నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:50 PM
జిల్లా అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధతో విధులు నిర్వహించాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేదలేదన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడుతూ.. శ్రద్ధ, అంకితభావంతో పనిచేసి జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు.

పార్వతీపురం, జూలై 8(ఆంధ్రజ్యోతి): జిల్లా అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధతో విధులు నిర్వహించాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేదలేదన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడుతూ.. శ్రద్ధ, అంకితభావంతో పనిచేసి జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. ఏ శాఖలోనైనా క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సంబంధిత ఉన్నతాధికారులే బాధ్యులవుతారని స్పష్టం చేశారు. ప్రాథమిక, ఇంజనీరింగ్ రంగాలపై ప్రత్యేక దృష్టిసారించాలని, జిల్లాలో మలేరియా తదితర వంటి వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు, అనారోగ్య సమస్యలతో విద్యార్థుల మృతి చెందిన ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. వసతిగృహాల్లో ఉన్న పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేసి.. తమకు నివేదిక అందించాలని సూచించారు. పల్లెలు, పట్టణ ప్రాంతాల్లో 15 రోజుల ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించాలని జిల్లా మలేరియా అధికారిని ఆదేశించారు. ఇప్పటివరకు జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులపై నివేదికలు సిద్ధం చేయాలన్నారు. పనుల ప్రగతి, భవిష్యత్తులో చేపట్టాల్సిన వాటిపై శాఖల వారీగా తెలియజేయాలన్నారు. అంతకముందు కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్‌ను ఎస్పీ విక్రాంత్‌పాటిల్ కలిశారు. జిల్లాలో శాంతిభద్రతలు, తదితర అంశాలను వివరించారు.
- కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 170 వినతులు వచ్చాయి. కలెక్టర్‌తో పాటు ఐటీడీఏ పీవో విష్ణుచరణ్, ఇన్‌చార్జి డీఆర్వో కేశవనాయుడు, ఆర్డీవో హేమలత, వివిధ శాఖల అధికారులు.. ప్రజల నుంచి వినతులను స్వీకరించి.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి అర్జీని సత్వరమే పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేసి.. ప్రతి దరఖాస్తుదారునికి న్యాయం చేయాలని సూచించారు.
తాగునీటి సౌకర్యం కల్పించండి
పార్వతీపురం టౌన్: కొండశిఖర గ్రామాల్లో రహదారుల నిర్మాణం చేపట్టాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని గిరిజన మహిళలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ.. కురుపాం మండలంలోని మామిడిమాను గూడ, బుడ్డిడి గూడ, జలుబు గూడ, తాడిగండ, రెల్లిగూడ, కేదార్లంగా, పొక్కిరి, తోలుంగూడ గ్రామాలకు తాగునీరు, రహదారి సౌకర్యం లేదన్నారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వైద్యసేవలు కూడా సకాలంలో అందడం లేదని వాపోయారు. అదేవిధంగా గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లో గిరిజన ప్రజలకు ఉపాధి కల్పించాలని, ఉచితంగా కొండ చీపుర్లు, విత్తనాలను పంపిణి చేయాలని కోరారు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులకు వినతిపత్రం ఇచ్చారు.