిత సిలిండర్ల పంపిణీపై ప్రభుత్వం నుంచి విధి విధానాలు రావల్సి ఉంది.

పి.కిరణ్‌కుమార్‌, గ్యాస్‌ ఏజెన్సీ డీలరు, పార్వతీపురం

Updated Date - Oct 25 , 2024 | 12:18 AM