Share News

విధి నిర్వహణలో అలసత్వం వద్దు

ABN , Publish Date - Jul 28 , 2024 | 11:07 PM

విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం మండల విద్యాశాఖాధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.

  విధి నిర్వహణలో అలసత్వం వద్దు
జోగింపేట కళాశాలలో మధ్యాహ్న భోజనం సమయంలో విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌

విద్యాశాఖాధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ

గరుగుబిల్లి, జూలై 28 : విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం మండల విద్యాశాఖాధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. మండలాల పరిధిలోని ఎంఈవోలు విధిగా విద్యార్థుల పరివర్తనతో పాటు హాజరు, నమోదుపై దృష్టి సారించాలన్నారు. ఉద్యోగులు సమయపాలన పాటించకపోయినా, అనధికారికంగా గైర్హాజరైనా చర్యలు తప్పవన్నారు. పాఠశాలల్లో నమోదు తక్కువగా ఉందని ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్‌ ను నిర్వహించాలన్నారు. విద్యార్థులంతా యూనిఫాంలు ధరించేలా చూడాలని, వచ్చేనెల 31 నాటికి అందరికీ స్టూడెంట్‌ కిట్లు అందించాలని ఆదేశించారు. వెలుగు ఏపీఎంల దృష్టికి తీసుకువెళ్లి తక్కువ ధరకే కుట్టు పనులు చేపట్టేలా చూడాలన్నారు. పారిశుధ్యం, మధ్యాహ్న భోజనం, పాఠ్యాంశాలు, తదితర కార్యకపాలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. తనిఖీ సమయంలో లోపాలు ఉన్నట్లయితే జిల్లా విద్యాశాఖాధికారికి తెలియపర్చాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాల్సి ఉందని తెలిపారు. విధిగా ఆరోగ్య రిజిస్టర్లు నిర్వహించాలన్నారు. పాఠశాలలకు నాణ్యమైన బియ్యం సరఫరా అయ్యేలా చూడాలని సూచించారు. పాఠశాలల ఆవరణలో బడి తోటలను ఏర్పాటు చేయాలని, క్రీడలు నిర్వహణ, వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించాలని ఆదేశించారు. కేజీబీవీ పాఠశాలల్లో హెచ్‌ఎంలు.. సాయంత్రం వేళల్లో ప్రత్యేకాధికారుల హాజరుపై విద్యాశాఖ జారీ చేసిన సూచనలను విధిగా పాటించాలని తెలిపారు. పాఠశాలలను పూర్తిస్థాయిలో పర్యవేక్షించి నివేదికలను అందించాలన్నారు.

జోగింపేట ప్రతిభా కళాశాల సందర్శన

సీతానగరం : సీతానగరం మండలం జోగింపేట ప్రతిభా కళాశాల (కాలేజీ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ)ను కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో వంట గది, సరుకుల నిల్వ, డార్మెటరీలు, పరిసరాలు, డ్రైనింగ్‌ హాల్‌, ఇతర రిజిస్టర్లను పరిశీలించారు. విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడి.. సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత, విద్యా బోధనపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థుల్లో కలిసి వాలీబాల్‌ ఆడారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు.

Updated Date - Jul 28 , 2024 | 11:07 PM