Share News

స్ట్రాంగ్‌ రూమ్‌ తెరవడంపై వివాదం

ABN , Publish Date - May 17 , 2024 | 12:02 AM

ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్సులను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ను అధికారులు తెరవడంపై వివాదం చెలరేగింది.

స్ట్రాంగ్‌ రూమ్‌ తెరవడంపై వివాదం
అధికారులను ప్రశ్నిస్తున్న టీడీపీ నాయకులు

- మాకు సమాచారం ఇవ్వకుండా ఎలా తెరుస్తారంటూ టీడీపీ ఆందోళన

- ఇతర జిల్లాల పోస్టల్‌ బ్యాలెట్లను వేరుచేయడానికే ఓపెన్‌ చేశామంటున్న అధికారులు

విజయనగరం, మే 16 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్సులను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ను అధికారులు తెరవడంపై వివాదం చెలరేగింది. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా స్ట్రాంగ్‌ రూమ్‌ను ఎలా తెరుస్తారంటూ టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఉద్యోగులు ఓటేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్సులను విజయనగరం తహసీల్దార్‌ కార్యాలయంలోని స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపర్చారు. అయితే ఈ స్ట్రాంగ్‌ రూమ్‌లను గురువారం రాత్రి అధికారులు తెరిచారు. ఈ విషయం తెలుసుకున్న విజయనగరం టీడీపీ అభ్యర్థి అదితి గజపతిరాజు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, పార్టీ శ్రేణులు అక్కడకు చేరుకుని ఆందోళన చేశారు. తమకు తెలియకుండా స్ట్రాంగ్‌ రూమ్‌ను ఎలా తెరుస్తారంటూ అధికారులను నిలదీశారు. స్ట్రాంగ్‌ రూమ్‌ను తెరవాలంటే పోటీలో ఉన్న అభ్యర్థుల అందరికీ తెలియజేయాలని, కానీ ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి కూడా సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా తెరవడం ఏంటని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో మొదటినుంచి కూడా యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఈ విషయాన్ని జాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌ వద్ద ప్రస్తావించగా.. ‘తహసీల్దార్‌ కార్యాలయంలోని పోస్టల్‌ బ్యాలెట్‌ స్ట్రాంగ్‌ రూమ్‌ను అన్నిపార్టీల అభ్యర్థులు, ఏజెంట్లకు సమాచారం ఇచ్చిన తరువాతే తెరిచాం. పోలీసుల పహరా మధ్య తెరిచాం. వీడియో రికార్డింగ్‌ కూడా చేశాం. కార్యాలయం, స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఇతర జిల్లాల పోస్టల్‌ బ్యాలెట్లను వేరు (గ్రెవింగ్‌) చేసేందుకు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు స్ట్రాంగ్‌ రూమ్‌ తెరిచాం. బయట జరుగుతున్న ప్రచారం సరికాదు.’ అని తెలిపారు.

Updated Date - May 17 , 2024 | 12:02 AM