Share News

ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి

ABN , Publish Date - Feb 20 , 2024 | 11:37 PM

మండలంలోని సరాయివలస ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్ధిని పుంగారి అనిత (14) విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది.

 ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి

పాచిపెంట, ఫిబ్రవరి 20 : మండలంలోని సరాయివలస ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్ధిని పుంగారి అనిత (14) విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. గిరిశిఖర గ్రామం కొండమోసూరుకు చెందిన బాలిక సరాయివలస ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. ఈ నెల 14న రజస్వల కావడంతో తల్లిదండ్రులు బాలికను స్వగ్రామానికి తీసుకువెళ్లారు. ఈ నెల 17న పాఠశాల ఏఎన్‌ఎం విద్యార్థిని సమాచారం కోసం ఫోన్‌ చేయగా అధిక రక్తస్ర్తావం , ఆయాసంతో బాధపడుతుందని తల్లిదండ్రులు చెప్పారు. వెంటనే ఏఎన్‌ఎం ఆటోలో కొండమోసూరుకు చేరుకుని అనితను పరిశీలించి.. గురువునాయుడుపేట పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అయితే మెరుగైన వైద్యం కోసం సాలూరు ఏరియా ఆసుపత్రికి వెళ్లారు. పరిస్థితి మెరుగవకపోవడంతో వెంటనే విజయనగరం ఘోషాసుపత్రికి తరలించగా అక్కడి నుంచి విశాఖపట్నం కేజీహెచ్‌కు రిఫర్‌ చేశారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. కొండమోసూరుకు చెందిన పుంగారి జోగమ్మ, ఆదయ్యలకు నలుగురు ఆడపిల్లలు. వారిలో అనిత ఆఖరి అమ్మాయి కావడంతో తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అయితే బాలిక మృతితో వారు భోరున విలపిస్తున్నారు. తోటి విద్యార్థులు కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. విద్యార్థిని స్వగ్రామంలో కూడా విషాదం అలముకుంది.

Updated Date - Feb 20 , 2024 | 11:37 PM