Share News

‘సహకార’ ఎన్నికలెప్పుడో?

ABN , Publish Date - Jan 17 , 2024 | 11:59 PM

కోపరేటివ్‌ ఎన్నికల నిర్వహణపై వైసీపీ ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌, డీసీసీబీలకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్‌ పదవుల మాదిరిగా పాలక వర్గ పదవీ కాలం గడువు పొడిగిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

‘సహకార’ ఎన్నికలెప్పుడో?
జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌

- నిర్వహణపై ప్రభుత్వం నిర్లక్ష్యం

- నామినేటెడ్‌ పదవుల్లా మార్చేసిన వైనం

- పాలకవర్గాల పదవీ కాలం పెంపుపై విమర్శలు

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

కోపరేటివ్‌ ఎన్నికల నిర్వహణపై వైసీపీ ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌, డీసీసీబీలకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్‌ పదవుల మాదిరిగా పాలక వర్గ పదవీ కాలం గడువు పొడిగిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి సహకార బ్యాంకుల్లో సభ్యులుగా ఉన్న ఓటర్ల ద్వారా ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ, అలా చేయకుండా నామినేటెడ్‌ పదవుల మాదిరిగా గడువును పెంచుతూ వైసీపీ నాయకు లను పదవుల్లో కొనసాగిస్తోంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 34 మండలాల్లో 2013లో సహకార సంఘాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించారు. అప్పట్లో మొత్తం 108 సహకార సంఘాలకు ఎన్నికలు జరిగాయి. డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు చైర్మన్లు ఏర్పాటయ్యారు. తరువాత 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలో సహకార ఎన్నికలు జరగాల్సి ఉన్నా స్థానిక ఎన్నికలు ముందుండడంతో ఆ జోలికి వెళ్లలేదు. అయితే, స్థానిక ఎన్నికల తరువాత కొత్తగా అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం సహకార ఎన్నికలపై పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. నాలుగున్నరేళ్లుగా ఎన్నికలు నిర్వహించ కుండా పాలకవర్గ పదవీ కాలం పెంచుకుంటూ వస్తోంది. ఈ నెలలో పాలకవర్గ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం మరోసారి చైర్మన్‌తో పాటు మొత్తం పాలకవర్గ సభ్యుల పదవీకాలాన్ని ఈ ఏడాది జూలై 17 వరకు పెంచింది. దీంతో చైర్మన్‌గా వేచలపు వెంకటచినరాము నాయుడుతో పాటు ఏడుగురు సభ్యులు తమ పదవుల్లో కొనసాగనున్నారు. అయితే పొడిగించిన పదవీ కాలం, లేదా ఎన్నికలు ఏది ముందు వస్తే దాని ఆధారంగా పాలకవర్గ పదవీ కాలం ముగుస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. డీసీఎంఎస్‌ పాలకవర్గ పదవీ కాలన్నీ పెంచనున్నారు. ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించకుండా దొడ్డిదారిన ప్రభుత్వం పదవీకాలం పెంచడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Jan 17 , 2024 | 11:59 PM