Share News

పిచ్చి కుక్కల స్వైర విహారం

ABN , Publish Date - Oct 25 , 2024 | 12:18 AM

చీపురుపల్లిలో గురువారం పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి.

పిచ్చి కుక్కల స్వైర విహారం

చీపురుపల్లి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): చీపురుపల్లిలో గురువారం పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో సంచరించి 53 మందిని గాయపరిచాయి. జి. అగ్రహారం, పిల్లపేట, శివరాం రోడ్డు, డైలీ మార్కెట్‌, మెయిన్‌ రోడ్డు తదితర ప్రాంతాల్లో మహిళలు, విద్యార్ధులపై దాడి చేశాయి. దీంతో వీరంతా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. గురువారం మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో పట్టణంలో రెండు పిచ్చి కుక్కల స్వైర విహారంతో అలజడి రేగింది. గాయపడిన వారంతా ఒకేసారి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోవడంతో, అక్కడ ఆందోళనకర వాతావరణం నెల కొంది. సమాచారం తెలుసుకున్న స్థానిక వైసీపీ నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు తదితరులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని, గాయపడిన వారికి సపర్యలు చేశారు. కర్లాం పీహెచ్‌సీ వైద్యులు డా. సువర్ణ, అక్కడి సిబ్బంది చీపురుపల్లి చేరుకుని వైద్యం అందించారు. పిచ్చికుక్కల సమా చారం అందుకున్న పంచాయతీ తనిఖీ అధికారి జి. వేణుగోపాలరావు, తన సిబ్బందితో కలిసి కుక్కల్ని పట్టుకొని దూర ప్రాంతానికి తరలించారు.

జిల్లా వైద్యాధికారికి ఎమ్మెల్యే ఫోన్‌

చీపురుపల్లిలో కుక్కల దాడిలో 53 మందికి గాయాలైన సమాచారాన్ని తెలుసు కున్న ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు తక్షణమే స్పందించి, జిల్లా వైద్యాధికారితో ఫోన్‌లో మాట్లాడారు. కుక్కలు జరిపిన దాడిలో ఎక్కువ మంది గాయపడినందు న అందుబాటులో ఉన్న ప్రాంతాల నుంచి వ్యాక్సిన్‌ తెప్పించాలని సూచించారు. అవసరమైన మేరకు ఇతర ప్రాంతాల నుంచి వైద్యుల్ని కూడా రప్పించాలని కోరా రు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సుధీర్‌ పర్యవేక్షణలో సిబ్బంది చికిత్స చేశారు.

Updated Date - Oct 25 , 2024 | 12:18 AM