Share News

ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై నిర్లక్ష్యం వద్దు

ABN , Publish Date - May 24 , 2024 | 11:31 PM

ఓట్ల లెక్కింపునకు అవసరమైన ఏర్పాట్లను ముమ్మరం చేయాలని, ఎలాంటి నిర్లక్ష్యం వద్దని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ అన్నారు.

 ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై నిర్లక్ష్యం వద్దు
కౌంటింగ్‌ నిర్వహణపై సూచనలు చేస్తున్న కలెక్టర్‌, ఎస్పీ

- కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

గరుగుబిల్లి, మే 24: ఓట్ల లెక్కింపునకు అవసరమైన ఏర్పాట్లను ముమ్మరం చేయాలని, ఎలాంటి నిర్లక్ష్యం వద్దని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌తో కలిసి ఉల్లిభద్ర పరిధిలోని ఉద్యాన కళాశాలలోని కౌంటింగ్‌ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. కురుపాం, పార్వతీపురం, పాలకొండ, సాలూరు నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జూన్‌ 4వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. లెక్కింపునకు సంబంధించి ఐరన్‌ మెస్‌, అలాగే భారీ కేడ్లు ఏర్పాట్లు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు ఏజెంట్లు వ్యవహరించాలన్నారు. ఏజెంట్లతో పాటు ఎన్నికల సిబ్బంది వచ్చి వెళ్లే మార్గాలను సౌకర్యవంతంగా ఉండాలన్నారు. లెక్కింపు కేంద్రాల్లో రిటర్నింగ్‌ అధికారి టేబుల్‌, లెక్కింపు టేబుళ్లు ఏర్పాటుపై అలసత్వం వహించరాదన్నారు. ఈ ప్రాంతాల్లో గాలి, వెలుతురు, వసతి, తదితర అంశాలపై అశ్రద్ధ వహించకూడదన్నారు. సకాలంలో పనులు పూర్తికి ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు దృష్టి సారించాలన్నారు. అనంతరం కంట్రోల్‌ రూము ప్రాంతం నుంచి పోలీస్‌ పహారాతో పాటు పరిసర ప్రాంతాలను, అలాగే బ్యాలెట్‌ బాక్సులు, ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని నిశితంగా పరిశీలించారు. ఈ పరిశీలనలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ఎస్‌ శోభన్‌, పాలకొండ, సాలూరు, కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు శుభం బన్సల్‌, సి.విష్ణుచరణ్‌, వీవీ రమణ, కె.హేమలతతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి జి.కేశవనాయుడు, కంట్రోల్‌ రూము ఎస్‌డీసీ ఆర్‌.సూర్యనారాయణ, తదితరులు ఉన్నారు.

Updated Date - May 24 , 2024 | 11:31 PM