Share News

డోలీయే గతి

ABN , Publish Date - Jan 29 , 2024 | 12:23 AM

గిరిశిఖర గ్రామం చిట్టంపాడు వాసుల కన్నీటి గాథ వింటే ఎవరికైనా మనసు తరుక్కుపోతుంది. వారికి పథకాలు అందడం లేదు. యువతకు ఉపాధి లేదు. ఆపదొస్తే వైద్యం గగనమే. అనారోగ్యం బారిన పడే వ్యక్తిని డోలీలో ఏడు కిలోమీటర్లు కాలినడకన తరలించాలి.

డోలీయే గతి
చిట్టంపాడు వెళ్లే రహదారి

డోలీయే గతి

సుస్తీ చేస్తే దేవడిపైనే భారం

రాళ్లు.. పొదల మధ్య ఏడు కిలోమీటర్ల నడక

పసర మందులతో ప్రాణాల మీదకు

చిట్టంపాడు గిరిజనుల అవస్థలు

గ్రామానికి రహదారి లేక నరకయాతన

గిరిశిఖర గ్రామం చిట్టంపాడు వాసుల కన్నీటి గాథ వింటే ఎవరికైనా మనసు తరుక్కుపోతుంది. వారికి పథకాలు అందడం లేదు. యువతకు ఉపాధి లేదు. ఆపదొస్తే వైద్యం గగనమే. అనారోగ్యం బారిన పడే వ్యక్తిని డోలీలో ఏడు కిలోమీటర్లు కాలినడకన తరలించాలి. అత్యవసరమైతే అంతే. నొప్పి కలిగినా.. జ్వరం వచ్చినా ఎక్కువగా పసర మందులపైనే ఆధారపడుతున్నారు. వాటివల్ల ఒక్కోసారి విషమ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కొద్దిరోజుల వ్యవధిలో గ్రామానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుస్థితి అంతటికీ కారణం రహదారి లేకపోవడమే. పక్కా రోడ్డు వేయాలని సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

శృంగవరపుకోట రూరల్‌, జనవరి 28 :

శృంగవరపుకోట మండలం బొడ్డవర పంచాయతీలో ఉన్న గిరిశిఖర గ్రామం చిట్టంపాడు. 62 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కొట్టాం పీహెచ్‌సీ పరిధిలో ఉంది. గ్రామానికి హెల్త్‌ అసిస్టెంట్‌లు తాతారావు, డి.దేవి వెళ్లి వస్తుంటారు. మిగతా సిబ్బంది.. వైద్యులు ఈగ్రామం వైపు కన్నెత్తి చూడరు. గ్రామానికి సరైన రోడ్డులేకపోవడంతో వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. స్థానికులు తమకు తాముగా ఉపాధి పనులతో కొద్దిమేర రోడ్డు బాగుచేసుకున్నారు. ఏడు కిలోమీటర్ల మేర రాళ్లు, రప్పలపై నిత్యం ప్రయాణం సాగిస్తారు. అనారోగ్యంతో ఎవరైనా బాధపడితే డోలీ కట్టుకొని మైదానం ప్రాంతం వచ్చేవరకు తరలించాలి. ఆపై వాహనంలో శృంగవరపుకోట ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్తుంటారు. అమాయకత్వంతో ఈ గిరిశిఖర గ్రామస్థులు సంతరోజుల్లో అక్కడుండే ఆర్‌ఎంపీలు, పీఎంపీలను ఆశ్రయిస్తారు. అయితే కొద్దిరోజుల వ్యవధిలో గ్రామంలో ఐదుగురు మృతిచెందారు. దీంతో వారంతా టెన్షన్‌ పడుతున్నారు. తమ పరిస్థితిని ఎవరూ పట్టించుకోరా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

-- ఇటీవల మరణించిన గంగమ్మ, కుమారుడు జస్వంత్‌ మరణాలపై గంగమ్మ భర్త గంగులు మాట్లాడుతూ ఎలాంటి పరిస్థితుల్లో అయినా కొండ దిగి వెళ్తేనే వైద్యం అందుతోందన్నారు. పెద్ద అధికారులు వచ్చినప్పుడు వైద్య సిబ్బంది హడావిడి చేస్తారని, మిగతా సమయాల్లో తమను కనీసం పట్టించుకోరని వాపోయాడు.

- కొద్దిరోజుల క్రితం 9 నెలల బాలుడు జన్ని ప్రవీణ్‌ మరణంపై తండ్రి సన్యాసిరావు, తల్లి సన్యాసమ్మలు మాట్లాడుతూ ఆసుపత్రుల్లో తమ బిడ్డకు సరైన వైద్యసేవలు అందలేదని, వైద్యులు నిర్లక్ష్యం చూపారని ఆరోపించారు.

-- తమ గ్రామానికి రోడ్డు వుంటే ఈ పరిస్థితి మారుతుందని, ప్రాణాలు గాల్లో దీపాలుగా మారవని స్థానిక గిరిజన యువత అంటున్నారు. రోడ్డులేకపోవడంతో వైద్యులు రావడం లేదని, పంచాయతీని ఐటీడీఏలో చేర్చడం లేదని, దీంతో నిరుద్యోగులుగా ఉండిపోతున్నామంటున్నారు.

Updated Date - Jan 29 , 2024 | 12:23 AM