రహదారిపై ఏనుగులు
ABN , Publish Date - Nov 13 , 2024 | 11:31 PM
కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం గ్రామ రహ దారిపై బుధవారం ఏనుగుల సంచరించాయి. దీంతో ప్రయాణికులు, స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.

కొమరాడ, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం గ్రామ రహ దారిపై బుధవారం ఏనుగుల సంచరించాయి. దీంతో ప్రయాణికులు, స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఏడు ఏనుగుల గుంపును ఒక్కసారిగా చూసి హడలెత్తిపోయారు. అవి ఎవరిపై దాడి చేస్తాయోనని తీవ్ర ఆందోళన చెందారు. గజరాజుల హల్‌చల్ కారణంగా ఆ రహదారిలో సుమారు గంటకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని సమీప పంట పొలాల్లోకి ఏనుగులను తరలించారు. దీంతో ఆ ప్రాంతవాసులు ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉండగా.. కొద్ది రోజులుగా ఏనుగుల గుంపు కుమ్మరిగుంట, కంబవలస, కందివలస, తదితర గ్రామాల్లో సంచరిస్తుండటంతో రైతులు పంట పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఏనుగులను ఈ ప్రాంతం నుంచి తరలించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.