Share News

వేలం వేయక.. కౌలూ రాక

ABN , Publish Date - Feb 12 , 2024 | 12:27 AM

గజపతినగరం సీతారామస్వామి ఆలయ భూములు ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లి పోతున్నాయి. ఆ భూములను కౌలుకు ఇచ్చేందుకు గతంలో ఏటా వేలం నిర్వహించేవారు.

వేలం వేయక.. కౌలూ రాక
ఎం.గుమడాంలో కౌలుదారుల చేతిలో ఉన్న దేవదాయ భూములు

వేలం వేయక.. కౌలూ రాక

ఆక్రమణలో దేవదాయ భూములు

రూ. లక్షల ఆదాయం గండి

పట్టించుకోని అధికారులు

గజపతినగరం సీతారామస్వామి ఆలయ భూముల పరిస్థితిదీ

గజపతినగరం సీతారామస్వామి ఆలయ భూములు ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లి పోతున్నాయి. ఆ భూములను కౌలుకు ఇచ్చేందుకు గతంలో ఏటా వేలం నిర్వహించేవారు. వచ్చిన ఆదాయంతో దూప, దీప, నైవేద్యం, అర్చలకు జీతాలు తదితర ఖర్చులకు ఉపయోగించేవారు. తొమ్మిదేళ్లుగా ఆ పరిస్థితి లేదు. భూములను అనుభవిస్తున్న వ్యక్తులు కౌలునూ సక్రమంగా చెల్లించడం లేదు. దీనివల్ల లక్షలాది రూపాయల ఆదాయానికి గండి పడుతోంది. మరోవైపు భూములకు రక్షణా కరువవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఆ భూములు దేవదాయ శాఖ నుంచి చేజారిపోవడం ఖాయమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

గజపతినగరం, ఫిబ్రవరి 11:

సీతారామస్వామి దేవాలయానికి సంబందించి మండలంలోని ఐదు గ్రామాల్లో భూములున్నాయి. శ్రీరంగ రాజపురంలో 49 ఎకరాల 23 సెంట్లు, ఎం.గుమడాంలో 19 ఎకరాల 3సెంట్లు, కనిమెరకలో 29 సెంట్లు, గజపతినగరంలో 34సెంట్లు, మదుపాడ గ్రామంలో 62 సెంట్లు మొత్తంగా 69 ఎకరాల 51 సెంట్ల భూమిని 23 మంది రైతులు కౌలుకు తీసుకున్నారు. అలాగే గజపతినగరంలో దేవాలయానికి చెందిన 8 షాపులు అద్దెలకు ఇచ్చారు. భూములు, షాపులు కలిపి గతంలో ఏడాదికి రూ.98వేల 475లు చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. చాలా తక్కువ అద్దెకు అవకాశం కల్పించారు. అది కూడా ఇప్పుడు వసూలు కావడం లేదు. అధికారులు కౌలునూ పెంచడం లేదు.

భూములకు సంబంధించి సీతారామస్వామి దేవాలయంలో ఏటా దేవదాయశాఖ అధికారుల సమక్షంలో కౌలు రైతుల వేలం పాట జరిగేది. భూమిని దక్కించుకున్నవారు పంటలు పండించుకొని కౌలును చెల్లించేవారు. ఇలా 2014 వరకు సాఫీగా జరిగింది. 2015 నుంచి నేటికి 9 ఏళ్లుగా వేలం పాట నిర్వహించడం లేదు కానీ ఆయా భూములను వారే ఉపయోగించుకుంటున్నారు. కౌలును మాత్రం సక్రమంగా చెల్లించడం లేదు. లక్షలాది రూపాయల కౌలు బకాయిలు పేరుకుపోతున్నాయి. రికార్డుల పరంగా 2019-20కి రూ.లక్షా 20వేల 985, 20-21కి సంబంధించి 13వేల 470రూపాయలు, 21-22కి సంబంధించి లక్షా 7వేలు మాత్రమే చెల్లింపులు జరిగాయి. మిగిలిన కౌలు డబ్బులు లక్షల్లో పేరుకుపోయింది. అలాగే ఈ భూములను కొందరు రైతులు ఇతరుల వద్ద తన ఖా పెట్టినట్లు తెలిసింది. ఎం. గుమడాం గ్రామానికి చెందిన ఓ కౌలు రైతు అదే గ్రామానికి చెందిన కొందరు రైతుల నుంచి రూ.2లక్షలు తీసుకొని దేముడి భూమిని సబ్‌ లీజ్‌కు ఇచ్చినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇలా ఐదు గ్రామాల్లోనూ అసలైన కౌలుదారులనుంచి ఆక్రమణదారుల చేతిలోకి వెళ్తున్నాయి. చాలా ఏళ్లు రెగ్యులర్‌ ఈవో లేకపోవడంతో ఇన్‌చార్జి పాలన సాగింది. ఇప్పుడు రెగ్యులర్‌ ఈఓ రావడంతో దేవదాయ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని మండల వాసులు కోరుతున్నారు.

వచ్చెనెలలో భూముల వేలం

జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వచ్చేనెలలో దేవదాయ భూములను వేలం వేస్తాం. గత నవంబర్‌ లో డిప్యూటీ కలెక్టర్‌ భూములను పరిశీలించారు. గతంలో ఇన్‌చార్జ్‌ ఈవోలు ఉండడం వల్ల వేలం ప్రక్రియలో జాప్యం జరిగింది. దేవదాయ భూములు రికార్డుల్లో ఉన్న కౌలు రైతుల వద్దే ఉండాలి. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. బకాయి వసూళ్లను వేగవంతం చేస్తాం.

- శ్రీరాం, ఈవో, గజపతినగరం

Updated Date - Feb 12 , 2024 | 12:27 AM