Share News

నిగనిగలు చూసి మోసపోవద్దు

ABN , Publish Date - May 26 , 2024 | 11:20 PM

రాజాం వస్త్రపురి కాలనీకి చెందిన శ్రీనివాసరావుకు మామిడిపండ్లంటే చాలా ప్రీతి. తాజాగా మార్కెట్‌కు వెళ్లి రెండు కిలోలు కొనుగోలు చేశాడు. తినాలన్న ఆత్రంతో ఇంటికి తీసుకెళ్లిన వెంటనే కోశాడు. లోపల చూస్తే తెల్లగా ఉన్నాయి. తిని చూస్తే ఒకటే పులుపు. అంటే పండ్లు ఇంకా పక్వానికి రాలేదు. తొక్కచూస్తే ఎర్ర రంగులో ఆకట్టుకుంది. ఎంతో రుచిగా ఉంటుందని భావించాడు. ఈ విధంగా చాలా మంది ప్రతిరోజూ మోసపోతున్నారు. రసాయనాలతో మామిడి పండ్లను మగ్గబెట్టడమే దీనికి కారణం.

నిగనిగలు చూసి   మోసపోవద్దు

నిగనిగలు చూసి

మోసపోవద్దు

మామిడిపంట్లపై రసాయనాల ప్రభావం

విషపూరితంగా మారుతున్న ఫలాలు

వ్యాపారుల నిర్వాకం

ప్రజారోగ్యానికి ముప్పు

పట్టించుకోని యంత్రాంగం

రాజాం వస్త్రపురి కాలనీకి చెందిన శ్రీనివాసరావుకు మామిడిపండ్లంటే చాలా ప్రీతి. తాజాగా మార్కెట్‌కు వెళ్లి రెండు కిలోలు కొనుగోలు చేశాడు. తినాలన్న ఆత్రంతో ఇంటికి తీసుకెళ్లిన వెంటనే కోశాడు. లోపల చూస్తే తెల్లగా ఉన్నాయి. తిని చూస్తే ఒకటే పులుపు. అంటే పండ్లు ఇంకా పక్వానికి రాలేదు. తొక్కచూస్తే ఎర్ర రంగులో ఆకట్టుకుంది. ఎంతో రుచిగా ఉంటుందని భావించాడు. ఈ విధంగా చాలా మంది ప్రతిరోజూ మోసపోతున్నారు. రసాయనాలతో మామిడి పండ్లను మగ్గబెట్టడమే దీనికి కారణం.

రాజాం, మే 26:

వేసవి వచ్చిందంటే అందరికీ మొదటిగా గుర్తుకొచ్చే ఫలం మామిడి. చిన్న,పెద్ద అందరూ ఈ పండును ఇష్టపడతారు. అయితే ఏ పండు అయినా సహజ సిద్ధంగా మగ్గితే అంతే సహజంగా రుచి కూడా ఉంటుంది. వ్యాపారులు ఈ సూత్రాన్ని విస్మరించి ఆదాయమే పరమావధిగా పండ్లను రసాయనాలతో మగ్గబెట్టి ప్రజలకు అంటగడుతున్నారు. దీనివల్ల రుచి లేకపోయినా నోరు ఊరించే రంగుతో కనిపిస్తాయి. సహజమైన రుచిని కోల్పోతున్నాయి. పైగా అవి తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మామిడి పండ్లను పిల్లల నుంచి పెద్దవారి వరకూ అందరూ ఇష్టపడతారు. వారి అభిరుచిని వ్యాపారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. కాయలు చాలా చిన్నగా ఉన్నప్పుడే కోసేసి రసాయనాలు వేసి మగ్గించేస్తున్నారు. ఆపై అధిక ధరకు అమ్ముతున్నారు. ఏటా వేసవిలో మామిడి పంట అందుబాటులోకి వస్తుంది. కానీ మార్చి చివరి వారం నుంచే కొందరు వ్యాపారులు రసాయనాలతో మగ్గబెట్టి విక్రయించడం జిల్లాలో జరుగుతోంది. అరకొరగా ఉత్పత్తి వచ్చినప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలన్నది వ్యాపారుల ఆలోచన. అందుకే నెల రోజులుగా పక్వానికి రాక మునుపే రసాయనాలతో మగ్గబెట్టిన మామిడిపండ్లను విక్రయిస్తున్నారు.

- అత్యంత ప్రమాదకరమైన కాల్షియం కార్బైడ్‌తో ఇథిలిన్‌, సల్ఫర్‌ వంటి రసాయనాలను పండ్లు మగ్గబెట్టేందుకు వినియోగిస్తున్నారు. దీంతో పండ్లలో పోషకాలు తగ్గడమే కాకుండా విషపూరితంగా మారుతున్నాయి. ఇథిలిన్‌ ద్రావణాన్ని నీటిలో కలిపి మామిడి కాయలపై చల్లుతున్నారు. దీంతో అవి రసాయనాలతో కృత్రిమంగా మగ్గుతు న్నాయి. అనారోగ్యానికి కారణంగా మిగులుతున్నాయి. ప్రధానంగా కాల్షియం కార్బైట్‌ మనిషికి అత్యంత చేటు తెచ్చే రసాయనం. ఒక్క మామిడికే కాదు. అరటి, సపోట, బొప్పాయి, యాపిల్‌, జామ ఇలా అన్నింటినీ మగ్గ బెట్టడానికి రసాయనాలనే వాడుతున్నారు.

- జిల్లాలో మామిడి సాగు విస్తీర్ణం పరవాలేదు. ఇక్కడ నుంచి మామిడి ఉత్పత్తులు ఇతర రాష్ర్టాలకు వెళుతుంటాయి. అయితే కొందరు వ్యాపారులు రసాయ నాలతో మగ్గించి వాటిని ఇక్కడే విక్రయిస్తున్నారు. విజయనగరం, ఎస్‌.కోట, కొత్తవలస, బొబ్బిలి, చీపురుపల్లి, రాజాంలో జోరుగా మామిడి పండ్ల విక్రయాలు సాగుతు న్నాయి. జిల్లాలో పండ్లను మగ్గబెట్టే కేంద్రాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. ముఖ్యంగా విజయనగరంతో పాటు అన్ని పట్టణాల్లో వ్యాపారుల హవా నడుస్తోంది. ఇక్కడ రోజుల తరబడి కాయలను నిల్వ ఉంచుతారు. డిమాండ్‌ ను బట్టి మగ్గబెడతారు. సాధారణ రోజుల్లో ప్రతిరోజూ 50 టన్నుల వరకూ అరటిపండ్లు, పది టన్నుల వరకూ యాపిల్‌ పండ్లు, కమలాపండ్లు, మూడున్నర టన్నుల వరకూ సపోట, జామ, ఇతరత్రా పండ్లు వినియోగిస్తున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. వేసవిలో మాత్రం దాదాపు 45 రోజుల పాటు సగటున 100 టన్నుల మామిడిని వినియోగిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

పండ్లు కొనుగోలు చేసినప్పుడు అవగాహన తప్పనిసరి. పండ్లుపై మచ్చలు సరిపోల్చుకోవాలి. పొడితనం ఉంటే గమనించాలి. కొన్న వెంటనే పండ్లను కాసేపు వేడినీటిలో ఉంచాలి. మైనపు పూతలా ఉంటే తొక్కను తీసి గమనించాలి.

ఆరోగ్యంపై ప్రభావం..

- రసాయనాలతో మగ్గించిన పండ్లతో అనారోగ్య సమస్యలు వస్తాయి. తినడం వల్ల కడుపులో వికారం ఏర్పడుతుంది. వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడతా రు.

- రక్తహీనత, రక్తపోటు వంటి సమస్యలు వస్తాయి.

- కాళ్లలో సూదులు గుచ్చుతున్నట్టు అర చేతిలో, అరకాళ్లలో చర్మవ్యాధులు సోకుతాయి.

- తలనొప్పి, అలసట, నరాల సమస్యలు తలెత్తుతాయి.

- ఊపిరి తిత్తులు, మూత్రాశయ వ్యాధులు సంక్రమిస్తాయి.

- మూత్రపిండాలు దెబ్బతినడమే కాకుండా కేన్సర్‌ వచ్చే అవకాశం ఉంది.

- మానసిక వ్యాధులు కూడా సంక్ర మిస్తాయి.

- కనురెప్పల వాపు సమస్యలు వస్తాయి.

అవి తింటే అనారోగ్యమే

అజాగ్రత్తతో వ్యవహరించి పండ్లను కొనుగోలుచేస్తే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్టే. రసాయనాలతో మగ్గించిన పండ్లతో ప్రమాదమే. శరీరంలో ఆక్సిజన్‌ లెవల్స్‌ తగ్గుతాయి. మెగ్నీషియం, కార్మన్స్‌ ప్రభావం ఎక్కువై అనారోగ్యం బారిన పడతారు. ప్రధాన అవయవాలపైపెను ప్రభావం చూపవచ్చు. అందుకే తాజా పండ్లనే తీసుకోవాలి.

- ఎం.తిరుపతిరావు, వైద్యాధికారి, రాజాం

---------------

Updated Date - May 26 , 2024 | 11:20 PM