Share News

ప్రమాద ప్రయాణం

ABN , Publish Date - Mar 01 , 2024 | 11:47 PM

గిరిశిఖర ఏవోబీలో కొఠియా గ్రూప్‌ గిరిజనులకు ఈ ప్రమాదకర ప్రయాణం తప్పడం లేదు. వారి గ్రామాలకు రవాణా సదుపాయం లేకపోవడంతో ఇలా తప్పనిసరి పరిస్థితుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. ఇదే సమయంలో ఒక్కోసారి ప్రమాదాలకు గురువుతున్నారు. ఈ ఘటనలో ఎంతోమంది మృత్యువాతపడుతుండగా... మరెంతోమంది క్షతగాత్రులుగా మారుతున్నారు.

 ప్రమాద ప్రయాణం
జీపు టాప్‌పై ఇలా వెళ్తున్న కొఠియా గిరిజనులు ( ఫైల్‌ )

తరచూ దుర్ఘటనలు

వాహనాల బోల్తా.. పలువురి మృత్యువాత

క్షతగాత్రులుగా మరికొంతమంది..

దృష్టిసారించని ప్రభుత్వం, ఉన్నతాధికారులు

మండిపడుతున్న గిరజన సంఘాలు

సాలూరు రూరల్‌, మార్చి1 : గిరిశిఖర ఏవోబీలో కొఠియా గ్రూప్‌ గిరిజనులకు ఈ ప్రమాదకర ప్రయాణం తప్పడం లేదు. వారి గ్రామాలకు రవాణా సదుపాయం లేకపోవడంతో ఇలా తప్పనిసరి పరిస్థితుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. ఇదే సమయంలో ఒక్కోసారి ప్రమాదాలకు గురువుతున్నారు. ఈ ఘటనలో ఎంతోమంది మృత్యువాతపడుతుండగా... మరెంతోమంది క్షతగాత్రులుగా మారుతున్నారు. గతంలో పట్టుచెన్నారు వెళ్తున్న జీపు బోల్తా పడగా.. ఒకరు మృతి చెందారు. తాజాగా గతనెల 27న కొదమ నుంచి ఘాట్‌రోడ్డులో ప్రయాణిస్తున్న జీపు కొడంగివలస వద్ద బోల్తా పడగా.. 25 మంది గాయపడిన విషయం విదితమే. తరచూ ఇటువంటి ఘటనలు సంభవిస్తున్నా ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై గిరిజన సంఘాల నేతలు మండిపడుతున్నారు. సాలూరు నియోజకవర్గం విషయానికొస్తే.. మక్కువ మండలం నంద గ్రామంలో ప్రతి శనివారం సంత జరుగుతుంది. ఈ సంతకు పట్టుచెన్నారు, పగులు చెన్నారు, డోలియాంబ, ముడకారు, సొలిపిగుడ, ఎగువ మెండంగి తదితర కొఠియా గ్రూప్‌ గ్రామాల నుంచి గిరిజనులు తరలివస్తారు. తమ సరుకులను విక్రయించి, వారికి కావాల్సిన నిత్యావసర సరుకులను కొనుగోలు చేసుకుని తిరుగు ప్రయాణమవుతారు. అయితే కొఠియా గ్రూప్‌ గ్రామాల్లో ఒడిశా ప్రభుత్వం తారురోడ్లు వేసినప్పటికీ .. మరేతర ప్రయాణ సౌకర్యాల్లేవు. దీంతో ఆయా గ్రామస్థులు సంత రోజున కిరాయికి జీపు డ్రైవర్లతో మాట్లాడుకొని ఇలా వస్తుంటారు. వివిధ గ్రామాల్లో 17 వరకు జీపులున్నాయి. సాలూరు మండలంలో ప్రతి శని , మంగళవారాల్లో జరిగే తోణాం, నేరేళ్లవలస సంతలకు కూడా ఇదే విధంగా గిరిజనులు ప్రయాణిస్తుంటారు. శుభకార్యాలు, ఇతరత్రా కార్యక్రమాలకు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో బాడుగకు మాట్లాడుకున్న జీపులోనే రాకపోకలు సాగిస్తుంటారు. ఆయా వాహనాలకు ఫిట్‌నెస్‌ లేకపోవడం, సామర్థ్యానికి మించి ఎక్కువమందిని వాటిల్లో ఎక్కించడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రధానంగా ఘాట్‌రోడ్డులో అదుపుతప్పి ఆయా వాహనాలు బోల్తా పడుతుండగా.. గిరిశిఖర గ్రామ గిరిజనులు తరచూ ప్రమాదాలకు గురువుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించాలని, గిరిజనులకు అవగాహన కల్పించి.. వారి భద్రతకు చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘం నేతలు మణికుమార్‌, భగవాన్‌, రంజిత్‌కుమార్‌, సాయిబాబు, ఈశ్వరరావు తదితరులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Mar 01 , 2024 | 11:47 PM