Share News

ఎన్నికల ఏర్పాట్లపై నిర్లక్ష్యం వద్దు

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:05 AM

సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లపై నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్‌కుమార్‌ సూచించారు. ఉల్లిభద్ర ఉద్యాన కళాశాల ఆవరణలో చేపడుతున్న ఏర్పాట్లను బుదవారం ఆయన పరిశీలించారు.

ఎన్నికల ఏర్పాట్లపై నిర్లక్ష్యం వద్దు
వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన కలెక్టర్‌, ఇతర అధికారులు

గరుగుబిల్లి, మార్చి 27 : సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లపై నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్‌కుమార్‌ సూచించారు. ఉల్లిభద్ర ఉద్యాన కళాశాల ఆవరణలో చేపడుతున్న ఏర్పాట్లను బుదవారం ఆయన పరిశీలించారు. పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాలకు చెందిన ఓట్లు లెక్కింపు కార్యక్రమం ఈ కళాశాల ఆవరణలోనే జరగనుందని ఆయన తెలిపారు. ఈ మేరకు ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. బ్యాలెట్‌ బాక్సులకు సంబంధించి అవసరమైన స్ట్రాంగ్‌ రూములకు ప్రత్యేక భద్రత కల్పించాలన్నారు. వాహనాలకు సంబంధించి పార్కింగ్‌ స్థలం ఏర్పాటు చేయాలన్నారు. మీడియా కేంద్రం, సీసీ కెమెరాలతో పాటు పలు సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు అందించారు. నిర్ధేశించిన సమయానికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సౌకర్యాల విషయంలో అలసత్వం పనికిరాదన్నారు. గ్రామ, మండల స్థాయిలో నియమించిన అధికారులు ఎప్పకటిప్పుడు సమాచారాన్ని అందించాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పరిశీలనలో జేసీ శోభిక, ఇన్‌చార్జి డీఆర్వో జి.కేశవనాయుడు, పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పీవోలు విష్ణుచరణ్‌, కల్పనాకుమారి, ఆర్డీవోలు కె.హేమలత, వీవీ రమణలు, సర్వే అధికారి కె.సూర్యారావు, తహసీల్దార్‌ కె.జయ, మండల సర్వేయర్లు , రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రచారాలకు అనుమతి తప్పనిసరి

పార్వతీపురం, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): రాజకీయ పార్టీల ప్రచారానికి అనుమతులు తప్పనిసరి అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా తెలిపారు. బుధవారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాజకీయ పార్టీలు నిర్వహించే కార్యక్రమాలకు 48 గంటల ముందుగా సువిధ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉందన్నారు. అలా వీలు కాని పక్షంలో కొన్ని అత్యవసర పరిస్థితుల్లో ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను ఇవ్వొచ్చన్నారు. కాగా ఆ వివరాలన్నింటినీ ఎన్కోర్‌ పోర్టల్‌లో నమోదు చేసి సకాలంలో అనుమతులు జారీ చేయాలని అధికారులకు సూచించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలతో పాటు ఏపీ పురపాలక, స్థానిక సంస్థలు, జీహెచ్‌ఎంసీ చట్టాలను పరిగణనలోనికి తీసుకొని అనుమతులు మంజూరు చేయాలన్నారు. సి-విజల్‌ యాప్‌లో నమోదయ్యే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. ఎన్నికల సీజర్‌ మేనేజ్‌ఎంట్‌ విధానాన్ని పటిష్ఠంగా అమలు చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ పీవోలు విష్ణుచరణ్‌, కల్పనాకుమారి, జాయింట్‌ కలెక్టర్‌ శోభిక తదితరులు పాల్గొన్నారు.

ఆ రంగులకు సున్నాలు వేస్తారో.. లేదో?

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రభుత్వ భవనాలకు వైసీపీ పోలిన రంగులు ఉంటే వాటికి సున్నాలు వేస్తున్నారు. అదే విధంగా శిలాఫలకాలపై నాయకులు, సీఎం ఫోటోలు కనిపించకుండా ముసుగులు వేస్తున్నారు. కానీ జిల్లాలో మాత్రం ఆ పరిస్థితి లేదు. తాజాగా బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో ఇదే అంశంపై చర్చించినట్లు తెలిసింది. జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వ భవనాలకు వైపీపీ పోలిన రంగులు ఉన్నా, పాత శిలాఫలకాలపై నాయకుల ఫొటోలు ఉన్నా.. కోడ్‌ నిబంధనల ప్రకారం వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించినట్టు సమాచారం. అయితే ఇకనైనా అధికారులు వాటిని తొలగిస్తారో లేదో చూడాల్సి ఉంది. దీనిపై జిల్లా మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండాక్ట్‌ అధికారిని ఫోన్‌లో వివరణ కోరేందుకు సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

Updated Date - Mar 28 , 2024 | 12:05 AM