Share News

కోడ్‌ ధిక్కరణ

ABN , Publish Date - Mar 26 , 2024 | 12:05 AM

అధికార పార్టీ నాయకుల పట్ల ఇంకా ప్రభుత్వ అధికారుల్లో మోజు తగ్గలేదు. ఎన్నికల కోడ్‌ వచ్చి పది రోజులు కావస్తున్నా చాలా చోట్ల ఉల్లంఘనలు కన్పిస్తూనే ఉన్నాయి. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ స్పష్టమైన అదేశాలు ఇస్తున్నా క్షేత్ర స్థాయి సిబ్బంది నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. కొన్నిచోట్ల తెలిసి కూడా వదిలేస్తున్నారు. గ్రామాల్లో ఇప్పటికీ నేతల ఫొటోలు కనిపిస్తున్నాయి. కొందరు మాత్రం మొక్కుబడిగా చిన్న కాగితం అంటించి మమ అనిపిస్తున్నారు.

కోడ్‌ ధిక్కరణ
విజయనగరంలో తిరుగుతున్న కారుపై మా నమ్మకం నువ్వే జగన్‌ పోస్టర్‌

కోడ్‌ ధిక్కరణ

ఎన్నికల నిబంధనలను అమలు చేయని యంత్రాంగం

అధికారపార్టీవైతే చూసీచూడనట్టు వదిలేస్తున్న వైనం

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

అధికార పార్టీ నాయకుల పట్ల ఇంకా ప్రభుత్వ అధికారుల్లో మోజు తగ్గలేదు. ఎన్నికల కోడ్‌ వచ్చి పది రోజులు కావస్తున్నా చాలా చోట్ల ఉల్లంఘనలు కన్పిస్తూనే ఉన్నాయి. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ స్పష్టమైన అదేశాలు ఇస్తున్నా క్షేత్ర స్థాయి సిబ్బంది నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. కొన్నిచోట్ల తెలిసి కూడా వదిలేస్తున్నారు. గ్రామాల్లో ఇప్పటికీ నేతల ఫొటోలు కనిపిస్తున్నాయి. కొందరు మాత్రం మొక్కుబడిగా చిన్న కాగితం అంటించి మమ అనిపిస్తున్నారు.

ఖర్చు దాతలది.. సారధ్యం పేరు ఎమ్మెలేది

విజయనగరం పట్టణంలో దాతల ఔధార్యంతో పేదలకు భోజనం పెడుతున్నారు. అయితే దీనికి బోర్డు పెట్టి అందులో ఎమ్మెల్యే సారధ్యంలో పేద ప్రజలకు ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది చూసిన వారు సారధ్యం ఎమ్మెల్యేది.. ఖర్చు దాతలది అంటూ ఎద్దేవా చేయడం కనిపించింది. కాగా ఎన్నికల కోడ్‌ ఉన్న కారణంగా సంబంధిత బోర్డులను తొలగించాల్సి ఉండగా ఎన్నికల సిబ్బంది చూసీచూ డనట్లు వ్యవహరించారు. టీడీపీ చేపట్టిన అన్న క్యాంటీన్లను మాత్రం ఆఘమేఘాల మీద ఎన్నికల సిబ్బంది ఆపించారు. బొబ్బిలి, ఎస్‌.కోట నియోజకవర్గ కేంద్రాల్లో టీడీపీ నాయకులు నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లను మూసివేశారు.

వాహనాలపై తొలగించరెందుకో?

విజయనగరం పట్టణంలో తిరుగుతున్న కొన్ని కార్లపై అధికార పార్టీకి చెందిన ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ పోస్టర్లు ఇంకా దర్శన మిస్తున్నాయి. ప్రైవేట్‌ వాహనాలపై పోస్టర్లు పెట్టుకునేందుకు కూడా అనుమతి తప్పనిసరి. వారు పోస్టర్లను ఉంచాలంటే అనుమతి పత్రం కూడా కార్లపై అతికించాల్సి ఉంది. కానీ ఎక్కడా అమలు జరగడం లేదు.

ఆ రంగుల మాటేమిటి?

బొబ్బిలి మున్సిపాలిటీలో క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమం కింద తడిచెత్త, పొడిచెత్త సేకరణ కోసం ఇటీవల 12 వాహనాలను ప్రభుత్వం పంపించింది. వాటన్నింటికీ వైసీపీ రంగులున్నాయి. ఒకటి రెండు తప్ప మిగిలిన వాహనాలన్నీ డ్రైవర్లు లేక షెడ్లకే పరిమితమయ్యాయి. వాటిపై రంగులను మాత్రం ఇప్పటివరకూ తొలగించలేదు.

- బొబ్బిలి

తెరపైకి శ్రీదేవమ్మ గోరుముద్ద

బొబ్బిలి : ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడంతో నిబంధనలను ఎవరికి తోచిన రీతిలో వారు అమలు చేసుకుంటున్నారనడానికి ఇదో ఉదాహరణ. బొబ్బిలి మండలం నారాయణప్సవలస యూపీ పాఠశాలలో గోడపై జగనన్న గోరుముద్ద బోర్డుపై జగనన్న పేరును తొలగించారు. అయితే ఉట్టి గోరుముద్ద అని ఉంచితే ఏం బాగుటుందని అనుకున్నారేమో శ్రీదేవమ్మ అని రాసి పెట్టారు. ఆమె ఎవరని అనుకుంటున్నారా? ఆ పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకురాలి పేరు శ్రీదేవి. ఆమె పేరుతో ఇలా బోర్డును మార్చడాన్ని అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

మంజూరై నెలలు.. తాజాగా పనులు

విజయనగరం నియోజకవర్గంలో ఎన్నికల సిత్రాల్లో ఇదొకటి. నగరంలోని 33వ వార్డులో ఐనాక్స్‌ వెనుక రెండు ప్రముఖ ఆసుపత్రులు, కాలనీలు ఉండగా అక్కడకు చేరుకునే రోడ్డు మాత్రం అధ్వానంగా తయారైంది. ఎన్నిసార్లు మొర వినిపించినా నాలుగేళ్లుగా పట్టించుకోని నేతలు 15వ ఆర్థిక సంఘం నిధులు నుంచి రోడ్డు నిర్మాణం కోసం రూ.12 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించి నాలుగురోజల కిందటే చకాచకా రోడ్డు వేశారు. పనులు మంజూరైనప్పుడు కాకుండా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక చేయడమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కమిషనర్‌ వద్ద ప్రస్తావించగా ఎన్నికల కోడ్‌కు ముందే మంజూరైన పనులుగా చెప్పుకొచ్చారు.

- విజయనగరం(ఆంధ్రజ్యోతి)

Updated Date - Mar 26 , 2024 | 12:05 AM