Share News

డ్వాక్రా సొమ్ము పక్కదారి

ABN , Publish Date - Apr 13 , 2024 | 12:15 AM

మండల కేంద్రం మెంటాడలో డ్వాక్రా సొమ్ము పక్కదారి పట్టింది. రూ.16 లక్షల మేర అక్రమాలు జరిగినట్లు గ్రామ సర్పంచ్‌ రేగిడి రాంబాబు గతం వారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గాయి. వెలుగు సిబ్బందిపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.

      డ్వాక్రా సొమ్ము పక్కదారి

- రూ.16 లక్షల మేర అక్రమాలు

- స్త్రీ నిధి రుణాలదీ అదేబాట

- వెలుగు సిబ్బందిపై అనుమానాలు

- కలెక్టర్‌కు మెంటాడ సర్పంచ్‌ ఫిర్యాదు

- ఆలస్యంగా వెలుగులోకి

మెంటాడ, ఏప్రిల్‌ 12: మండల కేంద్రం మెంటాడలో డ్వాక్రా సొమ్ము పక్కదారి పట్టింది. రూ.16 లక్షల మేర అక్రమాలు జరిగినట్లు గ్రామ సర్పంచ్‌ రేగిడి రాంబాబు గతం వారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గాయి. వెలుగు సిబ్బందిపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు అధికారులు కూడా విచారణ ప్రారంభించారు. ఈ విషయం ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మెంటాడ గ్రామ పంచాయతీ పరిధిలోని 700 డ్వాక్రా సంఘాల సభ్యులు ప్రతినెలా క్రమం తప్పకుండా అప్పు, పొదుపు కింద డబ్బును బ్యాంకు ఖాతాల్లో జమచేసేందుకు సంబంధిత వెలుగు సిబ్బందికి అందించేవారు. ఇలా మొత్తం రూ.61,86,970 ఇచ్చారు. అయితే, కొన్ని గ్రూపులకు చెందిన నగదు బ్యాంకు ఖాతాలకు జమకాలేదని తెలిసి సంబంధిత గ్రూపుల అధ్యక్ష, కార్యదర్శులు సర్పంచ్‌ దృష్టికి తెచ్చారు. దీనిపై ఆయన విచారణ చేపట్టగా రూ.16,85,825 పక్కదారి పట్టినట్టు గుర్తించి ఆధారాలతో సహా గత వారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఆయా సంఘాలు బ్యాంకుల నుంచి రుణం ఎప్పుడు పొందాయి.. ఇప్పటివరకు ఎంత చెల్లించాయి తదితర వివరాలపై ఆరా తీసినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వెలుగు సిబ్బందిని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే వారిని రహస్యంగా విచారించి చేతివాటం చూపిన సిబ్బంది నుంచి సొమ్మును రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

స్త్రీ నిధి రుణాలు కూడా..

కొన్ని గ్రూపులకు చెందిన సభ్యులు స్త్రీ నిధి రుణాలు పొంది వాటిని క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తున్నా రు. అయితే, కొందరు స్త్రీనిధి రుణాల తీసుకోకపోయినా తీసుకున్నట్లు బ్యాంకు సిబ్బంది చెబుతుండడంతో వారు అవాక్కవుతున్నారు. దీనిపై ఆరాతీస్తే ఇందులో వెలుగు సిబ్బంది చేతివాటం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. వాస్తవానికి స్త్రీనిధి రుణాలు లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు జమవుతాయి. అయితే, సభ్యులను వెలుగు సిబ్బంది మభ్యపెట్టి తీర్మానం రాయించి సంతకాలు చేయించుకున్న తర్వాత బ్యాంకు సిబ్బంది సహకారంతో ఆ రుణం మొత్తాన్ని చెక్కురూపంలో పొంది ఉంటారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ విషయమై స్త్రీ నిధి విభాగం జిల్లా మేనేజర్‌ రమేష్‌ వివరణ కోరగా.. ‘ఫిర్యాదు అందింది. మార్చి వరకూ బకాయిలు లబ్ధిదారులు క్లియర్‌ చేసేశారు. ఏప్రిల్‌ నుంచి వాయిదాలు చెల్లించాల్సిన రుణాలు ఉన్నాయని’ తెలిపారు. ఫిర్యాదు తర్వాత క్లియర్‌ చేయడమంటే అవకతవకలు నిజమే కదా, బాఽధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించగా సూటిగా సమాధానం చెప్పలేదు.

చర్యలు తీసుకోవాల్సిందే

సుమారు రూ.16 లక్షల డ్వాక్రా సొమ్ము పక్కదారి పట్టింది. దీన్ని అధికారులు తేలిగ్గా తీసుకుంటున్నట్టుగా ఉంది. విచారణలో గోప్యతకు కారణమేంటో చెప్పాలి. బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారో వెల్లడించాలి. రికవరీ జరిగిందని చెబుతున్న అధికారుల మాటల్లో పొంతనలేదు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందే.

- రాంబాబు, సర్పంచ్‌, మెంటాడ

Updated Date - Apr 13 , 2024 | 12:15 AM