విద్యుత్ తీగలే యమపాశమై..
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:40 PM
విద్యుత్ తీగలు ఆ దంపతుల పాలిట యమపాశంగా మారాయి.

- మీసాలపేటలో దంపతులు మృతి
- నారుమడికి నీరు పెట్టేందుకు వెళ్లిన వైనం
-తెగిపడి ఉన్న తీగలు తగలడంతో మృత్యువాత
- విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణమంటూ గ్రామస్థుల ఆందోళన
- రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన ఏడీఈ
- సమగ్ర దర్యాప్తునకు మంత్రి సంధ్యారాణి ఆదేశం
మెంటాడ, జూలై 5:
విద్యుత్ తీగలు ఆ దంపతుల పాలిట యమపాశంగా మారాయి. నారుమడికి నీరు పెట్టేందుకు వెళ్లిన భర్త తొలుత విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. అతనికి ఏమైందోనని పైకిలేపిన భార్యకు కూడా షాక్ తగలడంతో ప్రాణాలు కోల్పోయింది. తెగిపడి ఉన్న తీగలు తగలడంతోనే వారు మృత్యువాతపడ్డారని, విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. పరిహారం ప్రకటించే వరకూ మృతదేహాలను తరలిస్తే ఊరుకునేది లేదని ఆందోళన చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై మంత్రి సంధ్యారాణి దర్యాప్తునకు ఆదేశించారు.
మండలంలోని మీసాలపేట గ్రామంలో శుక్రవారం విద్యుదాఘాతంతో భార్యాభర్తలు కోరాడ ఈశ్వరరావు (50), ఆదిలక్ష్మి (48) మృతి చెందారు. ఉదయం 7 గంటల సమయంలో ఈశ్వరరావు తన వరినారు మడికి తడిపెట్టేందుకు పొలానికి వెళ్లాడు. సమీపంలో ఉన్న చెరువు వద్దకు వెళ్లి ఇంజన్ అమర్చి పైపు బిగించేందుకు సిద్ధమవ్వగా అక్కడ పచ్చికలో మూసుకుపోయి ఉన్న విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. భర్త ఎంతకీ తిరిగి రాకపోవ డంతో ఉదయం 10 గంటల సమయంలో ఇంటి పని చేయిస్తున్న భార్య ఆదిలక్ష్మి తాపిమేస్త్రీని తీసుకుని పొలం వద్దకు వెళ్లింది. అచేతనంగా పడిఉన్న భర్తను చూసి ఆందోళన చెంది అతన్ని తట్టింది. దీంతో ఆమెకూడా విద్యుత్ షాక్‌కు గురై క్షణాల్లో మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగానే రెండు నిండు ప్రాణాలు పోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారం ప్రకటించాకే మృతదేహాలను తరలించాలని గ్రామస్థులు ఆందోళన చేశారు. అక్కడకు చేరుకున్న ఏఈ తిరుపతిరావుతో వాగ్వాదానికి దిగారు. గజపతినగరం సీఐ ప్రభాకర్, విద్యుత్‌శాఖ ఏడీఈ శివకుమార్ గ్రామస్థులతో చర్చించారు. రూ.5లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని ఏడీఈ ప్రకటించడంతో గ్రామస్థులు శాంతించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం పోలీసులు విజయనగరం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
విద్యుత్ శాఖ నిర్లక్ష్యం?
ఈశ్వరావు, ఆదిలక్ష్మి మృతికి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గతనెల 14న గాలీవాన బీభత్సానికి అనేక గ్రామాల్లో పదుల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. మీసాలపేట చెరువు వద్ద కూడా నేలకొరిగాయి. వాటి తీగలు నేలకు తాకి ఉన్నా సిబ్బంది వాటిని సరిచేయలేదు. ప్రస్తుతం వ్యవసాయ పనులు పెద్దగా లేనందున అటువైపు రైతులు వెళ్లకపోవడంతో తీగలు పడిఉన్న విషయం తెలియలేదు. ఒకరిద్దరు వెళ్లినా విద్యుత్ తీగలను పచ్చిక, పిచ్చిమొక్కలు కప్పేయటంతో వాటిని గుర్తించలేకపోయారు.
గ్రామంలో విషాదం
ఈశ్వరరావు, ఆదిలక్ష్మికి వ్యవసాయమే జీవనాధారం. ఉన్న కొద్దిపాటి భూమిని సాగుచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడు శ్రీనివాసరావు డిగ్రీ పూర్తిచేశాడు. కుమార్తె సునీతకు వివాహ మయ్యింది. దంపతుల మృతితో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. అందరితో కలివిడిగా, అన్యోన్యంగా ఉండేవారిని అలాంటి వారు మృతి చెందారని గుర్తుచేసుకుని స్థానికులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం..
మృతులకు రూ.5లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నట్లు గజపతినగరం విద్యుత్ శాఖ ఏడీఈ శివకుమార్ తెలిపారు. వారి కుమారుడికి విద్యార్హత బట్టి ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగం ఇచ్చేందుకు ఉన్నత అధికారులను కలిసి చర్చిస్తామన్నారు. విరిగి పడ్డ విద్యుత్ స్తంభాల నుంచి తీగలను వేరు చేసినట్లు సిబ్బంది తెలిపారన్నారు. కానీ, తీగల్లోకి విద్యుత్ ఎలా ప్రవహించిందో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తెలుసుకుంటామని చెప్పారు.
దర్యాప్తునకు మంత్రి ఆదేశం
ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ షాక్‌తో భార్యభర్తలు మృతిచెందటం బాధాకరమని, ఈ వార్త తనను ఎంతగానో కలిచివేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
పెరుగుతున్న విద్యుత్ ప్రమాదాలు
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)/రింగురోడ్డు:
జిల్లాలో విద్యుత్ ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఏటా ఈ ప్రమాదాల బారిన పడి ఎందరో మృత్యువాత పడుతుండగా మరికొందరు వైకల్యం బారినపడుతున్నారు. పశువులు సైతం ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ ఏడాది మార్చి వరకు 27 మంది మృతి చెందారంటే ప్రమాదాల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా శుక్రవారం మెంటాడ మండలం మీసాలపేటలో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే భార్యాభర్త మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 4న డెంకాడ మండలం సింగవరం పంచాయతీలో విద్యుదాఘాతానికి గురై పారిశుధ్య కార్మికుడు బి.బంగారి మృతి చెందాడు. నాలుగేళ్ల కిందట రామభద్రపురం మండలం పాతరేగ గ్రామంలోని కోళ్ల ఫారంలో విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు మరణించారు. బొబ్బిలి సబ్‌స్టేషన్‌లో గతేడాది జరిగిన విద్యుత్ ప్రమాదంలో కాంట్రాక్టు షిఫ్ట్ లైన్‌మన్ చనిపోయాడు. ఏడాది కిందట రామభద్రపురంలోని సబ్ స్టేషన్‌లో విద్యుత్ షాక్‌కు గురై ప్రైవేట్ కార్మికుడు మృతి చెందాడు. ఏడాది కిందట గుర్ల మండలం నడుకూరు, కోటగండ్రేడులో జరిగిన వేర్వేరు విద్యుత్ ప్రమాదాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అలాగే చాలా ప్రమాదాల్లో పశువులు కూడా మృతి చెందాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఆయా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. విద్యుత్ శాఖ ద్వారా ఆర్థికంగా పరిహారం అందిస్తున్నా ఆయా కుటుంబాల్లో పెద్ద దిక్కును కోల్పోతున్న నష్టాన్ని ఎవరూ పూడ్చలేనిది. కొన్ని ప్రమాదాలు విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా జరుగుతుండగా, ఇంకొన్ని ప్రమాదాలు తొందర పాటు చర్యలు, ప్రమాదవశాత్తు చోటు చేసుకుంటున్నాయి.
గత మూడేళ్లలో ప్రమాదాలు
----------------------------------
ఏడాది మృతులు పశువులు
--------------------------------
2021-22 11 16
2022-23 11 24
2023-24(మార్చి) 27 17
--------------------------------