Share News

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మెరిసిన జిల్లా విద్యార్థులు

ABN , Publish Date - Jun 09 , 2024 | 11:56 PM

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మెరిసారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మెరిసిన జిల్లా విద్యార్థులు

కలెక్టరేట్‌: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మెరిసారు. జాతీయ స్థాయిలో పలువురు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి చక్కని ప్రతిభ చూపారు. గత నెల 26న పట్టణంలోని గాజులురేగ పరిధిలో ఉన్న సీతం ఇంజినీరింగ్‌ కాలేజీ, డెంకాడలో ఉన్న ఎంవీజీఆర్‌ కాలేజీల్లో ఈ పరీక్షలు జరిగాయి. రెండు సెషన్‌లు కలిసి సుమారు జిల్లా వ్యాప్తంగా వెయ్యి మందికి పైబడి విద్యార్థులు పరీక్షలు రాశారు. ఆదివారం విడుదలైన ఫలితాల్లో మెంటాడ మండలం పోరాం గ్రామానికి చెందిన మజ్జి రిషివర్ధన్‌కు జాతీయ స్థాయిలో 59 ర్యాంకు రాగా, ఓబీసీ కోటలో 4 ర్యాంకు వచ్చింది. గజపతినగరం మండలం పురిటపెంటకు చెందిన బి.భరత్‌కుమార్‌కు జాతీయ స్థాయిలో 516 ర్యాంకు రాగా, ఓబీసీ కోటలో 74 ర్యాంకు వచ్చింది. విజయనగరంలో ఆర్‌ఆండ్‌బీ అథితి గృహం సమీపంలో ఉంటున్న అల్లు హేమంత్‌కు జాతీయ స్థాయిలో 521 ర్యాంకు, ఓబీసీలో 75 ర్యాంకు వచ్చింది. పార్వతీపురంలో పరిధిలోగల మెట్టవలసకు చెందిన ఆర్‌.రేవంత్‌ సాయికి జాతీయ స్థాయిలో 535 ర్యాంకు, ఓబీసీలో కేటగిరిలో 77 ర్యాంకు వచ్చింది. అలాగే పార్వతీపురం పరిధిలోగల ఎం.భానుప్రకాష్‌కు జాతీయ స్థాయిలో 703 ర్యాంకు, ఓబీసీలో 96 ర్యాంకు వచ్చింది. విజయనగరం కలెక్టరేట్‌ సమీపంలో ఉంటున్న కోరాడ జయవర్ధన్‌కు జాతీయ స్థాయిలో 789 ర్యాంకు, ఓబీసీ కేటగిరిలో 127 ర్యాంకు వచ్చింది. అలాగే జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కూడా చక్కని ర్యాంకులు సాధించారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆయా కళాశాల యాజమాన్యంతో పాటు తల్లిదండ్రులు అభినందించారు.

చీపురుపల్లి: చీపురుపల్లికి చెందిన రాగాల అఖిల్‌ జేఈఈ అడ్వాన్సడ్‌ పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. మద్రాసు ఐఐటీ ఆదివారం విడుదల చేసిన ఫలితాల్లో అఖిల భారతీయ ఓపెన్‌ కేటగిరీలో 1343 ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో 211వ ర్యాంకు సాధించాడు. అఖిల్‌ తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కాగా, తల్లి గృహిణి. ఇటీవల విడుదల అయిన మెయిన్స్‌లో కూడా అఖిల్‌ ఉత్తమ ప్రతిభ కనబరిచాడు.

బాడంగి: వైద్య కళాశాలలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్‌-2024 ప్రవేశ పరీక్షలో వాడాడ గ్రామానికి చెందిన కొల్లి భానుశంకర్‌ 720 మార్కులకుగానూ 675 మార్కులు సాధించాడు. జాతీయ స్థాయిలో ఓపెన్‌ కేటగిరీలో 11229 ర్యాంకు ఓబీసీలో 4664 ర్యాంకు సాధించాడు.

బొబ్బిలి: బొబ్బిలి పట్టణానికి చెందిన విద్యార్ధులు జేఈఈ (అడ్వాన్స్‌డ్‌) ర్యాంకులు సాధించారు. సీహెచ్‌ఎస్‌ రోహిత్‌ 219 మార్కులతో 1504 జనరల్‌ ర్యాంకును, 243 ఓబీసీ ర్యాంకును సాధించాడు. గంట గురుదత్త అభినవ్‌ ఓబీసీ కేటగిరీలో 1094, సీఆర్‌ఎల్‌ ర్యాంకు 5564 ర్యాంకు సాధించాడు.

రాజాం: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో రాజాంకు చెందిన సతివాడ కార్తీక్‌ ఆల్‌ ఇండియాలో 1056 ర్యాంకు, ఓబీసీ కేటగిరిలో 161వ ర్యాంకు సాధించాడు. అలాగే మొయ్యి హర్షవర్దన్‌ ఆల్‌ ఇండియాలో 780వ ర్యాంకు, ఓబీసీ కేటగిరిలో 115 ర్యాంకు సాధించాడు.

Updated Date - Jun 09 , 2024 | 11:56 PM