Share News

ఎన్నికల బాండ్ల వివరాలు బహిర్గతం చేయాలి

ABN , Publish Date - Mar 12 , 2024 | 12:26 AM

ఎన్నికల బాండ్ల వ్యవహారం రాజ్యాంగ విరుద్ధమని, వాటి వివరాలను బహిర్గతం చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం స్టేట్‌బ్యాంకు మెయిన్‌ బ్రాంచి ముందు సీపీఎం నాయకులు ధర్నా నిర్వహించారు.

ఎన్నికల బాండ్ల వివరాలు బహిర్గతం చేయాలి

బొబ్బిలి: ఎన్నికల బాండ్ల వ్యవహారం రాజ్యాంగ విరుద్ధమని, వాటి వివరాలను బహిర్గతం చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం స్టేట్‌బ్యాంకు మెయిన్‌ బ్రాంచి ముందు సీపీఎం నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పి.శంకరరావు మాట్లాడుతూ ఈ నెల 13 నాటికి ఎన్నికల సంఘం ఎలక్ర్టోరల్‌ బాండ్ల వివరాలను బహిర్గతం చేయాలని కోర్టు ఆదేశించినా ఇంతవరకూ వాటిని ప్రకటించకుండా తాత్సారం చేస్తున్నారన్నారు. గోపాల్‌, సురేష్‌, మణికుమార్‌, అప్పారావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

విజయనగరం: దేశంలో పెట్టుబడిదారుల నుంచి వేల కోట్లు బాండ్ల రూపంలో బీజేపీ తీసుకుని.. వచ్చే ఎన్నికల్లో ప్రజలకు పంపిణీ చేసే కుట్ర చేస్తోందని.. తక్షణమే స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శంకరరావు డిమాండ్‌ చేశారు. ఈమేరకు సోమవారం కోట జంక్షన్‌ సమీపంలోని ఎస్‌బీఐ ఎదుట ధర్నా చేపట్టారు. సీపీఎం నేతలు రమణ, యూఎస్‌ రవికుమార్‌, త్రినాథ్‌, హరీష్‌ తదితరులు పాల్గొన్నారు.

రాజాం రూరల్‌: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల బాండ్ల వివరాలను తాత్సారం చేయకుండా స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తక్షణమే ప్రకటించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామ్మూర్తి నాయుడు, సీపీఎం జిల్లా కార్యదర్శి శంకరరావు డిమాండ్‌ చేశారు. డోలపేటలోని ఎస్‌బీఐ మెయిన్‌బ్రాంచ్‌ ఎదుట సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రామ్మూర్తినాయుడు, శంకరరావు మాట్లాడుతూ ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటించిన సుప్రీంకోర్టు ఆ బాండ్ల వివరాలను ఎన్నికల సంఘానికి నివేదించాలని ఆదేశించింది. గడువు ముగుస్తున్నా ఎన్నికల బాండ్లు వివరాలను ఎస్‌బీఐ ప్రకటించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.

గజపతినగరం: ఎన్నికల బాండ్ల వివరాలను తక్షణమే వెల్లడించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు వి.లక్ష్మి, జిల్లా కమిటీ సభ్యుడు జి.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కార్యాలయం ఎదుట రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా నిరసన చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా పరిపాలనకు కంకణం కట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పైడిపి నాయుడు, హరి కృష్ణవేణి, కోటి, కృష్ణ శంకరరావు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 12:26 AM