Share News

పనులు చేసినా.. డబ్బులు జమకాలే!

ABN , Publish Date - May 20 , 2024 | 11:28 PM

ఉపాఽధి వేతనం ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని చినకుదమ గ్రామ ఉపాధి వేతనదారులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట గంట సేపు నిరసన కార్యక్రమం చేపట్టారు.

పనులు చేసినా.. డబ్బులు జమకాలే!
ఎంపీడీవో కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తున్న చినకుదమ ఉపాధి వేతనదారులు

ప్రతి వారం రూ. 100 చొప్పున వసూలు

న్యాయం చేయాలని డిమాండ్‌

జియ్యమ్మవలస, మే 20 : ఉపాఽధి వేతనం ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని చినకుదమ గ్రామ ఉపాధి వేతనదారులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట గంట సేపు నిరసన కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో రెండు గ్రూపులకు చెందిన వారమంతా చినకుదమ - గౌరీపురం గ్రామాల మధ్య ఉన్న చింతలసాగరం చెరువులో రెండు వారాల పాటు పనిచేశామని వారు తెలిపారు. అయితే ఒక వారం కొంతమందికే డబ్బులు పడ్డాయని, ఇంకొక వారం పూర్తిగా డబ్బులు పడలేదని చెప్పారు. ఇదేమిటని ఉపాధి హామీ అధికారులను ప్రశ్నిస్తే ‘మరి మీకు డబ్బులు పడవు’ అంటూ నిర్లక్ష్యంగా చెబుతున్నారని వారు తెలియజేశారు. ఇదిలా ఉండగా ఉపాధి పనులు ప్రారంభం కాగానే ఒక్కో వేతనదారు వారానికి రూ. 100 మేట్ల ద్వారా వసూలు చేస్తున్నారని వేతనదారులు వాపోయారు. క్షేత్ర, సాంకేతిక సహాయ కులకు, ఆపై అధికారులకు ఇవ్వాలని, డబ్బులు ఇవ్వకుంటే బిల్లులు ఆపేస్తామని హెచ్చరిస్తున్నారని ఆరోపించారు. గ్రామంలో ఏడు గ్రూపుల్లో ఉన్న దాదాపు 800 మంది నుంచి వారానికి రూ. 80 వేలు వసూలు చేస్తున్నారని వారు తెలిపారు. గత ఐదేళ్ల నుంచి తమకు వంద రోజుల పాటు పని కల్పించలేదన్నారు. 2023-24లో ఐదు వారాలు పని కల్పిస్తే, మూడు వారాల డబ్బులు చెల్లించలేదని వెల్లడించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

విచారణ చేస్తాం

చినకుదమ ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగినట్లు ఆ గ్రామ వేతనదారుల ద్వారా తెలిసింది. పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలకు కలెక్టర్‌కు నివేదిక అందిస్తాం.

- పి.శ్రీనివాసరావు, ఎంపీడీవో, జియ్యమ్మవలస

Updated Date - May 20 , 2024 | 11:28 PM