Share News

అభివృద్ధి పనులకు ఒప్పుకోరా?

ABN , Publish Date - Feb 28 , 2024 | 12:01 AM

పార్వతీపురం మున్సిపల్‌ సమావేశం రసాభాసగా మారింది. అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రతిపక్షాలతో పాటు వైసీపీ కౌన్సిలర్లు కూడా నిప్పులు చెరిగారు. అధికారుల తీరుపై విమర్శలు గుప్పించారు. ప్రధానంగా అధికార పార్టీ కౌన్సిలర్లు స్వపక్షంలో విపక్షంగా మారడం చర్చనీయాంశమైంది.

అభివృద్ధి పనులకు ఒప్పుకోరా?
తోటి ప్రజాప్రతినిధిని గౌరవించాలని చైర్‌పర్సన్‌కు చెబుతున్న 16వ వార్డు వైసీపీ కౌన్సిలర్‌ లక్ష్మీ పార్వతి

ఇద్దరి మధ్య వాగ్వాదం

స్వపక్షంలో విపక్షం...

తాగునీరు, ఇతరత్రా సమస్యలపై ప్రశ్నించిన టీడీపీ కౌన్సిలర్లు

అధికారుల తీరుపై విమర్శలు

రసాభాసగా పార్వతీపురం మున్సిపల్‌ సమావేశం

పార్వతీపురం టౌన్‌, ఫిబ్రవరి 27 : పార్వతీపురం మున్సిపల్‌ సమావేశం రసాభాసగా మారింది. అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రతిపక్షాలతో పాటు వైసీపీ కౌన్సిలర్లు కూడా నిప్పులు చెరిగారు. అధికారుల తీరుపై విమర్శలు గుప్పించారు. ప్రధానంగా అధికార పార్టీ కౌన్సిలర్లు స్వపక్షంలో విపక్షంగా మారడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక మున్సిపల్‌ కార్యాలయ కౌన్సిల్‌ సమావేశ మందిరంలో మంగళవారం చైర్‌పర్సన్‌ బోను గౌరీశ్వరి అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది. ముందుగా అజెండాలోని అంశాలను చదువుతుండగా.. 16వ వార్డు కొత్త బెలగాంలోని సీసీ కాలువల నిర్మాణానికి కేటాయించిన రూ.8.60 లక్షలను నిలుపుదల చేయాలని చైర్‌పర్సన్‌ కమిషనర్‌ పి.సింహాచలంను ఆదేశించారు. దీనిపై 16వ వార్డు కౌన్సిలర్‌ లక్ష్మీపార్వతి అభ్యంతరం తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అన్ని వార్డుల అభివృద్ధికి నిధులు కేటాయిస్తే.. చైర్‌పర్సన్‌గా ఎందుకు ఒప్పుకోరు? అంటూ ఆమె ప్రశ్నించారు. పట్టణంలో 30 వార్డులు ఉండగా 16వ వార్డుకే సాధారణ, ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం ఎంత వరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘ చైర్‌పర్సన్‌గా మీ మాటలు సరిగ్గా లేవు’ అని ఆమె అనడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో మిగతా అధికార పార్టీ కౌన్సిలర్లు స్పందించి.. వారిద్దరిని శాంతింపజేశారు. అధికార పార్టీకి చెందిన చైర్‌పర్సన్‌ తన వార్డు అభివృద్ధిని అడ్డుకోవడంతో పాటు సభా మర్యాద పాటించకపోవడం విచారకరమని 16వ వార్డు వైసీపీ కౌన్సిలర్‌ లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు.

బిందెడు నీటి కోసం కష్టాలు పడమంటారా..?

వేసవి సీజన్‌లో జిల్లా కేంద్రవాసులు బిందెడు నీటి కోసం కష్టాలు పడమంటారా? అని మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌, 14వ వార్డు కౌన్సిలర్‌ డి.శ్రీదేవి చైర్‌పర్సన్‌తో పాటు కమిషనర్‌, అధికారులను ప్రశ్నించారు. నాలుగైదు రోజులకు తాగునీటి సరఫరా చేయడం సరికాదన్నారు. రెండ్రోజులకొకసారైనా కొళాయిల ద్వారా నీటిని అందించాలన్నారు. కాలువల్లో పూడికలు తీయాలని, దోమల నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. పట్టణంలో వరహాల గెడ్డపై ఉన్న వంతెన కూలేందుకు సిద్ధంగా ఉందని, దీనిని అజెండాలోని మొదటి అంశంగా పొందుపరిచి ఇప్పుడు వాయిదా వేయాలనడం సరికాదన్నారు. దీంతో చైర్‌పర్సన్‌, శ్రీదేవిల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు అధికారులు కల్పించుకుని ఇరువురిని శాంతింపజేశారు.

అధికారుల తీరుపై ధ్వజం

పార్వతీపురం మున్సిపాల్టీ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి సంబంధించి మున్సిపల్‌ అధికారుల తీరుపై అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. తాము చెప్పింది కాకుండా మున్సిపల్‌ అధికారులు తమకు ఇష్టం వచ్చినట్లు ప్రతి నెలా అంజెండాలోని అంశాలకు పొందుపరచడం సరికాదన్నారు. వరహాల గెడ్డపై కల్వర్టు నిర్మాణానికి సంబంధించి ఎవరిని అడిగి రూ. 17 లక్షలు కేటాయించారని కమిషనర్‌, ఇంజనీరింగ్‌ అధికారులను చైర్‌పర్సన్‌ ప్రశ్నించారు. ఇదిలా ఉండగా టేబుల్‌ అజెండా చదవక ముందే చైర్‌పర్సన్‌ వెళ్లిపోవడంపై మున్సిపల్‌ అధికారులు అసహనం వ్యక్తం చేశారు.

Updated Date - Feb 28 , 2024 | 12:01 AM