‘ఎగ్’నామం
ABN , Publish Date - Apr 03 , 2024 | 11:33 PM
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి మూడు రోజుల నుంచి కోడిగుడ్ల సరఫరా నిలిచిపోయింది.

- మూడు రోజులుగా విద్యార్థులకు ఇవ్వని గుడ్లు
- బిల్లులు చెల్లించకపోవడంతో సరఫరా చేయని ఏజెన్సీలు
రామభద్రపురం/భోగాపురం, ఏప్రిల్ 3: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి మూడు రోజుల నుంచి కోడిగుడ్ల సరఫరా నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోడిగుడ్లను సరఫరా చేసే ఏజెన్సీతో పాటు ట్రాన్స్‌ఫోర్టు చేసే వారికి సుమారు 6 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. ఫలితంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రాథమిక పాఠశాలలతోపాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు కూడా గుడ్ల సరఫరా ఒక్కసారిగా నిలిచిపోయింది. దీంతో రామభద్రపురంలో ఉన్న కోడిగుడ్ల గోదాం ఖాళీ అట్టలతో దర్శనమిస్తోంది. ఏజెన్సీ నుంచి గుడ్ల సరఫరా నిలిచిపోవడంతో తాము పాఠశాలకు అందించలేకపోతున్నామని గోదాము ఇన్‌చార్జి బండారు నాగరాజు తెలిపారు. విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ సొంత జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉన్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై పిల్లల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖకు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటనలు గుప్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న ఆహారంలో నిర్లక్ష్యం చూపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
ఫిర్యాదులు వచ్చాయి
కోడిగుడ్లు రావడం లేదని ప్రధానోపాధ్యాయుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. కోడిగుడ్లతో పాటు శెనగ చక్కీల సరఫరా కూడా నిలిచిపోయింది. బిల్లులు చెల్లించే వరకూ సరఫరా చేయలేమని ఆయా ఏజెన్సీలు జిల్లా విద్యాశాఖాధికారులకు నోటీసులు కూడా ఇచ్చాయి. ఈ సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉంది.
-ఆమిటి తిరుమలప్రసాద్, ఎంఈవో, రామభద్రపురం