Share News

ఎన్నికల ‘సారా’ంజామా

ABN , Publish Date - Apr 14 , 2024 | 12:19 AM

ఈ ఎన్నికల్లో మద్యం కోసం కోటి రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోందని ఓ రాజకీయ పార్టీ నాయకుడు నర్మగర్భంగా ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పాడు. గతంలో ఎన్నికలు వస్తే నెల రోజులు ఖర్చు చేసినా మద్యం కోసం మహా అయితే రెండు లక్షల రూపాయలు సరిపోయేవని, ఇపుడు తెగ తాగేస్తుండడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదన్నాడు.

ఎన్నికల ‘సారా’ంజామా

ఎన్నికల ‘సారా’ంజామా

తయారీకి ముందస్తు ఆర్డర్లు ఇస్తున్న నాయకులు

కేటగిరీల వారీగా మద్యం పంపకాలకు ప్రణాళికలు

బ్రాండెడ్‌.. చీప్‌ లిక్కర్‌.. సారా సేకరణకు ఏర్పాట్లు

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

ఈ ఎన్నికల్లో మద్యం కోసం కోటి రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోందని ఓ రాజకీయ పార్టీ నాయకుడు నర్మగర్భంగా ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పాడు. గతంలో ఎన్నికలు వస్తే నెల రోజులు ఖర్చు చేసినా మద్యం కోసం మహా అయితే రెండు లక్షల రూపాయలు సరిపోయేవని, ఇపుడు తెగ తాగేస్తుండడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదన్నాడు. ఇదే నాయకుడు నాటుసారాకు కూడా ఆర్డర్‌ ఇచ్చాడని అనుయాయులు తెలిపారు. రాజకీయ నాయకులు ఖర్చు తగ్గించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మద్యం కన్నా సారాను ఎక్కువగా తెప్పించాలని భావిస్తున్నారు. ముందు చూపు మరీ ఎక్కువై అక్కడక్కడ ఎక్సైజ్‌ అధికారులకు దొరికిపోతున్నారు. ఇప్పటికే కార్యకర్తలు.. నాయకులతో పాటు ప్రచారంలో పాల్గొంటున్న వారిని ప్రలోభాలతో ముంచెత్తుతున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఖర్చు భారీగా పెరగనుందని అంచనాకు వచ్చి సారాపై దృష్టిపెడుతున్నారు.

నామినేషన్ల ఘట్టం తరువాత ప్రతిరోజు రూ.30నుంచి రూ.50వేలు ఖరీదు చేసే నాటు సరుకును సిద్ధంగా ఉంచాలని కొందరు నేతలు తమ అనుచరులకు ఆదేశాలు ఇచ్చారు. మద్యం అమ్మకాలపై ఎన్నికల సంఘం ఎంత ఖఠినంగా వ్యవహరించినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలా సారాను సిద్ధం చేసుకుంటున్నారు. అభ్యర్థులతో తిరుగుతున్న ద్వితీయ శ్రేణి నాయకులకు బ్రాండెడ్‌ మద్యం అందిస్తున్నారు. కార్యకర్తలకు మద్యం షాపుల్లో లభ్యం అయ్యే చీప్‌ లిక్కర్‌ అందిస్తున్నారు. ప్రచారం కోసం తిప్పుతున్న వారికి నాటుసారా అందిస్తున్నారు. ఇలా ఉన్నత, మిడిల్‌, లో అనే మూడు కేటగిరీలుగా మద్యం పంపకాలు సాగుతున్నాయి.

రహస్య ప్రదేశాలకు నిల్వలు

మద్యం అమ్మకాలపై నియంత్రణ కారణంగా నామినేషన్ల తరువాత మద్యం దొరకదన్న అనుమానంతో రాజకీయ నాయకులు మద్యం నిల్వలను పెద్దఎత్తున దాచేస్తున్నారు. ముందుగానే నిల్వలను కొనుగోలు చేసి రహస్య ప్రదేశాలకు తరలిస్తున్నారు. మద్యానికి కృత్రిమ కొరత ఏర్పడనున్న కారణంగా సారాను ప్రత్యామ్నాయంగా వాడుకునేందుకు కూడా వ్యూహం పన్నారు. నాటు సారా వంటకాలు మొత్తం ఏజెన్సీ ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి. అయితే వంటకాలు ఏజన్సీ(ఒడిశా)లోనూ... దిగుమతి మైదాన ప్రాంతాలకు అన్నట్లు వ్యవహారం సాగుతోంది. ఒడిశా సరిహద్దుల్లో వంటకాలు నిర్వహించి మన జిల్లాలోని పట్టణ ప్రాంతాలకు సారా తరలుతోంది. మెంటాడ, బొబ్బిలి, సాలూరు మీదుగా రామభద్రపురం, ఒడిశాలోని బందుగాం వయా పార్వతీపురం మీదుగా బొబ్బిలి, విజయనగరం ప్రాంతాలకు సారా చేరుకుంటోంది. సారా తరలించేందుకు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. పట్టు బడకుండా జాగ్రత్త పడుతున్నారు. గతంలో ఉమ్మడి జిల్లాలో ఓ తహసీల్దార్‌ తను వాడుతున్న అద్దె కారుడిక్కీలో సారా తరలించారు.

ప్రాణాంతకమే..

సారా ప్రాణాంతకమని వైద్యులు ఘోషిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు ఇప్పమొగ్గను పులియబెట్టడం ద్వారా సారా తయారు చేసేవారు. ఇప్ప మొగ్గ లభ్యం కాకపోవటం, బాగా సమయం తీసుకోవటంతో ఈ విధానానికి స్వస్తి పలికారు. ప్రస్తుతం నల్ల బెల్లంలో యూరియా, నవ్వాసారం, బ్యాటరీల్లో ఉండే నల్లని గుండను వేసి పులయబెడుతున్నారు. దీనిని వేడి చేయటం ద్వారా వచ్చిన ఆవిరిని చల్లార్చి సారా తయారు చేస్తున్నారు. ఇది ఇప్పమొగ్గతో తయారు చేసిన దానికంటే కిక్కు అధికంగా ఇస్తుంది. కాని రసాయనాలు విచ్చలవిడిగా వాడుతున్న కారణంగా ప్రాణాంతకమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

-----------

Updated Date - Apr 14 , 2024 | 12:19 AM