Share News

కోడ్‌ పట్టదా?

ABN , Publish Date - Mar 26 , 2024 | 12:10 AM

ఎన్నికల కోడ్‌ కూసి పది రోజులు గడుస్తున్నా.. జిల్లాలో మాత్రం పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అధికార పార్టీ రంగులు కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడే వైసీపీ జెండాలు, సీఎం ఫొటోలు దర్శనమిస్తున్నాయి.

కోడ్‌ పట్టదా?
సాలూరు : వైసీపీ పోలిన రంగులతో ఉన్న టిడ్కో గృహ సముదాయం

ఇంకా తొలగించని సీఎం ఫొటోలు, స్టిక్కర్లు

అధికారుల నిర్లక్ష్యంపై విమర్శల వెల్లువ

పార్వతీపురం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి)/ కొమరాడ/ గరుగుబిల్లి/ జియ్యమ్మవలస/ సీతంపేట/భామిని/వీరఘట్టం/సాలూరు/సాలూరు రూరల్‌, మార్చి 25:

ఎన్నికల కోడ్‌ కూసి పది రోజులు గడుస్తున్నా.. జిల్లాలో మాత్రం పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అధికార పార్టీ రంగులు కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడే వైసీపీ జెండాలు, సీఎం ఫొటోలు దర్శనమిస్తున్నాయి. జిల్లాలో అనేక చోట్ల సచివాలయాలు, ఆర్‌బీకేలు, రక్షిత నీటి పథకాలు, పీహెచ్‌సీలు, టిడ్కో ఇళ్లు.. ఇలా అనేక వాటికి వైసీపీ రంగులున్నాయి. వ్యవసాయ విద్యుత్‌ మోటార్లపైనే కాదు అంగన్‌వాడీల్లో గుడ్లు, పాలు, చక్కీల ప్యాకెట్లపై, పాఠశాలల్లో జగనన్న విద్యా కానుక కిట్లు పేరుతో ఇచ్చిన వస్తువులపైనా సీఎం జగన్‌ చిత్రం, వైసీపీ రంగులు, గుర్తులు, పథకాల పేర్లు కని పిస్తున్నాయి. కోడ్‌ను పక్కాగా అమలు చేయాలని, రాజకీయ పార్టీలకు సంబంధించి ఫ్లెక్సీలు, ఫొటోలు, బ్యానుర్లు, కటౌట్లు, విగ్రహాలు కనిపించరాదని ఉన్నతాధికారులు పదే పదే చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం అది అమలు కావడం లేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోడ్‌ అమలు ఇలాగేనా? అధికార పార్టీకి అది వర్తించదా? అంటూ ప్రజా సంఘాల నేతలు సైతం ప్రశ్నిస్తున్నారు.

వాస్తవంగా వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు అందించే ప్రతి వస్తువును తన ప్రచార మాధ్యమంగా మార్చేసింది. అధికారులు తొలగించలేని విధంగా పథకాల పేర్లును పలు రకాల వస్తువులపై ముద్రించింది. గత ప్రభుత్వాల హయాంలో ఇటువంటి పరిస్థితి లేదు. సీఎం జగన్‌లా ఎవరూ వ్యవహరించలేదు. చివరకు రైతుల పాస్‌పుస్తకాల పైన కూడా ముఖ్యమంత్రి ఫొటోలు ముద్రించారు. కాగా ఇవన్నీ తమకు భవిష్యత్‌లో ఎన్నికల ప్రచారానికి ఉపయోగపడతాయన్నఉద్దేశంతోనే వైసీపీ ఇలా చేసిందనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అయితే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చి రోజులు గడస్తున్నా.. క్షేత్రస్థాయిలో అధికారులు వాటిని పట్టించుకోకపోవడంపై అన్ని వర్గాల వారు మండిపడుతున్నారు. ఎన్నికల సంఘం నిబంధనలు మేరకు ఆ ఫొటోలు కప్పడం లేదా, తొలగించడం చేయాల్సిన బాధ్యత ప్రస్తుత అధికార యంత్రాంగంపై ఉంది అయితే ఎన్ని చేసినా ఎక్కడో ఒక చోట జగన్‌ ఫోటోలు దర్శనం ఇస్తూనే ఉన్నాయి. వైకాపా జెండా రంగులు కనిపిస్తూనే ఉన్నాయి. ఏమి చేయాలో తెలియని పరిసితి కొంతమంది అధికారుల్లో ఏర్పడింది. ఇప్పటకైనా ఎన్నికల సంఘం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.

వివిధ చోట్ల ఇలా..

- సాలూరు సమీపంలో చంద్రంపేట వద్ద పేదల కోసం నిర్మించిన టిడ్కో గృహ సముదాయానికి వైసీపీ పోలిన రంగులు వేశారు. అయితే కోడ్‌ నేపథ్యంలో వాటిని తొలగించాల్సి ఉండగా.. ఇంకా ఆ రంగులను అలానే ఉంచారు.

- కొమరాడ మండలంలో అంగన్‌వాడీ పిల్లలకు అందించే పౌష్టికాహార చక్కీ ప్యాకెట్లపై సీఎం జగన్‌ చిత్రంతో పాటు రాతలు ఉన్నాయి. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అం దించే గుడ్లుపై కూడా వైఎస్‌ఆర్‌ పోషణ పేరుతో స్టాంప్‌ వేసి ఉండడం గమనార్హం. పాఠ శాలల విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్ల పేరుతో ఇచ్చిన సామగ్రిపై పథకాల పేర్లు, ముఖ్యమంత్రి చిత్రాలే కనిపిస్తున్నాయి.

-సీతంపేటలో వారపు సంత వద్ద, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి వెనుక భాగంలో ఏర్పాటు చేసిన రక్షిత నీటి పథకాలకు వేసిన వైసీపీ పోలిన రంగులను తొలగించలేదు.

- సాలూరు మండలం తోణాం పీహెచ్‌సీలో నిర్మాణంలో ఉన్న భవనానికి వైసీపీకి పోలి ఉన్న రంగులు వేశారు. ఇప్పటికీ మార్చకపోవడంపై సాలూరు ఎంపీడీవో ఫణింద్ర వివరణ కోరగా.. ఈ భవనం ఆర్‌అండ్‌బీ నిర్మిస్తుందన్నారు. ఈ భవనం ఇంకా అప్పగించక పోయినా అధికార పార్టీ పోలిన రంగులు ఉండకూడదన్నారు. రంగులు మార్చడానికి చర్యలు తీసుకుంటానన్నారు. అయితే సోమవారం సాయంత్రానికే ఆ భవనంపై ఉన్న రంగులకు వైట్‌ సున్నం వేయడం గమనార్హం.

- గరుగుబిల్లిలో రహదారికి ఆనుకుని ఉన్న రైతుభరోసా కేంద్రానికి నేటికీ వైసీపీ రంగులే ఉన్నాయి. మండలంలోని పలు సచివాలయాల పరిధిలోని రైతుభరోసా కేంద్రాలకు రంగులు మార్చలేదు. కొన్నిచోట్ల ఆర్‌బీకేలకు శాశ్వత భవనాలు లేకపోవడంతో అద్దె భవనాల్లో కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వాటికి కూడా రంగులు మార్చలేదు.

- జియ్యమ్మవలస మండలం తాళ్లడుమ్మ పంచాయతీ సచివాలయంలో రైతుభరోసా కేంద్రానికి వైసీపీ రంగులు ఉన్నాయి. దాని పక్కనే సబ్‌ సెంటర్‌ ముందు ఉన్న బోర్డుపై వైఎస్‌ఆర్‌, జగన్‌ బొమ్మలను కాగితాలతో కప్పిన సిబ్బంది డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ అనే పేరు మాత్రం అలాగే ఉంచారు. బొమ్మి పంచాయతీలో ఉన్న రైతుభరోసా కేంద్రానికి కూడా ఇంకా వైసీపీ రంగులే ఉన్నాయి.

- భామిని మండలం కోసిమానుగూడ కాలనీలో రక్షిత నీటి పథకానికి కూడా వైసీపీ రంగులే ఉన్నాయి.

- వీరఘట్టం మండలం చిట్టిపుడివలసలో రోడ్డు పక్కన ఉన్న పంట పొలల్లో పాతిన సర్వే రాళ్లలో సీఎం జగన్‌ పేరు కనిపిస్తున్నా.. అధికారులు చూసీచూడనట్టు వ్యవహరి స్తున్నారు.

Updated Date - Mar 26 , 2024 | 12:10 AM