Share News

ఆసరా సదస్సులో ఆకలి కేకలు

ABN , Publish Date - Feb 02 , 2024 | 11:27 PM

మండలంలోని అంతకాపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఆసరా సదస్సు రచ్చర చ్చగా మారింది. సదస్సు నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది.

ఆసరా సదస్సులో ఆకలి కేకలు
భోజన ప్లేట్లతో ఎండలో నిల్చొన్న మహిళలు

- మండుటెండలో మహిళల ఇబ్బందులు

- సభ నుంచి వెనుదిరిగిన వైనం

రాజాం/రూరల్‌, ఫిబ్రవరి 2: మండలంలోని అంతకాపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఆసరా సదస్సు రచ్చర చ్చగా మారింది. సదస్సు నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. సమావేశానికి హాజరుకాకపోతే ఆసరా డబ్బులు ఖాతాలో వేయమని డ్వాక్రా మహిళలను బెదిరించి ఆటోల ద్వారా సదస్సుకు తరలించిన అధికారులు వారికి కనీస సౌకర్యాల కల్పనలో ఘోరంగా వైఫల్యం చెందారు. ఫలితంగా నిలువనీడ లేక, గుక్కెడు నీరు, తినేందుకు భోజనం దొరక్క మహిళలు నరకం చూశారు. దీంతో శాపనార్ధాలు పెడుతూ ఈసురోమంటూ మహిళలు ఇంటిబాట పట్టారు. రాజాం మున్సిపాలిటీతో పాటు రూరల్‌ ప్రాంతంలోని 6,500 మంది డ్వాక్రా మహిళలతో అంతకాపల్లి గ్రామంలో ఆసరా సదస్సు నిర్వహించారు. ఉదయం 10 గంటలకే మహిళలు చేరుకున్నారు. అయితే, మధ్యాహ్నం 12 గంటల దాటాక వైసీపీ ముఖ్యనేతలంతా సదస్సుకు హాజరయ్యారు. అయితే, వీరికి తగ్గట్లు ఏర్పాట్లు చేయడంలో నిర్వాహకులు విఫలమయ్యారు. పూర్తిస్థాయిలో టెంట్లు వేయకపోవడంతో ఎండకు తట్టుకోలేక మహిళలు విలవిల్లాడారు. దీంతో సమావేశం జరుగుతుండగానే వెనుదిరిగారు. ఎండలో తమను కూర్చోబెట్టారని, కనీసం తాగటానికి నీరు కూడా ఇవ్వలేదని వైసీపీ నేతలపై మహిళలు మండిపడ్డారు. సదస్సుకు సమీపంలోని పొలంలో భోజనం ఏర్పాట్లు చేశారు. నీడ లేకపోవడంతో మండుటెండలో ప్లేట్లు పట్టుకొని నానా అవస్థలు పడ్డారు. సగానికి పైగా మహిళలు ఆకలితో ఉసూరుమంటూ వెనుదిరిగారు. ముఖ్యనాయకులకు చికెన్‌ పెట్టి మహిళలకు వంకాయ, శనగల కూరతో సరిపెట్టారు.

తోపులాట..

జామి/మెంటాడ: జామి మండలం కుమరాం, మెంటాడ మండలం కైలాం గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన ఆసరా సభలో ఏర్పాటు చేసిన భోజనాల వద్ద తోపులాట చోటుచేసుకుంది. ఈ సభలకు వేలాదిమందిని తరలించేందుకు దృష్టిపెట్టిన నేతలు వారికి భోజనాల కల్పనలో నిర్లక్ష్యం వహించారు. కైలాంలో భోజనాల కౌంటర్‌ వద్ద తొక్కిసలాట జరిగి జామి ఎల్లమ్మ అనే మహిళ సొమ్మసిల్లి పడిపోయింది.

Updated Date - Feb 02 , 2024 | 11:27 PM