Share News

రైతుల్లో గుబులు

ABN , Publish Date - Oct 22 , 2024 | 12:17 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రైతులను కలవర పరుస్తోంది. ఈనెల 23 నుంచి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

రైతుల్లో గుబులు
వంగర మండలం కొప్పరలో నేలకొరిగిన వరి పైరు

రైతుల్లో గుబులు

వణికిస్తున్న వాయుగుండం

బొబ్బిలి/ వంగర, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి):

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రైతులను కలవర పరుస్తోంది. ఈనెల 23 నుంచి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం సాయంత్రం నుంచి వాతావరణంలో మార్పులు రావడం, ఆకాశం మబ్బులు పట్టి, చిన్న చిన్న గాలులు కూడా వీస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చే పంట చేజారిపోతుందే మోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే నెలలో హుద్‌హుద్‌ తుఫాన్‌ వచ్చి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. నాటి పరిస్థితులు ఇంకా కళ్లముందే కదలాడుతున్నాయి. అక్టోబరులోనే తుఫాన్‌ అనేసరికి అందరిలోనూ టెన్షన్‌ నెలకొంది. వర్షాలు కురిస్తే పండిన పంటంతా మొలకెత్తే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. కాగా వంగర మండలంలోని వంగర, బంగారువలస, కొప్పర, శ్రీహరిపురం కొండచాకరాపల్లి తదితర గ్రామాల్లో ఆదివారం రాత్రి చిరుజల్లులు పడ్డాయి. సోమవారం తీవ్రగాలులు వీచాయి. వాటి తాకిడికి కొంతమేర పంట నేలమట్టమైంది.

ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి

కలెక్టరేట్‌, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు మండలాల వారీగా యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలని కలెక్టర్‌ అంబేడ్కర్‌ ఆదేశించారు. బుధ, గురువారాల్లో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. సోమవారం సాయంత్రం ఆయా శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈనెల 22 నుంచి 26 వరకూ ప్రత్యేక అధికారులు మండలాల్లో ఉండాలని సూచించారు. ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చూడాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో పారిశుధ్యం పనులు నిర్వహించాలన్నారు. గ్రామాల్లో బహిరంగ మల విసర్జనను పూర్తిగా నిర్మూలించాలని చెప్పారు.

----------------

Updated Date - Oct 22 , 2024 | 12:17 AM