Share News

ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌

ABN , Publish Date - May 28 , 2024 | 11:13 PM

వచ్చేనెల నాలుగో తేదీన ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్‌కుమార్‌ తెలిపారు. దీనికి అరగంట ముందుగా అంటే ఉదయం 7.30 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించనున్నట్లు స్పష్టం చేశారు.

ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌
సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌, ఎస్పీ తదితరులు

కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

పార్వతీపురం, మే28 (ఆంధ్రజ్యోతి): వచ్చేనెల నాలుగో తేదీన ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్‌కుమార్‌ తెలిపారు. దీనికి అరగంట ముందుగా అంటే ఉదయం 7.30 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించనున్నట్లు స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షించారు. గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర ఉద్యాన కళాశాలలో జిల్లాలో నాలుగు శాసనసభ నియోకవర్గాలతో పాటు అరకు పార్లమెంట్‌ నియోజకవర్గానికి చెందిన పోస్టల్‌ బ్యాలెట్లు, ఈవీఎంలను లెక్కిస్తామన్నారు. ఈవీఎంల ఓట్ల లెక్కింపునకు 8 కౌంటింగ్‌ హాళ్లు, 14 టేబుళ్లు, పోస్టల్‌ బ్యాలెట్లకు ఒక కౌంటింగ్‌ హాల్‌, 20 టేబుళ్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పార్లమెంట్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపునకు ప్రతి టేబుల్‌ వద్ద ఒక జిల్లాస్థాయి అధికారి, సహాయ రిటర్నింగ్‌ ఆఫీసర్‌, గజిటెడ్‌ అధికారి, ఇతర సిబ్బంది ఉంటారని తెలిపారు. అదేవిధంగా రిటర్నింగ్‌ అధికారి పర్యవేక్షణలో శాసనసభ నియోజకవర్గ ఈవీఎంలు, పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపునకు రెండు టేబుళ్లు ఏర్పాటు చేశామన్నారు. ఓట్ల లెక్కింపు వద్ద అభ్యర్థి గాని, ప్రధాన ఏజెంట్‌గాని ఉండొచ్చన్నారు. ప్రతి టేబుల్‌ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్‌ ఉంటారని తెలిపారు. రిటర్నింగ్‌ అధికారి వేదిక వద్ద జరిగే పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు వద్ద ఇద్దరు మైక్రో అబ్జర్వర్లు ఉంటారని, మొత్తం రెండు వందల మందిని నియమించామని వెల్లడించారు. ఉదయం 6:30 గంటలకు స్ర్టాంగ్‌ రూమ్‌లను తెరుస్తామని, అప్పటికే ఏజెంట్లు హాజరు కావల్సి ఉందని తెలిపారు. ఈవీఎంల ఓట్లు లెక్కింపు కేంద్రానికి, పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ కేంద్రాలకు వెళ్లడానికి ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశామన్నారు. ఉద్యాన కళాశాలల్లో ఏబీసీ బాకుల్లో కౌంటింగ్‌ హాల్స్‌ ఉంటాయని చెప్పారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు పరిశీలకులుగా ఉంటారని తెలిపారు.

- జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని కలెక్టర్‌ చెప్పారు.. కౌంటింగ్‌ అనంతరం పరిస్థితుల రీత్యా దాని కొనసాగింపుపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. లెక్కింపు కేంద్రం వద్ద గట్టి బందోబస్తు, నిఘా ఏర్పాటు చేశామని వెల్లడించారు. 158 సీసీ కెమెరాలు, రెండు డ్రోన్లు నిరంతరం పనిచేస్తాయన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించామన్నారు. అనంతరం ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ మాట్లాడుతూ.. కేంద్రం బయట నిర్దేశిత ప్రదేశంలో వాహనాలను పార్కింగ్‌ చేయాలన్నారు. ఎక్కడా ఎక్కువ మంది గుమిగూడరాదని తెలిపారు. ఈ సమావేశంలో జేసీ శోభిక, ఇన్‌చార్జి డీఆర్వో జి.కేశవనాయుడు తదితరులున్నారు.

- కౌంటింగ్‌ కేంద్రాలకు ఎటువంటి ఎలక్ర్టానిక్‌ పరికరాలకు అనుమతి లేదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. మొబైల్‌ ఫోన్లు, కెమెరాలు, స్మార్ట్‌ వాచ్‌లు తదితర వాటిని తీసుకురాకూడదన్నారు. ఏజెంట్లు పెన్ను, పెన్సిల్‌, 17-సీ ఫారం, తెల్ల కాగితం మాత్రమే తేవాలని తెలిపారు.

Updated Date - May 28 , 2024 | 11:13 PM