Share News

ఎన్నికల్లో వైసీపీని ఓడించండి

ABN , Publish Date - Feb 28 , 2024 | 11:52 PM

రాష్ట్రంలో మరోసారి జగన్‌ అధికారంలోకి వస్తే పల్లెలు నాశనమై, గ్రామీణ ప్రజలు తీవ్ర కష్టాలు పడతారని రాష్ట్ర పంచాయతీరాజ్‌ చాంబర్‌ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్‌ అన్నారు.

   ఎన్నికల్లో వైసీపీని ఓడించండి
ధర్నా చేస్తున్న రాష్ట్ర పంచాయతీ రాజ్‌, సర్పంచ్‌ల సంఘం నాయకులు

-జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే నాశనమే

- కలెక్టరేట్‌ వద్ద సర్పంచ్‌ల నిరసన

కలెక్టరేట్‌, ఫిబ్రవరి 28: రాష్ట్రంలో మరోసారి జగన్‌ అధికారంలోకి వస్తే పల్లెలు నాశనమై, గ్రామీణ ప్రజలు తీవ్ర కష్టాలు పడతారని రాష్ట్ర పంచాయతీరాజ్‌ చాంబర్‌ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్‌ అన్నారు. పంచాయతీ చాంబర్‌ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌ వద్ద సర్పంచులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపుని చ్చారు. దీనికోసం రాష్ట్రంలోని అన్ని పార్టీలు కలిసి రావాలన్నారు. సీఎం జగన్‌ తమ నిధులు, అధికారాలు, విధులను దొంగించారని ఆరోపించారు. నిధులు, విధుల కోసం గత మూడేళ్లుగా అనేక ఉద్యమాలు, ఆందోళనలు చేసినా సీఎం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో 12,918 గ్రామాల్లోని 3.50 కోట్ల మంది ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారని విమర్శించారు. సర్పంచ్‌ల సంఘం నాయకుడు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు వ్యతిరేకంగా ఓటు వేయించాలన్నారు. ‘జగన్‌ ఓడితేనే -మన మనుగుడ’ అనే నినాదంతో అన్ని పార్టీలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పని చేయాలన్నారు. అనంతరం డీఆర్వో అనితకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి, కార్యదర్శి గేదుల రాజారావు, జిల్లా సర్పంచులు సోము నాయుడు, ఉమ్మడి చిత్తూరు జిల్లాపంచాయతీ రాజ్‌ చాంబర్‌ అధ్యక్షుడు చుక్క ధనుజంయ్‌ యాదవ్‌, పంచాయతీ రాజ్‌ చాంబర్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద రాజు, చింతకాయలు ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 28 , 2024 | 11:53 PM